బందరు చేప భలే భలే.. స్పెషల్‌ ఏంటంటే?

27 Aug, 2022 07:49 IST|Sakshi

దేశ, విదేశాల నుంచి మంచి డిమాండ్‌ 

కాలుష్యం లేని చేపలు ఇక్కడ ప్రత్యేకం 

నాణ్యత, రుచికి పెట్టింది పేరు 

వందల రకాలకు పైగా చేపలు.. 

20 రకాల చేపలకు డిమాండ్‌ 

పోటీపడి కొనుగోలు చేస్తున్న యూరోపియన్, జపాన్‌ దేశాలు  

సాక్షి, మచిలీపట్నం: బందరుకు ఆనుకుని బంగాళాఖాతంలో లభ్యమయ్యే చేప నాణ్యతకు.. రుచికి పెట్టింది పేరు. ఇక్కడ లభ్యమయ్యే చేపల్లో ఎలాంటి రసాయన ధాతువులు ఉండవు. అందుకే ఈ చేపలకు మంచి డిమాండ్‌. ఇక్కడ వందల రకాలు లభ్యమవుతుండగా వాటిలో 20 నుంచి 25 రకాల చేపలకు మాత్రం మంచి గిరాకీ ఉంది. ఈ చేపల కోసం విదేశీయులు కూడా ఎగబడుతున్నారు.

అలాగే దేశంలోని విశాఖ, కాకినాడ, చెన్నై, ముంబై, కోల్‌కతా నగరాలకు చెందిన ఏజెంట్లు ఎగరేసుకుపోతుంటారు. రాష్ట్రంలోని ఇతర తీర ప్రాంతాలతో పోల్చుకుంటే మచిలీపట్నంలో కాలుష్యం చాలా తక్కువ. ఇక్కడ నుంచి గత కొన్నేళ్లుగా సముద్ర ఉత్పత్తులు పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 111 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. జిల్లాలో ఏకైక ఫిషింగ్‌ హార్బర్‌ మచిలీపట్నం సమీపంలోని గిలకలదిండిలో ఏర్పాటైంది. ఈ హార్బర్‌కు యూరోపియన్‌ దేశాల గుర్తింపు కూడా ఉంది. 

వందల రకాల మచిలీలు..
మచిలీపట్నం తీరంలో ఎక్కువగా తెల్ల చందువా (సిల్వర్‌ అండ్‌ వైట్‌ పాంప్రెట్‌), నల్ల చందువా (బ్లాక్‌ పాంప్రెట్‌), కోణాం, ముక్కు కోణాం (స్వర్డ్‌ ఫిష్‌), నెమలి కోణాం (సెయిల్‌ ఫిష్‌), వంజరం (సీర్‌ ఫిష్‌), నాలుకలు (సోల్‌), నామాల తూర (స్కిప్‌ జాక్‌ టూనా), పసుపురెక్క తూర (ఎల్లో ఫిన్‌), పెద్దకన్ను తూర (బిగ్‌ ఐ), కానా కంతలు (మాకేరల్స్‌), పావడాయి (రిబ్బన్‌), గొరక (క్రోకర్స్‌), సొర చేప, కండువ, మూడు చుక్కల పీత (త్రీస్పాట్‌ స్విమ్మింగ్‌ క్రాబ్‌)లతోపాటు టైగర్, వైట్‌ నారన్, పింక్, పువాలన్‌ (కలందన్‌), కరికేడి, శంఖు, డీప్‌ సీ ఫ్రాన్స్, కుక్కరొయ్యలు, సారగొరక, గులిగింత, జల్లలు, కుక్కసావడాయి, మెత్తా్తళ్లు, తెంగుడు రొయ్యపొట్టు ఎక్కువగా దొరుకుతాయి.

వీటిలో ప్రధానంగా టూనా, కోణాంలతోపాటు వంజరం, చందువా, రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. అయితే అత్యధిక ధర తెల్ల చందువా (కిలో రూ.2 వేల వరకు), కోణం (కిలో రూ.700) పలుకుతున్నాయి. వేటకు వెళ్లిన వారు రోజూ అనేక రకాల చేపలను గిలకలదిండి హార్బర్‌కు తెస్తున్నారు. అక్కడ వ్యాపారులు వేలంపాట ద్వారా చేపలను కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నారు. మరికొందరు నేరుగా విశాఖ, కాకినాడ, చెన్నై తీసుకెళ్లి అక్కడే విక్రయిస్తున్నారు. సీజన్‌ను బట్టి వీటికి మరింత ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. మచిలీపట్నంలో చేపల చెరువుల్లో ప్రత్యేకంగా పెంచే చేపల్లో పండుగప్ప, శీలవతి, తుల్లులు, నేమ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.   

టూనా చేపలకు డిమాండ్‌
మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఎటువంటి రసాయన పరిశ్రమలు లేవు. పెద్ద ఓడల రాకపోకలూ తక్కువే.  రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో దొరికే వాటిలో రసాయన ధాతువులు ఎక్కువగా ఉంటున్నాయని.. మచిలీపట్నంలో నామమాత్రంగా కూడా ఉండడం లేదని యూరోప్, జపాన్‌ దేశస్తులు గుర్తించడం విశేషం. మచిలీపట్నం తీరంలో దొరికే టూనా చేపల కోసం జపాన్‌ దేశస్తుల నుంచి మంచి డిమాండ్‌ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. నాణ్యమైన మత్స్య ఉత్పత్తులు ఇక్కడ దొరుకుతున్నాయి.

సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) నుంచి తీసుకునే క్యాచింగ్‌ సర్టిఫికెట్‌లో మచిలీపట్నం సీకోస్ట్‌ అని ఉంటే చాలు ఎలాంటి ఆంక్షలు విధించడం లేదని చెబుతున్నారు. బందరు చేపల కోసం విశాఖ, కాకినాడ, చెన్నై, కోచి, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, సికింద్రాబాద్‌ వ్యాపారులు ఇక్కడ కొందరు ఏజెంట్లను కూడా నియమించుకున్నారు. రోజూ మత్స్యకారుల నుంచి కొనుగోలు చేసిన చేపలను ఏజెంట్లు ఆయా ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు