జీడి పప్పు తొక్కతో లాభాలెన్నో.. లక్షల్లో సంపాదన!

13 Oct, 2022 08:12 IST|Sakshi

కాశీబుగ్గ: జీడి పప్పు రుచి అందరికీ తెలిసిందే. జీడి పప్పు తయారీ విధానం, వ్యాపారం కూడా చాలా మందికి పరిచయమే. కానీ ఆ జీడిపప్పుకు కవచంలా ఉండే తొక్కతో కూడా లక్షలాది రూపాయల వ్యాపారం జరుగుతుందని తెలుసా..? ఈ తొక్కతో తయారు చేసే ఆయిల్‌ మిశ్రమానికి విదేశాల్లో చాలా డిమాండ్‌ ఉంది. అందుకే పలాస నుంచి మన దేశంలోని ఇతర ప్రాంతాలకే కాకుండా విదేశాలకు కూడా ఈ ఆయిల్‌ను ఎగుమతి చేస్తున్నారు.  

ఆ రక్షణ కవచమే.. 
జీడి చెట్టు పువ్వుల నుంచి జీడి పిక్కలు కాస్తాయి. పిక్కల దశ నుంచి పప్పు తయారీ వరకు సహజ సిద్ధంగా ఉండే రక్షణ కవచాలే జీడి తొక్కలు. జీడి గుడ్డు సేకరణ అనంతరం ఈ తొక్క ఎందుకూ పని రాదని ఒకప్పుడు పడేసేవారు. అవే నేడు కోట్లు కురిపిస్తున్నాయి. ఇప్పుడు తొక్క కిలో రూ.10 పలుకుతోంది. రోజుకు 300 నుంచి 400 టన్నుల వరకు జీడి తొక్కను ఆయిల్‌ తీయడానికి వినియోగిస్తున్నారు. ఈ మూలంగా 8000 లీటర్ల ఆయిల్‌ను సేకరిస్తున్నారు. ముడి సరుకుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 

ఫుల్‌ డిమాండ్‌.. 
పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు పరిసర ప్రాంతాల్లో సుమారు 300 వరకు జీడిపరిశ్రమలు, జిల్లా వ్యాప్తంగా, ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో మరో 100 పరిశ్రమల్లో జీడి పప్పు తయారీ జరుగుతుంది. పప్పు సేకరణ అనంతరం జీడితొక్కను పక్కన పడేయకుండా, కొందరు వంట చెరకుగా వినియోగిస్తుంటే మరికొందరు కిలోల లెక్కన ఆయిల్‌ పరిశ్రమలకు విక్రయిస్తున్నారు. 

పలాస పరిసరాల్లో సుమారు 12 జీడి ఆయిల్‌ పరిశ్రమలు ఉన్నాయి. రోజుకు 4 లక్షల కేజీల జీడి పిక్కలను వినియోగించి వాటి నుంచి వచ్చే 3 లక్షల కేజీల తొక్కతో 8000 లీటర్లు ఆయిల్‌ సేకరిస్తారు. అనంతరం మిగిలిన పదార్థాన్ని  వంటచెరకు కింద వాడుతున్నారు. రెండోసారి సది్వనియోగమయ్యే వస్తువుగా పరిగణించిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేసింది. పూర్తి ప్రోత్సాహకాలతో పాటు జీఎస్టీ రేట్లను సైతం పూర్తిగా తగ్గించింది. పరిశ్రమల్లో మంట కోసం ఇలాంటి వాటిని వినియోగించాలని కోరుతోంది. 


 
ఆయిల్‌ ఉత్పత్తి ఇలా..   
జీడి పరిశ్రమలో లభించిన తొక్క బస్తాలను వ్యాను, లారీల్లో వే బ్రిడ్జిల వద్ద తూస్తారు. అక్కడి నుంచి కూలీల సహకారంతో ఆయిల్‌ పరిశ్రమలకు చేరుస్తారు. అక్కడే అసలు పరీక్ష ఉంటుంది. జీడి తొక్కలో ఆయిల్‌ ఉందా లేదా అని తొక్కకు పరీక్షలు జరిపి వాటిని ఆయిల్‌ పరిశ్రమలో మిషనరీకి బెల్టుతో పంపుతారు. కిలోల చొప్పున పంపించి వాటిని పిండి పిప్పి చేసి ఆయిల్‌ను ప్రత్యేకమైన కెనాల్‌ ద్వారా సిమెంట్‌ బావికి తరలిస్తారు.  

అక్కడ కొన్ని రోజులు తేటగా మారిన అనంతరం తిరిగి ట్యాంక్‌లోకి పంపించి 90 డిగ్రీల వరకు వేడి చేసి నీటిని ఆవిరి రూపంలో బయటకు పంపిస్తారు. అనంతరం డ్రమ్ములతో నింపి ట్రాన్స్‌పోర్టు లారీల్లో వివిధ ప్రాంతాలకు పంపిస్తారు. మన దేశంలో హైదరాబాద్, విశాఖపట్నం, రాజస్థాన్, పంజాబ్, బెంగళూర్‌తోపాటు విదేశాలకు పంపిస్తారు. అక్కడ ఆయిల్‌ను ఆయా కంపెనీలు వివిధ రకాలుగా రూపాంతరం గావించి  వాటిని సౌత్‌ కొరియా, ఖతార్, వియత్నాం, రష్యా, చైనా వంటి విదేశాలకు పంపుతారు.  

ఉపాధి కోణం..  
జిల్లా వ్యాప్తంగా జీడి పరిశ్రమలపై ఆధారపడి 20వేల మంది వరకు జీవిస్తుండగా.. జీడి తొక్క ఆయిల్‌ పరిశ్రమలు కూడా మరో రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.  

ఉపయోగాలెన్నో..
ఈ ముడి సరుకును రోడ్లకు వాడే తారు ఫ్యాక్టరీల్లో తారు తయారీకి, పెయింటింగ్స్‌ తయారీలో, వార్నిష్‌లు, బయోడీజిల్‌ తయారీకి వాడుతున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పునీటి కారణంగా  పెద్ద పెద్ద షిప్‌లు, బోట్లు, స్టీమర్లు,  పాడైపోకుండా ఈ ఆయిల్‌ను తరచుగా పూస్తారు.  

విదేశాలకు ఎగుమతి..  
పలాస నుంచి విదేశాలకు జీడిపప్పే కాదు జీడి ఆయిల్‌ సైతం ఎగుమతి కావడం మన ప్రాంత గొప్పతనంగా భావిస్తున్నాను. ప్రపంచమంతా వినియోగించే తారు, పెయింటింగ్స్, బయోడీజిల్‌ తయారీలో మన పలాస ఆయిల్‌ వాడటం మనం గొప్పగానే చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో ఆయిల్‌ సేకరణ పెరిగి మరింత మందికి ఉపాధి కలుగుతుంది. వైఎస్సార్‌ చలవతో పలాస ఇండస్ట్రియల్‌ ఏరియాలో మేము జీడి పరిశ్రమతో పాటు ఆయిల్‌ సేకరించే పరిశ్రమను ఏర్పాటు చేసుకుని నడుపుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో రాయితీలు అందించింది. ఔత్సాహికులకు ఇలాంటి పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తే మరింత మేలు జరుగుతుంది.  
– కోరాడ శ్రీనివాసరావు, ఆయిల్‌  పరిశ్రమ యజమాని, ఇండ్రస్టియల్‌ ఏరియా, పలాస.  

మరిన్ని వార్తలు