కేంద్రానిదే ‘చెత్త’ చార్జి

31 Mar, 2022 03:43 IST|Sakshi
చెత్త యూజర్‌ చార్జీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2015లో విడుదల చేసిన జీవో కాపీలు

సాక్షి, అమరావతి: నిధుల మంజూరుకు కేంద్రం పెట్టిన నిబంధనలతో 2015లోనే ‘చెత్త’ చార్జీలు మొదలయ్యాయి. ఏపీలోని అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా దానిని తూ.చ. తప్పకుండా పాటించింది. రాష్ట్రాల్లో తాము అమలు చేస్తున్న పథకాలకు నిధులు కావాలంటే.. వాటిలో వినియోగించే యంత్రాలు, సిబ్బంది నిర్వహణకు ప్రజల నుంచే వినియోగ(యూజర్‌) చార్జీలు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం 2015లోనే ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగ చార్జీలు వసూలు చేయని రాష్ట్రాలకు నిధులు నిలిపివేస్తామని తేల్చిచెప్పింది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా ఇంటింటి నుంచి చెత్తను తీసుకెళ్లే వాహనాలు, సిబ్బంది నిర్వహణకు స్థానిక పాలనా సంస్థలు వంద శాతం వినియోగ చార్జీలను.. ప్రతి నెలా ప్రజల నుంచే వసూలు చేయాలని 2015 జూలై 27న ఇచ్చిన ఉత్తర్వుల్లో కేంద్రం స్పష్టం చేసింది.

ఆ వెనువెంటనే ఆగస్టు 19న రాష్ట్రంలోని అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా చెత్త సేకరణపై వినియోగ చార్జీల వసూలుకు మెమో జారీ చేసింది. మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగం ఈ మెమో (నం.36579/బి2/2015)ను విడుదల చేసింది. ఇంటింటి చెత్త సేకరణకు చార్జీలు వసూలు చేయాలని పట్టణ స్థానిక సంస్థలకు ఆదేశాలిచ్చింది. మరోవైపు వీధుల్లో పారిశుధ్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు, ఇళ్ల నుంచి ప్రతిరోజు చెత్త తరలింపు కోసం గుంటూరు నగరంలోని దుకాణాలు, థియేటర్లు, ప్రైవేట్‌ హాస్టళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, సూపర్‌ మార్కెట్లు, టీస్టాళ్ల నుంచి వినియోగ చార్జీలు వసూలు చేయాలని ఆ నగరపాలక సంస్థ 2015 ఏప్రిల్‌లోనే తీర్మానించింది. తర్వాత రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు కూడా ఇదే నిర్ణయం తీసుకుని అమలు చేశాయి. 

75 శాతం వసూలు చేసిన పట్టణ సంస్థలకే నిధులు!
కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కోసం 2016 ఏప్రిల్‌ 8న గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇంటింటి చెత్త సేకరణ కోసం స్థానిక పాలనా సంస్థల ద్వారా యూజర్‌ చార్జీలు వసూలు చేయాలని అన్ని రాష్ట్రాలనూ కేంద్రం ఆదేశించింది. ఘన వ్యర్థాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్‌తో పాటు తరలింపు సేవలను అందించేందుకు ప్రజల నుంచి చార్జీలు వసూలు చేయడాన్ని తప్పనిసరి చేసింది. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణకు, నిర్వహణకు స్థానిక సంస్థలు తగినంత మంది సిబ్బందిని నియమించాలని సూచించింది.

తాము అమలు చేస్తున్న ‘స్వచ్ఛ’ కార్యక్రమాలకు నిధులు కావాలంటే వినియోగ రుసుం వసూలు తప్పనిసరి అని కేంద్రం తేల్చిచెప్పింది. 15వ ఆర్థిక సంఘం సైతం స్థానిక పట్టణ సంస్థలు ఇంటింటి చెత్త సేకరణకు తప్పనిసరిగా ప్రజల నుంచి చార్జీలు వసూలు చేయాలని ఆదేశించింది. 75 శాతం యూజర్‌ చార్జీలు వసూలు చేసిన స్థానిక పట్టణ సంస్థలకే రెండో విడత స్వచ్ఛ భారత్‌ మిషన్‌ నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాలకే కాకుండా.. కేంద్రం అమలు చేస్తున్న అన్ని పథకాల్లోనూ.. ఎక్కడ ‘నిర్వహణ’ అవసరముంటే అక్కడ తప్పనిసరిగా ప్రజల నుంచి వినియోగ చార్జీలు వసూలు చేయాలని పేర్కొంది. 

మరిన్ని వార్తలు