సొసైటీ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

5 Sep, 2021 04:25 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నయడవల్లి సొసైటీ భూముల రైతులు

99 శాతం మంది రైతులు భూములు ఇవ్వడానికి అనుకూలం 

సీపీఎం మధు వ్యాఖ్యలపై మండిపడ్డ యడవల్లి రైతులు

చిలకలూరిపేటటౌన్‌: యడవల్లి సొసైటీ భూములు ప్రభుత్వం తీసుకోవడాన్ని దళిత రైతులు వ్యతిరేకిస్తున్నారంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు చేసిన వ్యాఖ్యలపై యడవల్లికి చెందిన రైతులు మండిపడ్డారు. భూముల వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన మధును స్థానిక రైతులు అడ్డుకున్నారు. అనంతరం వారంతా చిలకలూరిపేట పట్టణంలోని అంబేడ్కర్‌ భవన్‌కు ర్యాలీగా చేరుకొని సీపీఎంకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తగిన పారితోషికం ఇప్పించాలంటూ తాము సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుకు విన్నవించామని, అది నచ్చని మధు నాటకాలాడొద్దంటూ తమ మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని వివరించారు. గత నెలలో ఎస్సీ కమిషన్‌ గుంటూరు వచ్చినప్పుడు తాము భూములు ఇస్తామని వినతిపత్రం ఇచ్చినట్లు వివరించారు.

99 శాతం మంది రైతులు భూములు ఇవ్వటానికి సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని స్థానిక  ఎమ్మెల్యే విడదల రజిని దృష్టికి తీసుకువెళ్లామని, ఆమె సానుకూలంగా స్పందించి భూములను ప్రభుత్వం తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే భూములు స్వాధీనం చేసుకొని నష్టపరిహారం ఇస్తారన్న భరోసాతో ఉన్నామని, ఈ సమయంలో ఏ రాజకీయపార్టీ కూడా జోక్యం చేసుకోవద్దని కోరారు. 2019 ఎన్నికల ప్రచార సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి యడవల్లి సొసైటీ భూముల రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ నెరవేర్చుతారన్న నమ్మకం తమకు ఉందన్నారు.

ఈ హామీలో భాగంగా తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొనేందుకు ముందడుగు వేసిందని, దీన్ని కొంతమంది అడ్డుకోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం తాము ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం తమ భూములు స్వాధీనం చేసుకుంటే ప్రతి కుటుంబానికి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని వివరించారు. సమావేశంలో ఈపూరి రాంబాబు, పరిశపోగు శ్రీనివాసు, వేల్పుల సాంబయ్య, రమేష్, అంకమ్మ రావు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు