మాట నిలబెట్టుకున్నారు 

26 Oct, 2021 04:00 IST|Sakshi
సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న యడవల్లి రైతులు, ఎమ్మెల్యే విడదల రజని

సీఎం వైఎస్‌ జగన్‌కు యడవల్లి దళిత రైతుల కృతజ్ఞతలు  

చిలకలూరిపేట: టీడీపీ హయాంలో ఎడతెగని పోరాటం చేసిన గుంటూరు జిల్లా యడవల్లి దళిత రైతులకు సీఎం వైఎస్‌ జగన్‌ న్యాయం చేశారు. వారి భూములకు ప్రభుత్వం తరఫున పరిహారం చెల్లించి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దీనిపై యడవల్లి దళిత రైతులు కృతజ్ఞతలు తెలియజేస్తూ సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వివరాలు.. టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ భూముల రక్షణ కోసం యడవల్లి దళితులు అలుపెరుగని పోరాటం చేశారు. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యను తెలియజేశారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని వారికి వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. చిలకలూరిపేట మండలం యడవల్లి వీకర్స్‌ సెక్షన్‌ ల్యాండ్‌ కాలనైజేషన్‌ సొసైటీకి చెందిన ఈ భూములను ప్రభుత్వం ఏపీఎండీసీకి కేటాయించింది. ఈ భూముల్లో కొందరు దళిత రైతులు సాగు చేసుకుంటున్నారని.. వీరికి నష్టపరిహారమివ్వాలని స్థానిక ఎమ్మెల్యే విడదల రజని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు. ఏపీఎండీసీ సోమవారం నాటికి 99 శాతం మందికి నష్టపరిహారం కింద రూ.25 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేసింది. దీంతో రైతులు సోమవారం చిలకలూరిపేట వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి వచ్చి సీఎం జగన్‌కు, ఎమ్మెల్యే విడదల రజనికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే విడదల రజని మాట్లాడుతూ.. సీఎం జగన్‌ వల్ల యడవల్లి దళిత రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతుల భూములు కాజేసేందుకు అనేక కుట్రలు జరిగాయని చెప్పారు. టీడీపీ నాయకుల వల్ల ఇబ్బందులు పడిన యడవల్లి రైతులందరికీ సీఎం జగన్‌ న్యాయం చేశారన్నారు. మొత్తం 120 కుటుంబాలకు చెందిన 233 మందికి లబ్ధి కలిగేలా ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించిందని తెలిపారు.   

మరిన్ని వార్తలు