Yanamala Brothers: నాలుగు దశాబ్దాల చరిత్ర చెబుతున్నది ఇదే

25 Nov, 2022 12:01 IST|Sakshi

ప్రతి అంశానికీ రాజకీయ రంగు పులమటమే యనమల సోదరుల పని

వ్యక్తిగత కక్షతోనే పోల్నాటిపై హత్యాయత్నం

వారం తిరగకుండానే ప్రధాన నిందితుడి అరెస్ట్‌

అయినా ప్రభుత్వంపై బురదజల్లడమే టీడీపీ అజెండా 

నాటి అకృత్యాలను గుర్తు చేసుకుంటున్న తుని ప్రజలు

సాక్షి, కాకినాడ: ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ నేతల తీరు. అధికారంలో ఉన్నన్నాళ్లూ అక్రమాలను ప్రశ్నించిన గొంతుకలను కక్షలు, కార్పణ్యాలతో నొక్కేశారు. ఇలా ఆ పార్టీ నేతల అధికార దాహానికి బలైపోయిన కుటుంబాలు కోకొల్లలు. టీడీపీ ఏలుబడిలో వైకల్యాల జ్ఞాపకాలు, నెత్తుటి మరకలు చాలా కుటుంబాలను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. నాడు అరాచక పాలన సాగించిన నేతలు అధికారం ఇక కల అని తేలిపోవడంతో నేడు ఉనికి కోసం పాటుపడుతున్నారు. ప్రతి అంశానికీ రాజకీయ రంగు పులుముతున్నారు. తమ దాష్టీకాలు ఎక్కడ బయటపడతాయోనని ఈ రకమైన వ్యూహం అనుసరిస్తున్నారు.

ఎక్కడ ఏ సంఘటన జరిగినా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నిన్న గాక మొన్న తుని నడిబొడ్డున ఆ పార్టీ నాయకుడు పోల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగితే వాస్తవాలతో సంబంధం లేకుండా అధికార పార్టీపై బురదజల్లుడుకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసి తుని ప్రజల తిరస్కారానికి గురైన యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు కృష్ణుడు ఈ హత్యపై రాజకీయ దుమారానికి పాల్పడ్డారు. ప్రభుత్వం, మంత్రి దాడిశెట్టి రాజా ఇందుకు బాధ్యులంటూ దారుణ విమర్శలకు తెగబడ్డారు.

ఇదెక్కడి చోద్యం
శేషగిరిరావుపై హత్యాయత్నం కేసుపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. రాజకీయ కోణంలో కాకుండా వాస్తవ దృక్పథాన్ని ప్రదర్శించింది. ఎనిమిది ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసింది. వారం తిరక్కుండానే ఈ కేసులో ప్రధాన నిందితుడు అగ్రహారపు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించింది. ఈ సంఘటనకు ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని పోలీసులు తేల్చారు. శేషగిరిరావు వేధింపులు, బెదిరింపులే కారణమని నిర్ధారించారు. విశాఖ జిల్లా ఆరిలోవ పెద్దగదిలిలోని తన గురువు అభిరామ్‌ ఆదేశాలతో శిష్యుడు చంద్రశేఖర్‌ ఈ హత్యాయత్నానికి పాల్పడ్డట్టు బహిర్గతమైంది.

వాస్తవం ఇలా ఉంటే తెలుగు తమ్ముళ్లు రాజకీయాలు ఆపాదించి ప్రభుత్వం, మంత్రి దాడిశెట్టి రాజాపై నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. తీరా పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలుగుచూడటంతో టీడీపీ నేతల ఆరోపణలు ఏపాటివో తేలిపోయింది. 2019లో తునిలో కాతా సత్యనారాయణ హత్యోదంతానికి ఇలానే అప్పటి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాయే కారణమంటూ ఫిర్యాదు చేసి రాజకీయ లబ్ధిపొందాలనుకున్న టీడీపీ నేతలు భంగపడ్డారు. భూ తగాదాలే హత్యకు కారణమని పోలీసులు తేల్చడంతో ఆ పార్టీ నేతలు చివరకు అభాసుపాలయ్యారు.

ఇప్పటికీ మరువలేని ఘాతుకాలు
అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు తునిలో సాగించిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. రామకృష్ణుడు మంత్రిగా ఉన్న సమయంలో తెలుగు తమ్ముళ్లు సాగించిన దాడులకు లెక్కే లేదు. కొన్ని హత్యోదంతాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. ఆస్తి తగాదాలు, సరిహద్దు వివాదాలు, కోర్టు లిటిగేషన్లు, ప్రేమ వ్యవహారాలు, భూకబ్జాలు.. ఇలా వివాదం ఏదైనా నాటి పాలకులే తీర్పులిచ్చేవారు. మాట వినకుంటే దౌర్జన్యమేనని తుని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

చదవండి: (Kurnool, Nandyal: టీడీపీలో రగులుతున్న అసమ్మతి మంటలు)

రాజకీయ కక్షతోనే తాతయ్యను చంపేశారు
గతం నుంచి రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబం మాది. ఏ సమస్య వచ్చినా మా ఇంటి వద్దకు వచ్చేవారు. ఒక భూ వివాదంలో అప్పట్లో తాతయ్య మేడపురెడ్డి చంద్రయ్యనాయుడు గ్రామ పెద్దగా తగవు పరిష్కరించాలని చూసినా రాజకీయాల కారణంగా సాధ్యం కాలేదు. కోర్టులో ఆ భూ సమస్యపై నేరం రుజువైన వర్గంతో కలిసి అప్పట్లో అధికారంలో ఉన్న నేతలు తాతయ్య రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకపోయారు. 1996లో తుని కోర్టు సమీపాన మా తాతయ్యను దారుణంగా హత్య చేశారు. మా నాన్న శివగిరి, అమ్మ వెంకట రమణమ్మ సర్పంచ్‌గా పని చేశారు. అమ్మ వెంకట రమణమ్మ ప్రస్తుతం ఎంపీటీసీ సభ్యురాలు. టీడీపీలో నాటి నేతల దౌర్జన్యాలు చూస్తూ ఉండలేక మా కుటుంబం ఆ పార్టీని వదిలి బయటకు వచ్చేసింది.
– మేడపురెడ్డి భానుచంద్ర, ఎన్‌ఎన్‌ పట్నం, రౌతులపూడి

నాన్నను చంపేసి, నన్ను అవిటివాడిని చేశారు
మా నాన్న అన్నంరెడ్డి తాతయ్యనాయుడు టీడీపీ నాయకుడు. తుని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌గా పని చేశారు. 1998లో తుని నుంచి కేఓ మల్లవరం బస్సులో వస్తుండగా టీడీపీ నాయకులు కిరాతకంగా కత్తులతో నరికి చంపేశారు. ఈ కేసులో 10 మందికి జీవితఖైదు పడింది. ఆ తరువాత 2004లో కక్ష కట్టి టీడీపీ నేతలు నాపై దాడి చేసి కాలు నరికేశారు. నిందితులకు ఐదేళ్ల జైలుశిక్ష పడినప్పటికీ అప్పీల్‌కు వెళ్లడంతో శిక్ష వాయిదా పడింది. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో వికలాంగ పింఛను ఇస్తే 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో కక్ష కట్టి దాన్ని కూడా రద్దు చేశారు. కోర్టుకు వెళితే జన్మభూమి కమిటీ ముందు హాజరవ్వాలన్నారు. హాజరైతే చీడికమ్మతల్లి డిబ్బీని చోరీ చేసినట్టు తప్పుడు కేసుతో వేధించారు. ఇలా మా కుటుంబ సేవలను ఉపయోగించుకుని కూడా నన్ను అవిటివాడిని చేశారు.
– అన్నంరెడ్డి శ్రీనివాసరావు, కేఓ మల్లవరం, తుని మండలం 

►16 ఏళ్ల క్రితం తెలుగు తమ్ముళ్లు శృంగవృక్షంలో సొంత సామాజిక వర్గానికి చెందిన దూలం రత్నంపై పెట్రోలు పోసి నిప్పటించారు. రత్నంతో పాటు పక్కనే నిద్రలో ఉన్న బాలిక సజీవ దహనమైన సంఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనమైంది.
►కాంగ్రెస్‌ మద్దతుదారుడు గోపాలపట్నం మాజీ సర్పంచ్‌ అచ్చా గోవిందరావు కుమారుడు వెంకట కృష్ణ హత్యోదంతం వెనుక అక్కడి టీడీపీ నేత హస్తం ఉందన్న విషయం పెనుదుమారమే లేపింది. అధికారంలో ఉండటంతో వారి ఆగడాలకు భయపడి బాధిత కుటుంబం మిన్నకుండిపోయింది.
►గోర్సపాలెంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ప్రేమ వ్యవహారంలో అంతమయ్యాడు. కాకినాడలో హత్య చేయించి రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఈ వ్యవహారంలో బాధిత వర్గాన్ని టీడీపీ నేతలు బెదిరించారనే అభియోగాలున్నాయి. చివరకు యనమల స్వగ్రామం ఏవీ నగరంలో టీడీపీ నేతలే బలవంతంగా రాజీ చేశారు.
►తుని ఆచారి స్టూడియో అధినేత ఆస్తుల వ్యవహారంలో టీడీపీ నేతలు తలదూర్చి అంతమొందించారు. చివరకు కొత్తపల్లిలో ఉన్న భూములను దౌర్జన్యంగా స్వా«దీనం చేసుకుని గెస్ట్‌హౌస్‌ నిర్మించుకున్నారు.
►పాలమాన్‌పేటలో మత్స్యకారుల ఇళ్లపై సామూహిక దాడి అప్పట్లో యనమల సోదరుల ప్రేరేపణతోనే జరిగిందనే ఆరోపణలున్నాయి. తమకు ఎదురు తిరుగుతున్నాడని మత్స్యకార నాయకుడు అప్పలరాజును అక్రమంగా కేసుల్లో ఇరికించారు. టీడీపీ దాడుల్లో ఒక వృద్ధుడు అనుమానాస్పదంగా మృతి చెందితే ఇతనిపై కేసు బనాయించారు. నాటి ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి అప్పలరాజు కుమార్తె మోసా అనిత విషయాన్ని వివరిస్తూ కన్నీటిపర్యంతమైంది. 

మరిన్ని వార్తలు