టీడీపీ పాలనలో ‘అకాడమీ’కి అస్థిత్వమే లేదు

13 Jul, 2021 08:03 IST|Sakshi

తెలుగు–సంస్కృత అకాడమీగా చేస్తే నష్టమేంటో బాబు చెప్పాలి

ఈ నిర్ణయంతో కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వస్తాయి

ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే దానిని ప్రారంభించారు

తెలుగుకు ప్రాచీన హోదాను సాధించింది వైఎస్సారే    

దొండపర్తి (విశాఖ దక్షిణ): తెలుగు భాషపై చంద్రబాబు మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఎద్దేవా చేశారు. తెలుగు అకాడమీకి సంస్కృతాన్ని కలిపి ‘తెలుగు–సంస్కృత అకాడమీ’ అని మారిస్తే తెలుగు భాషకు జరిగిన నష్టమేమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీచ్‌ రోడ్డులోని లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014–19 మధ్య టీడీపీ హయాంలో తెలుగు అకాడమీ, అధికార భాషా సంఘం అస్థిత్వమే లేకుండా చేశారని గుర్తుచేశారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తానంటూ ఇచ్చిన హామీని చంద్రబాబు గోదావరిలో కలిపేశారన్నారు.

తెలుగు భాషాభివృద్ధికి సీఎం కృషి
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చొరవతోనే తెలుగుకు ప్రాచీన హోదా లభించిందని యార్లగడ్డ గుర్తుచేశారు. టీడీపీ హయాంలో తెలుగు భాషను, అకాడమీని పట్టించుకోని సమయంలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాటిని పునరుద్ధరించారని తెలిపారు. అలాగే సీఎం జగన్‌ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రాచీన అధ్యయన కేంద్రాన్ని మైసూరు నుంచి నెల్లూరుకు తీసుకువచ్చారని చెప్పారు. నిజానికి తెలుగు అకాడమీకి కేంద్రం నుంచి నిధులు రావని.. సంస్కృత భాషకు ఎక్కువ వస్తాయని తెలిపారు. తెలుగు వికాసానికి ఎవరు కృషి చేస్తున్నారన్న విషయంపై ఎక్కడైనా, ఎవరితోనైనా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని యార్లగడ్డ సవాలు విసిరారు.  

మరిన్ని వార్తలు