ఎన్టీఆర్‌కు గౌరవం ఇచ్చింది వైఎస్‌ కుటుంబమే

22 Sep, 2022 06:09 IST|Sakshi

వైఎస్సార్‌ తెలుగు గంగకు ఎన్టీఆర్‌ పేరు పెట్టారు 

సీఎం జగన్‌ ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు 

ఎన్టీఆర్‌కు చంద్రబాబు చేసిన ద్రోహాలు అన్నీ ఇన్నీ కావు 

ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే 

హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం బాధ కలిగించింది 

నా పదవులకు రాజీనామా చేస్తున్నా 

అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ 

ఏయూ క్యాంపస్‌: ఎన్టీఆర్‌కు గౌరవం ఇచ్చింది వైఎస్సార్‌  కుటుంబమేనని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ చెప్పారు. ఆయన బుధవారం  ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగు గంగకు ఎన్టీఆర్‌ పేరును వైఎస్సార్‌ పెడితే, ఓ జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టిన ఘనత ఆయన తనయుడు, సీఎం జగన్‌దేన్నారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు, టీడీపీ నాయకులు చేసిన ద్రోహాలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు డొమెస్టిక్‌ టెర్మినల్‌కు ఎన్టీఆర్‌ పేరు పెట్టకుండా చంద్రబాబే అడ్డుకున్నారన్నారు.

రాష్ట్ర కొత్త రాజధానికి ఎన్టీఆర్‌ నగర్‌ లేదా తారకరామనగర్‌ అని పేరు పెట్టాలని తాను కోరానని, ఇది ఇష్టంలేని చంద్రబాబు రాజగురువుతో మాట్లాడి అమరావతి పేరు పెట్టారన్నారు. 1998 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ చిత్రపటాలను పార్టీ కార్యాలయాలు, సభల్లో లేకుండా చేశారని చెప్పారు. ఎన్టీఆర్‌ బసవ తారకం మాతా శిశు కేంద్రం పెట్టాలని భావించిన ఇంటిని, ఎన్టీఆర్‌ మ్యూజియంగా మార్చాలని ఆశించిన ఇళ్లను సైతం అపార్టుమెంట్లుగా మార్చేశారని చెప్పారు. ఎన్టీఆర్‌ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాకు దండం పెట్టి తెలంగాణలో కాంగ్రెస్‌తో జతకట్టారని చెప్పారు. కుటుంబ రాజకీయాలకు ఎన్టీఆర్‌ వ్యతిరేకమని, దీనికి భిన్నంగా చంద్రబాబు లోకేష్ను తెరమీదకు తెచ్చారన్నారు. 

తెలుగు భాషకు జగన్‌ సేవ చేస్తున్నారు 
రాష్ట్రంలో తెలుగు భాషకు సీఎం జగన్‌ ఎనలేని సేవ చేస్తున్నారని యార్లగడ్డ చెప్పారు. రాష్ట్రంలో అధికార భాషా సంఘాన్ని పునరుద్ధరించి, తెలుగు ప్రాధికార సంస్థ, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరుకు తేవడం, ఉచితంగా ఐదెకరాలు ఇవ్వడం జగన్‌ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. తాను ఆయనకు విధేయుడినేనని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి పదవులను వద్దనుకున్న జగన్‌ హీరోగా నిలుస్తారని చెప్పారు. 

పేరు తొలగించడం బాధ కలిగించింది 
ఆరోగ్య విశ్వవిద్యాయానికి వైఎస్‌ పేరు పెట్టడానికి తాను వ్యతిరేకం కాదని, ఎన్టీఆర్‌ పేరును తొలగించడం బాధ కలిగించిందని, అధికార భాషా సంఘం, హిందీ అకాడెమీ, తెలుగు అభివృద్ధి ప్రాధికార సంస్థలకు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రానున్న తెలుగు విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు పెట్టి అప్పుడు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్సార్‌ పేరు పెట్టి ఉండే బాగుండేదని అన్నారు.  

మరిన్ని వార్తలు