కోడి ఈకలు.. చేపల పొలుసుతో ఇటుకలు తయారుచేసింది

29 Sep, 2021 09:17 IST|Sakshi
కోడి ఈకలు, చేపల పొలుసులతో తయారుచేసిన లైట్‌ వెయిట్‌ సిమెంట్‌ ఇటుకలు

వ్యర్థాలతో పర్యావరణ హిత వస్తువుల తయారీ

విజయవాడ విద్యార్థి యశస్వి వినూత్న ఆవిష్కరణ

జాతీయ స్థాయిలో ఇన్‌స్పైర్‌ అవార్డుకు ఎంపిక

సాక్షి, అమరావతి: కోడి ఈకలు, చేప పొలుసు వంటి వ్యర్థాలను పర్యావరణ హితంగా మార్చి వివిధ వస్తువుల తయారీకి శ్రీకారం చుట్టింది విజయవాడ విద్యార్థిని మట్ల యశస్వి. ఈ వినూత్న ఆలోచనకు జాతీయ స్థాయిలో ఇన్‌స్పైర్‌ అవార్డు వరించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా యశస్వి ఈ అవార్డును అందుకోనుంది. ఈ ప్రాజెక్ట్‌ అంతర్జాతీయ పోటీలకు సైతం నామినేట్‌ అయింది. గత ఏడాది పదో తరగతి చదువుతున్నప్పుడు యశస్వి దీనిని రూపొందించింది. ప్రస్తుతం ఆమె ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ చదువుతోంది.

ఇంకా మరెన్నో..
కోడి ఈకలు వాయు కాలుషం నివారణలో ఉపయోగపడతాయని యశస్వి నిరూపించింది. ఈ ఈకలను డిస్క్‌ మాదిరిగా చేసి ఫ్యాక్టరీ పొగ గొట్టాలు, వాహనాల సైలెన్సర్ల వద్ద ఉంచినప్పుడు కాలుష్యం తగ్గింది. అంతేకాకుండా కోడి ఈకలు, చేప పొలుసు, నీరు, గ్లిసరిన్‌ కలిసి వేడి చేస్తే బయో ప్లాస్టిక్‌ తయారవుతోంది. ఇది సులభంగా మట్టిలో కలిసిపోయి ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. చేప పొలుసును నీటితో కలిపి వేడి చేస్తే ఫిష్‌ జెల్‌ తయారవుతోంది. దీనిని ఐరన్‌ రాడ్లకు పూస్తే తుప్పు పట్టకుండా నివారిస్తోంది. మోకాళ్ల నొప్పులకు సంబంధించి కార్టిలేజ్‌ ట్రీట్‌మెంట్‌లో చేపల పొలుసులు ఉపయోగపడనున్నాయి. ఇందులో కొలాజిన్‌ అనే పదార్థం ఉండటం వల్ల ఈ జెల్‌ను ఉపయోగిస్తే  నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. పెయింట్‌ వేసేటప్పుడు ఈ జెల్‌ను కలిపి వాడితే గోడలకు చెమ్మ రాకుండా, పెచ్చులూడకుండా నివారించవచ్చు.

                    ఏపీసీవోఎస్టీ అవార్డులు అందుకుంటున్న యశస్వి
ఇన్‌స్పైర్‌ అవార్డుకు ఎంపికైంది ఇలా
జాతీయ ఇన్‌స్పైర్‌ అవార్డు కోసం దేశం నలుమూలల నుంచి మొత్తం 581 మంది ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఇందులో యశస్వి రూపొందించిన ప్రాజెక్ట్‌ కూడా ఉంది. కరోనా నేపథ్యంలో జాతీయస్థాయి ఎంపికలు ఈ నెల 4నుంచి 8 వరకు వర్చువల్‌ విధానంలో జరిగాయి. ఇందులో యశస్వి ప్రాజెక్ట్‌ అవార్డుకు ఎంపికైంది.


                ప్రాజెక్టుపై జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌కు వివరిస్తున్న యశస్వి

తయారీ ఇలా..
కోడి ఈకలలోని కొలాజిన్, చేపల పొలుసులోని కెరోటిన్‌లతో పర్యావరణ హితమై భూమిలో కలిసిపోయే బయో ప్లాస్టిక్, తేలికపాటి సిమెంట్‌ ఇటుకలు, బయో ఎరువులు, పెయింట్‌ల వినియోగంలో పెచ్చులూడి పోకుండా చేయడం, వాహనాల ద్వారా వచ్చే వాయు కాలుష్యాన్ని తగ్గించడం, కొలాజిన్‌ వినియోగంతో ఐరన్‌ తుప్పు పట్టే గుణం తగ్గడం, కార్టిలేజ్‌ ట్రీట్‌మెంట్‌ వంటి వాటిపై పరిశోధనలు చేసిన యశస్వి వాటిని శాస్త్రీయంగా నిరూపించింది. కోడి ఈకలు, చేప పొలుసును సిమెంట్, ఇసుక, నీటితో కలిపి తేలికగా ఉండే సిమెంట్‌ ఇటుకలను తయారు చేసింది. ఈ ఇటుకలను ల్యాబ్‌లో పరిశీలించగా బలంగానే ఉన్నాయని నిరూపణ అయ్యింది.


                 యశస్విని సత్కరిస్తున్న జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌  

ప్రోత్సాహం మరువలేనిది
కోడి ఈకలు, చేప పొలుసు కాలువల్లో నీటికి అడ్డుపడటంతోపాటు, పర్యావరణానికి హాని కలిగించటం గమనించా. వీటితో పర్యావరణ హితమైన వస్తువులను తయారు చేయాలనిపించింది. ఇందుకు మా గైడ్, సైన్స్‌ టీచర్‌ హేమంత్‌కుమార్, ప్రిన్సిపల్‌ రామభారతి ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. మా అమ్మ, నాన్న శ్రీలక్ష్మి, దేవరామరాజు మొదటి నుంచీ పరిశోధనలపై ఆసక్తి చూపేలా చేశారు. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది.
– యశస్వి, ఇన్‌స్పైర్‌ అవార్డు గ్రహీత

మరిన్ని వార్తలు