ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఉత్తర భారత యాత్ర 

5 Oct, 2021 05:00 IST|Sakshi

19న బయలుదేరనున్న రైలు 

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): ఉత్తర భారతదేశంలోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను తక్కువ ఖర్చుతో సందర్శించేందుకు ‘ఉత్తర భారత యాత్ర’ పేరుతో ప్రత్యేక పర్యాటక రైలు నడపనున్నట్టు ఐఆర్‌సీటీసీ విజయవాడ ఏరియా మేనేజర్‌ మురళీకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగ్రా, మధుర, వైష్ణోదేవి ఆలయం, అమృత్‌సర్, హరిద్వార్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించుకునేందుకు ఈ నెల 19న ఈ రైలును నడపుతున్నట్టు వెల్లడించారు. రేణిగుంటలో ప్రారంభమమ్యే ఈ రైలుకు నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, నాగ్‌పూర్‌ స్టేషన్‌లలో బోర్డింగ్‌ ఉందని పేర్కొన్నారు.

10 రాత్రిళ్లు, 11 పగటి పూటలు సాగే రైలు ప్రయాణంలో కోవిడ్‌ మార్గదర్శకాలు పాటిస్తూ ఉదయం టీ, కాఫీ, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం, పర్యాటక ప్రాంతాలకు రోడ్డు మార్గంలో రవాణా, రాత్రిళ్లు బస ఏర్పాట్లుంటాయని పేర్కొన్నారు. స్టాండర్డ్‌(స్లీపర్‌ క్లాస్‌), కంఫర్ట్‌ (ఏసీ 3 టైర్‌)గా రెండు కేటగిరీల్లో ఉండే ప్యాకేజీలో.. స్టాండర్డ్‌ ధర ఒక్కొక్కరికి రూ.10,400, కంఫర్ట్‌ ధర ఒక్కొక్కరికి రూ.17,330గా నిర్ణయించినట్టు వెల్లడించారు. ఆసక్తి గల వారు దగ్గర్లోని ఐఆర్‌సీటీసీ కార్యాలయాల్లోగానీ, విజయవాడ స్టేషన్‌లోని ఐఆర్‌సీటీసీ కార్యాలయంలోగానీ, లేదా ఫోన్‌ నంబర్లు 8287932312, 9701360675, వెబ్‌సైట్‌  www.irctctourism.comలో టికెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించారు. 

మరిన్ని వార్తలు