ఫిషింగ్‌ హార్బర్‌పై పచ్చ కుట్ర

20 Nov, 2022 12:20 IST|Sakshi

ప్రభుత్వ భూముల్లో టీడీపీ నేతల పాగా

అక్రమంగా ఆక్వా సాగు

స్వాధీనం చేసేందుకు తొలుత గడువు కోరిన నేతలు

రొయ్యల పట్టుబడి తర్వాత  అడ్డుకుంటున్న వైనం

గుంతలు తొలగిస్తున్నారంటూ  పచ్చమీడియా ద్వారా  అసత్య ప్రచారం

సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు

పచ్చకుట్రలకు హద్దూపద్దూ లేకుండాపోతోంది. లక్షలాది మంది మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంపై కుట్రలకు తెగబడింది. చివరి దశకు చేరుకున్న హార్బర్‌ నిర్మాణం పూర్తయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, టీడీపీకి పుట్టగతులు లేకుండా పోతాయనే ఆక్రోశంతో అడుగడుగునా అడ్డు తగులుతున్నారు.  మత్స్యకారులకు వర ప్రసాదినిగా మారుతున్న హార్బర్‌ నిర్మాణాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే విద్వేషాలు రెచ్చగొట్టేలా రెండు రోజుల నుంచి సోషల్‌ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. 

బిట్రగుంట(పీఎస్‌ఆర్‌ నెల్లూరు):  టీడీపీ నేతలా మజకా. ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించారు. రొయ్యల గుంతలుగా మార్చుకుని ఏళ్ల తరబడి అనుభవిస్తున్నారు. ఆ భూమిని లక్షలాది మత్స్యకారుల జీవితాలను మార్చే ఫిషింగ్‌ హార్బర్‌కు కేటాయించడంతో స్వాధీనం చేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు టీడీపీ నేతల ఆక్రమణలు కనిపించాయి. వీటిని తొలగించేందుకు ప్రయత్నించిన అధికారులకు రొయ్యలు సాగులో ఉన్నాయి... రెండు నెలలు గడువిస్తే స్వాధీనం చేస్తామని లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. సరే కదా అని గడువిస్తే.. ఇప్పుడు రెవెన్యూ అధికారులను అడ్డుకోవడంతో పాటు నిర్ధాక్షిణ్యంగా రొయ్యల గుంతలు తొలగిస్తున్నారంటూ పచ్చ మీడియా, సోషల్‌ మీడియా వేదికగా అసత్య, విష ప్రచారాలు సాగిస్తున్నారు. రెవెన్యూ అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.  

అసలు వాస్తవాలు ఇవీ  
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేలా, గంగపుత్రుల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేలా రాష్ట్ర ప్రభుత్వం జువ్వలదిన్నె వద్ద సుమారు రూ.300 కోట్ల వ్యయంతో ఫిషింగ్‌ హార్బర్‌ను మంజూరు చేసింది. ఇందుకోసం సర్వే నంబర్లు 1197, 1198, 1196, 1194, 1199, 1200, 1201,1202, 1203, 1204, 1205, 1206లో 76.87 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారు. వీటిలో 1205, 1206 సర్వే నంబర్లతో పాటు మరికొన్ని సర్వే నంబర్లలోని సుమారు 45 ఎకరాల భూమి చుక్కల భూమిగా నమోదై ఉండడంతో ప్రభుత్వ పోరంబోకు భూమిగా మార్పు చేస్తూ కలెక్టర్‌కు స్థానిక రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు పంపించారు.

ఈ మేరకు ఫారం–5 ద్వారా స్థానికుల నుంచి కూడా అభ్యంతరాలు స్వీకరించారు. స్థానికులు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో చుక్కల భూమిగా నమోదైన 45 ఎకరాల భూమిని ప్రభుత్వ పోరంబోకు భూమిగా మారుస్తూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. శాఖాపరంగా అన్ని ప్రక్రియలు పూర్తిచేసిన తర్వాత మొత్తం 76.89 ఎకరాల భూమిని హార్బర్‌ నిర్మాణం కోసం మత్స్యశాఖకు అందజేశారు. ప్రభుత్వం కూడా త్వరితగతిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిధులు విడుదల చేయడంతో హార్బర్‌ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి నాటికి పనులు పూర్తి చేసి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇప్పటికే 75 శాతం పనులు పూర్తి చేసిన ప్రస్తుతం హార్బర్‌ చుట్టూ ప్రహరీ నిర్మాణం చేస్తున్నారు.  

ఆక్రమణలతో అడ్డుకునే కుట్ర
ప్రస్తుతం ఫిషింగ్‌ హార్బర్‌ ప్రహరీ 1205, 1206 సర్వే నంబర్ల మీదుగా నిర్మాణం జరగాల్సి ఉంది. ఈ సర్వే నంబర్లలో మొత్తం 12.04 ఎకరాల భూమి ఉండగా కావలిరూరల్‌ మండలం తుమ్మలపెంటకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆక్రమించుకుని రొయ్యల గుంతలు సాగు చేసుకుంటున్నారు. దీంతో ఆక్రమణలు తొలగించి హార్బర్‌ నిర్మాణానికి సహకరించాల్సిందిగా మత్స్యశాఖ రెవెన్యూ అధికారులకు సూచనలు చేసింది. రొయ్యల గుంతలు ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకు సూచించగా ప్రస్తుతం రొయ్యలు సాగులో ఉన్నాయని 60 రోజులు గడువు కావాలని కోరారు. ఈ మేరకు ఆక్రమణదారులు సెప్టెంబర్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయడంతో రొయ్యలు పట్టుబడి అయ్యేంత వరకు రెవెన్యూ అధికారులు ఆగారు. ఇందుకు సంబంధించిన ఎండార్స్‌మెంట్‌ను కూడా ఆక్రమణదారులకు అందించారు.

ప్రస్తుతం రొయ్యల పట్టుబడి పూర్తవడంతో రెండు రోజుల క్రితం అధికారులు గుంతలు తొలగించేందుకు వెళ్లగా తుమ్మలపెంటకు చెందిన టీడీపీ నాయకులు అడ్డుతగిలి నానా హంగామా చేశారు. ఈ భూములను 2012లో అగ్రిమెంట్‌ ద్వారా కొనుగోలు చేశామని, ప్రస్తుతం తమకు రూ.3 కోట్లు పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకోవాలని వాదనకు దిగారు. రెవెన్యూ అధికారులు నిబంధనల మేరకు గ్రామస్తులు, స్థానిక సంస్థల ప్రతినిధుల సమక్షంలో పంచనామా నిర్వహించి ఖాళీగా ఉన్న రెండు గుంతలను తొలగించారు. అయితే టీడీపీ నాయకులు మాత్రం రొయ్యల గుంతలు ధ్వంసం చేసి రూ.1.5 కోట్ల మేర నష్టం కలిగించారంటూ సోషల్‌ మీడియాలో విష ప్రచారం చేస్తూ గొడవలు సృష్టించేలా పోస్టులు పెడుతున్నారు. కోర్టుకెళ్లి హార్బర్‌ నిర్మాణాన్ని అడ్డుకుంటామని శపథాలు చేస్తుండడంతో మత్స్యకారుల్లో ఆందోళన మొదలైంది. దీంతో స్థానికంగా శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే పరిస్థితి నెలకొంది. 

ఆ 12.04 ఎకరాలు ప్రభుత్వ భూములే 
ఫిషింగ్‌ హార్బర్‌కు కేటాయించిన భూముల్లో సర్వే నంబర్లు 1205, 1206లో ఉన్న 12.04 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వానికి చెందిందే. చుక్కల భూమిగా ఉన్న ఈ భూమిని ప్రభుత్వ పోరంబోకు భూమిగా మార్చే సమయంలో కూడా స్థానికుల నుంచి అభ్యంతరాలు స్వీకరించాం. ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో నిబంధనల మేరకు చుక్కల భూమి నుంచి ప్రభుత్వ పోరంబోకు భూమిగా మార్చి హార్బర్‌కు కేటాయించడం జరిగింది. ప్రభుత్వ భూమిని అగ్రిమెంట్ల ద్వారా విక్రయించడం, కొనుగోలు చేయడం చెల్లదు. రొయ్యల గుంతలు ఖాళీ చేసేందుకు ఆక్రమణదారులకు 60 రోజులకు పైగా గడువు కూడా ఇవ్వడం జరిగింది. రొయ్యలు పట్టుబడి చేసిన తర్వాత గ్రామస్తులు, సర్పంచ్, ఎంపీటీసీల సమక్షంలో పంచనామ నిర్వహించి ఖాళీగా ఉన్న రెండు గుంతలు మాత్రమే తొలగించాం. 
– లక్ష్మీనారాయణ, తహసీల్దార్, బోగోలు 

మరిన్ని వార్తలు