బాబు.. దావోస్‌.. అబద్ధపు రాతలు 

19 Jan, 2023 07:29 IST|Sakshi

గత ప్రభుత్వ హయాంలో దావోస్‌ పర్యటనకు రూ.50.43 కోట్లు వ్యయం

వాస్తవరూపం దాల్చని ఒక్క రూపాయి పెట్టుబడి

అయినా బాబు దావోస్‌ పర్యటనతో పెట్టుబడుల వెల్లువంటూ అసత్య ప్రచారం

2022లో సీఎం జగన్‌ దావోస్‌ పర్యటన వ్యయం రూ.12.90 కోట్లు

రూ.1.26 లక్షల కోట్ల విలువైన  పెట్టుబడుల ఒప్పందాలు

సాక్షి, అమరావతి: ఒక తప్పు చేసి అడ్డంగా దొరికిపోతే.. వెంటనే అటువంటి తప్పు మరోసారి చేయడానికి ఎవరూ సాహసించరు. కానీ, పచ్చ పత్రికలు చేస్తాయి. దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై అవి రాస్తున్న విషపు రాతలే ఇందుకు నిదర్శనం. దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానం రాలేదంటూ పచ్చ మీడియా అబద్ధపు ప్రచారం చేసింది. అయితే, ఆ సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఆహ్వానిస్తూ నవంబర్‌ 25నే లేఖ వచ్చిందన్న విషయం సాక్ష్యాధారాలతో బట్టబయలు కావడంతో కంగుతిన్న ఆ మీడియా మరో తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టింది.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్‌ పర్యటన ద్వారా లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. ఇది కూడా శుద్ధ తప్పు అని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 2016 నుంచి 2019 మధ్య చంద్రబాబు దావోస్‌ పర్యటనకు రూ.50.43 కోట్లు ఖర్చు చేయగా కనీసం ఆ మొత్తం కూడా పెట్టుబడిగా రాలేదన్న విషయాన్ని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. 2018లో ఆర్‌టీజీఎస్‌లో ఈ గవర్నెన్స్‌ అమలుకు సంబంధించి హిటాచీ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందం అమల్లోకి రాలేదు. అలాగే సిస్టర్‌ కాంటన్‌ ఆఫ్‌ జురిచ్‌తో కుదుర్చుకున్న సిస్టర్‌ సిటీ ఒప్పందం కూడా వాస్తవ రూపం దాల్చలేదు. 2019లో ఫిన్‌టెక్‌ ఎకో సిస్టమ్‌ గురంచి సీఐఐతో, హిటాచీతో ఏపీఈడీబీ కుదుర్చుకున్న ఒప్పందాలు, ఏఎంటీజెడ్‌లో టెక్నాలజీ సేవలు అందించే యూరో ఫైనాన్స్‌ ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. అంటే చంద్రబాబు దావోస్‌ పర్యటనల వల్ల ఒక్క రూపాయి పెట్టుబడి కూడా వాస్తవ రూపం దాల్చలేదన్నది స్పష్టమవుతోంది.  

రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు 
కోవిడ్‌ కారణంగా తొలి రెండు సంవత్సరాలు దావోస్‌ పర్యటనకు వెళ్లలేకపోయిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 2022లో తొలిసారి ఆ సమావేశాలకు హాజరయ్యారు. ఈ పర్యటన కోసం రూ.12.90 కోట్లు ఖర్చయింది. అక్కడ గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రూ.1.26 లక్షల కోట్ల విలువైన నాలుగు పెట్టుబడుల ఒప్పందాలను   ప్రభుత్వం కుదుర్చు కుంది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అరబిందో రియల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్‌కో గ్రూపు, ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలు  అమలు దశలో ఉన్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇది వాస్తవం. ఇవేవీ పట్టని ఆ పత్రికలు నిత్యం ఉషోదయంతో విషం చిమ్ముతూనే ఉన్నాయి.  

మరిన్ని వార్తలు