ఏది నిజం?: కోతలు కాదు... కళ్లున్నా చూడలేని రాతలు!

30 Apr, 2022 08:05 IST|Sakshi

గత ప్రభుత్వంలో కంటే పెరిగిన రేషన్‌ కార్డులు, సబ్సిడీలు చూడకుండా ఈనాడు వక్రభాష్యం

పెరిగిన కార్డులు కనిపించలేదు. అత్యంత నాణ్యతతో ఇస్తున్న సరుకులు కనిపించలేదు. దాదాపుగా రెట్టింపు స్థాయిలో ఇస్తున్న సబ్సిడీ గానీ... కార్డుదారుల కష్టాలెరిగి...ఇంటి ముంగిటకే వస్తున్న రేషన్‌ డెలివరీ గానీ... ఇవేవీ ‘ఈనాడు’కు కనిపిస్తే ఒట్టు!!.ప్రజల్ని ఓటర్లుగా మాత్రమే గుర్తించే నారా వారు చివరి ఏడాదిలో ‘ప్రయోగాత్మకంగా’ పంచిన రాగులు, జొన్నలు మాత్రం కనిపించాయి. అవిప్పుడు ఇవ్వటం లేదు కాబట్టి రేషన్‌ మొత్తానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కోత పెట్టేసిందంటూ శోకాలందుకున్నారు రామోజీ!. అసలు చంద్రబాబు హయాంలో ఏ సరుకులు.. ఎంతమందికిచ్చారు? ఎంత సబ్సిడీ ఇచ్చారు? సరుకుల్లో నాణ్యతెంత? ఇవన్నీ ‘ఈనాడు’కు ఆనాడెందుకు కనిపించలేదు? ఇప్పుడు ఇన్ని రకాలుగా పేదలను  ఆదుకుంటున్నా ఎందుకిలా పదేపదే  అబద్ధాలకు రంగేస్తున్నారు? ‘రేషన్‌ కోతలు’ అంటూ శుక్రవారం ‘ఈనాడు’ అచ్చేసిన వార్తలో ఏది నిజం?

గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో వివిధ పథకాల లబ్ధిదారులకు అందిన మొత్తం 1.37 లక్షల కోట్లు. అదికూడా పైసా అవినీతికి తావు లేకుండా... నేరుగా వారి ఖాతాల్లోకే వచ్చింది. 31 లక్షల కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతోంది. లక్షల రూపాయల విలువ చేసే స్థలాలు.. ఆ ఇంటి మహలకు‡్ష్మల చేతిలో ‘పట్టా’లయ్యాయి. ఇవన్నీ ఈనాడుకెన్నడూ కనిపించవు. రామోజీ దృష్టిలో చంద్రబాబు ఏలిన కాలమేదైనా గుప్తులనాటి స్వర్ణ యుగంతో సమానమే. ఆయనకది స్వర్ణయుగం కాబట్టి వేరెవరు అధికారంలో ఉన్నా తట్టుకోలేరు. నిజానికి చంద్రబాబు హయాంలో ప్రతిపక్షానికి మద్దతిచ్చేవారి రేషన్‌ కార్డులూ పోయాయి. అలా ఏరేస్తేనే... ఆయన దిగిపోయే నాటికి 1.39 కోట్ల కార్డులు మిగిలాయి. కానీ సంక్షేమ జెండాకు పార్టీలుండవని మనసావాచా నమ్మే వైఎస్‌ జగన్‌... ఇంటింటికీ వలంటీర్లను పంపి మరీ... అర్హులకు కార్డులిచ్చారు. కార్డులు ఆరు లక్షలు పెరిగి... 1.45 కోట్లకు చేరాయి. ఇదీ నిజం!.

ఇక బాబు హయాంలో రేషన్‌ బియ్యం ఇచ్చినా దాన్ని తినేవారు తక్కువే. ఎందుకంటే ముక్కిపోవటం... పురుగులు పట్టడం... రాళ్లు, నూకలు ఎక్కువగా ఉండటంతో పాటు గింజలు రంగు మారటం వంటి అప్పట్లో అత్యంత సహజం. ఇంటికి తెచ్చుకున్న బియ్యాన్ని లబ్ధిదారులు శుభ్రం చేసుకోవడానికే సమయం పోయేది. కానీ ఇప్పుడిస్తున్నది నాణ్యమైన సార్టెక్స్‌ బియ్యం. కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నాణ్యమైన రేషన్‌ బియ్యమే పేదల ఆకలి తీర్చింది. బియ్యం సార్టెక్స్‌కే కిలోకు రూపాయి చొప్పున నెలకు 20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంతెందుకు... బాబు ఐదేళ్ల కాలంలో బియ్యం సబ్సిడీపై చేసిన ఖర్చు రూ.12,377 కోట్లయితే జగన్‌ ప్రభుత్వం కిలో రూపాయి చొప్పున నాణ్యమైన బియ్యమిస్తూ ఈ మూడేళ్లలోనే రూ.12,379 కోట్లు సబ్సిడీకి వెచ్చించింది. ఇదీ ‘ఈనాడు’ చెప్పలేని నిజం!!.

పై పట్టికలో చూస్తే టీడీపీ హయాంలో గరిష్ఠంగా బియ్యం పంపిణీ చేసింది 2014–15లోనే. అది కూడా... 25.93 లక్షల టన్నులు. కానీ గడిచిన మూడేళ్లుగా ప్రస్తుత ప్రభుత్వం ప్రతి ఏటా అంతకన్నా ఎక్కువే పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది ఏకంగా 27.8 లక్షల టన్నులు పంపిణీ చేసింది. ఈ నిజాన్ని ఎందుకు చెప్పరు రామోజీ? దీన్ని కోతలంటారా? 

గతంలో రేషన్‌ సరుకులు తెచ్చుకోవటమంటే... అదో పెద్ద ప్రహసనం. రేషన్‌ డిపోల దగ్గరి సీన్లు వర్ణించలేం. సర్వర్లు ఎప్పుడు పని చేస్తాయో తెలీక రోజంతా కూలి మానేసి క్యూలో పడిగాపులు పడేవారు. ఒక్కోసారి రేషన్‌ తీసుకోకుండానే ఇంటికి వెళ్లేవారు. వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితి మరీ ఘోరం. కానీ ఈ నిజాలనెప్పుడూ ‘ఈనాడు’ చెప్పలేదు. ఎందుకంటే తమ బాబు సీఎం మరి. కానీ ఏడాది కిందట వై.ఎస్‌.జగన్‌ ఆరంభించిన ఇంటింటికీ రేషన్‌ డెలివరీతో పరిస్థితి మొత్తం మారిపోయింది. 9,260 వాహనాల్లో లబ్ధిదారులకు ఇళ్లవద్దే రేషన్‌ అందుతోంది. ఈ మొబైల్‌ వాహనాలతో ఉపాధి పొందుతున్న ఆపరేటర్లకు నెలకు సుమారు రూ.25 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తోంది. కార్డుదారుల సమక్షంలో ఇంటి దగ్గరే సంచులు తెరచి, కచ్చితమైన తూకంతో ఇస్తుండటంతో కొలతలపై ఫిర్యాదుల్లేవు. వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఏర్పాటు చేయడంతో అక్రమ రవాణా లేదు. ఇవి కూడా ‘ఈనాడు’ చెప్పని నిజాలే మరి!!. 

ఇదీ... బాబు చిరుధాన్యాల గుట్టు


టీడీపీ ప్రభుత్వం హయాంలో రాగులు, జొన్నలు, గోదుమ పిండి, ఉప్పు పంపిణీ చేయటం మొదలెట్టిందే చివర్లో. ‘ఈనాడు’ దృష్టిలో అది సూపర్‌. 1.38 కోట్ల కార్డుల్లో కేవలం 1 శాతానికే వీటినిచ్చినా... అబ్బో అంటున్నారు రామోజీ. ఎన్నికల భయంతో ప్రజలను మభ్యపెట్టేందుకు చివరి సంవత్సరంలో పంపిణీ చేశారీ చిరు ధాన్యాల్ని. గతంలో నెలకు 14 వేల టన్నుల గోధుమ పిండి అవసరం ఉంటే 900 టన్నులే తెచ్చి కొద్ది మందికే పంపిణీ చేశారు. ఇక్కడి ప్రజలు బియ్యం ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడతారు.

కార్మికులు, కూలి కుటుంబాలకు గోధుమ పిండితో రొట్టెలు చేసుకునే తీరిక ఉండదు. దీంతో గోధుమ పిండిని తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతో నిల్వలు పాడైపోతున్న కారణంగా పంపిణీ నిలిచిపోయింది. రాగులు, జొన్నల పంపిణీ విషయంలోనూ ఇదే జరిగింది. 2018–19 మధ్య 25,034 టన్నుల రాగులు, 15,635 టన్నుల జొన్నలను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసి కార్డుదారులకు సరఫరా చేశారు. వీటిని బయటి మార్కెట్‌ నుంచి కొనటంతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ నిలిపివేసింది. వీటి పరిమాణానికి సమానమైన బియ్యంపైనా సబ్సిడీ ఇవ్వలేదు. ఈ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. వీటిని తీసుకునేందుకెవరూ ఆసక్తి చూపించకపోవడంతో మధ్యలోనే ఆగిపోతే.. దీనిక్కూడా ‘ఈనాడు’ మసి పూసేసింది.

ఇక కందిపప్పు జూన్‌ 2014 నుంచి అక్టోబర్‌ 2016 వరకు పంపిణీయే చేయలేదు. నవంబర్‌ 2016 నుంచి ఫిబ్రవరి 2018 వరకు గిరిజన ప్రాంతాల్లో మాత్రమే కిలో రూ.40 చొప్పున పంపిణీ చేసింది. ఎన్నికలు వస్తున్నాయనగా మార్చి 2018 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్డుదారులకు రెండు కిలోల కందిపప్పు పేరిట పంచి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. 85,600 టన్నులకు సబ్సిడీ కింద రూ.254 కోట్ల మాత్రమే వెచ్చించారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్లలో 5.14 లక్షల టన్నుల కందిపప్పును పంపిణీకి రూ.1350 కోట్లు సబ్సిడీ భరించింది. ఇదీ... నిజం.

రక్తికట్టని ఎన్నికల డ్రామా..
ఎన్నికల డ్రామాలో భాగంగా కందిపప్పు పంపిణీని ప్రారంభించి... బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.63 ఉంటే రూ.23 మాత్రమే సబ్సిడీ భరించి రూ.40కు పంపిణీ చేసినా రామోజీకది అద్భుతంగానే కనిపించింది. మార్కెట్‌ ఒడిదుడుకులు, కోవిడ్‌ సంక్షోభం, ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాల రేట్లు అమాంతం పెరిగాయి. దీంతో ప్రస్తుత మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.115కు చేరింది. ప్రభుత్వం రూ.39 సబ్సిడీ భరించి ప్రజలకు రూ.67కు అందిస్తోంది.  నెలనెల రూ.56 కోట్ల సబ్సిడీ భరిస్తోంది. ఇదే నేరమైనట్లు... ధరలు పెంచేశారంటూ ‘ఈనాడు’ గుండెలు బాదుకోవటం చూస్తే చిత్రంగానే అనిపిస్తుంది. పంచదార పరిస్థితీ అంతే. నెలకు సగటున 7724 టన్నులు అవసరం కాగా, కేంద్రం కేవలం 908 టన్నులకే రాయితీ ఇస్తోంది. మిగిలినదంతా రాష్ట్రం బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసి... సబ్సిడీని భరిస్తోంది. అసలు టీడీపీ ఐదేళ్లలో 3.52 లక్షల టన్నుల చక్కెర పంపిణీలో రూ.314 కోట్లు సబ్సిడీ భారాన్ని భరిస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో 2.70 లక్షల టన్నులు పంపిణీ చేసి రూ.541 కోట్లు భరించింది. ఈ లెక్కలు చాలవూ రేషన్‌కు ఎవరు కోతలు పెట్టారో చెప్పటానికి? ఎవరెంత సబ్సిడీ భరిస్తూ పేదల పక్షానున్నారో తెలియటానికి? 

మరిన్ని వార్తలు