బోన్సాయ్‌ హాయ్‌ హాయ్‌..

12 Nov, 2021 10:42 IST|Sakshi

తగరపువలస (భీమిలి): విశాఖ జిల్లా భీమిలి మండలం పాతమూలకుద్దు సమీపంలో గోస్తనినదీ తీరంలో 400కు పైగా స్వదేశీ, విదేశీ రకాలకు చెందిన బోన్సాయ్‌ మొక్కలు ఒకేచోట కొలువుతీరి ఉన్నాయి. విశాఖకు చెందిన దువ్వి కిశోర్‌ అలియాస్‌ బోన్సాయ్‌ కిశోర్‌ కుటుంబం 22 ఏళ్లుగా వీటిని కంటిపాపల్లా సాకుతోంది. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో కలెక్షన్‌ కలిగిన బోన్సాయ్‌ మొక్కలు ఇక్కడే ఉండటం ప్రత్యేకం. గతంలో విశాఖలో కిశోర్‌ ఇంటి టెర్రాస్‌ 50–60 మొక్కలకే నిండిపోవడంతో పుష్కలంగా నీరు, స్వచ్ఛమైన గాలి ఉన్న గోస్తని నది తీర ప్రాంతాన్ని ఎంచుకున్నారు. 

ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఉద్యోగ రీత్యా ముంబై వెళ్లిన కిశోర్‌ బోన్సాయ్‌ ప్రదర్శన చూసి ముగ్ధుడై వీటి పెంపకాన్ని ప్రవృత్తిగా ఎంచుకోవడమే కాకుండా 22 ఏళ్లుగా ఇందులో నైపుణ్యం సాధించారు. కేవలం బోన్సాయ్‌ మొక్కల పెంపకమే కాకుండా ఔత్సాహికులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం, విద్యార్థులకు బోటానికల్‌ టూర్‌గా విజ్ఞానాన్ని అందించడం, వధూవరులకు ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ స్పాట్‌గా అందుబాటులో ఉంచడం, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫొటోగ్రఫీ, జర్నలిజం పాఠాలు నేర్చుకునే విద్యార్థులకు ప్రయోగశాలగా విశాలమైన ప్రదేశంలో ఈ బోన్సాయ్‌ వనాన్ని తీర్చిదిద్దారు. ప్రతి ఏటా ఔత్సాహికులకు బోన్సాయ్‌ మొక్కల పెంపకంపై పోటీలు నిర్వహించి విజేతలకు వీటినే బహుమతులుగా ఇస్తుంటారు. 

అమ్మా బోన్సాయ్‌గా పరిచయం
బోన్సాయ్‌ వనాన్ని తీర్చిదిద్దడంలో కిశోర్‌ తల్లి పద్మావతి కీలకంగా వ్యవహరిస్తుంటారు. ఆయన వృత్తి రీత్యా బిజీగా ఉన్న సమయంలో ఆమే ఈ మొక్కల సంరక్షణ మొత్తం చూసుకుంటారు. రీ పాటింగ్, ప్రూనింగ్, నీరు పెట్టడం వంటివి చేస్తుంటారు. అందుకే ఈ గార్డెన్‌ను అమ్మా బోన్సాయ్‌ గార్డెన్‌గా అందరికీ పరిచయం చేస్తుంటారు. ఈ గార్డెన్‌లో వివిధ దేశాలకు చెందిన ఖరీదైన పక్షి జాతులు, కుక్కపిల్లలు, చేపలను కూడా పెంచుతున్నారు. వీటికోసం ఫిష్‌పాండ్‌లు, కేజ్‌లు ప్రత్యేకంగా ఉన్నాయి. ఒక కుటుంబంలో సభ్యుల వేర్వేరు అభిరుచులకు అనుగుణంగానే వీటికి స్థానం కలించారు. 

వయ్యారాలు ఒలకబోసేలా.. 
బోన్సాయ్‌ మొక్కలను తీర్చిదిద్దడం ఒక అద్భుతమైన కళ. దీనికి తగినంత ఓర్పుతో పాటు నేర్పు అవసరం. మహావృక్షాన్ని సైతం చిన్నతొట్టెలో ఒదిగించే కళ ఈ బోన్సాయ్‌ మొక్కలకే ఉంది. పెద్ద వృక్షాలను చిన్నగా చూడడమే కాదు రెండు నుంచి మూడు అడుగులు పొడవుతోనే వృక్షాలుగా కనిపిస్తాయి. సాధారణ చెట్ల మాదిరిగానే ఈ బోన్సాయ్‌లు ఫలాలు దిగుబడినిస్తున్నాయి. ఇంటీరియల్‌ డెకరేషన్‌లో ప్రధాన భాగమైన వీటిని ఆరోగ్యంగా పెంచుకోవడానికి మెలకువలు అవసరం. వీటి స్టైల్, వయసు, మొక్కను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.2లక్షల వరకు ధరలు పలుకుతుంటాయి. 

చూపు మరల్చుకోలేని కలెక్షన్‌ 
ఈ బోన్సాయ్‌ మొక్కల పొదరింట్లో ఇప్పటి తరం వారికి అంతగా పరిచయం లేని స్వదేశీ రకాలైన రావి, మర్రి, జువ్వి, బోగన్‌విల్లా, మామిడి, కామిని, బోధి, సపోటా, దానిమ్మ, సీమచింత, చింత, చెర్రీస్, ఆరెంజ్, సుబాబుల్, అత్తి, కంటి, మినీలోటస్‌ వంటి వందకు పైగా రకాలు ఉన్నాయి. అలాగే విదేశీ రకాలైన ఆఫ్రికన్‌ తులిప్, అర్జున, బాటిల్‌ బ్రష్, చైనీస్‌ ఇఎల్‌ఎమ్, బొబాబ్, దివిదివి, బ్రెజిలిన్‌ రెయిన్‌ట్రీ, పోర్షియా, పౌడర్‌ పఫ్, రబ్బర్, సాండ్‌ పేపర్, షూ ఫ్లవర్, సిల్వర్‌ ఓక్, ఉడ్‌ యాపిల్, చైనా తులసి, చైనీస్‌ పెప్పర్, కాపర్‌ పాడ్, నోడా, డ్వార్ఫ్, ఫైకస్‌ లాంగ్‌ ఇస్‌ల్యాండ్, గోల్డెన్‌ షవర్, గుల్‌మొహర్, జకరండా, కామిని, కేండిల్‌ ట్రీ, ఇండోనేషియా బ్రయా, ఆస్ట్రేలియా సరుగుడు, బార్బడోస్‌ చెర్రీ, పోడ్‌ కార్పన్, ఆస్ట్రేలియన్‌ ఫైకస్, దివి అవండి, టైగర్‌ ఫైకస్, లుసీడా, వెలగ, సెబు కేసికర్, బుంజింగి, జాక్వెనియా, కవ, గమిలన్‌ ట్రయాంగల్‌ ఫైకస్‌ వంటి 300 రకాలు ఉన్నాయి. చిన్నారులు మొబైల్స్‌కు అలవాటు పడిపోయిన ప్రస్తుత కాలంలో చెట్ల విలువ తెలపడానికి బోధి చెట్టు–బుద్ధుడు, నేరేడు–దత్తాత్రేయుడు, జమ్మి–పాండవులు, మర్రి–త్రిమూర్తులు మధ్య సంబంధాలు తెలిసేలా ఆయా పొట్టివృక్షాల కింద వీరి ప్రతిమలు ఏర్పాటు చేశారు. రాత్రి వేళ కూడా తిలకించేందుకు వీటికి విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు.

మొక్కల విలువ తెలిసింది
కోవిడ్‌ పరిచయం కారణంగా ప్రతి ఒక్కరూ మొక్కల విలువ గుర్తించారు. కాలు ష్యం లేకుండా చెట్ల మధ్య ఉన్నవారికి కరోనా సోకలేదు. చెట్ల పెంపకానికి స్థల సమస్య ఉన్నవారికి బోన్సాయ్‌ మొక్కలు పెంపకం చక్కటి పరిష్కారం. బాల్కనీ, టెర్రస్, హాలులో, గోడపై కలిపి ఏభై వరకు ఈ మొక్కలను పెంచుకోవచ్చు. నీటివనరులు, కాలుష్యరహిత వాతావరణం, సారవంతమైన భూమి అందుబాటులో ఉండటంతోనే మూలకుద్దులో ఈ బోన్సాయ్‌ గార్డెన్‌ ఏర్పాటు చేశాం.
– దువ్వి పద్మావతి

అమ్మ వల్లనే...
బోన్సాయ్‌ మొక్కల పెంపకం డబ్బుతో కూడుకున్నదన్నది ఒట్టి భ్రమే. మన చుట్టూ ఉన్న పాత భవనాలు, నూతుల నుంచి వీటిని సేకరించుకోవచ్చు. లోతు తక్కువ కలిగిన పాత్రలకు పెయింట్‌ చేసి అందులో పెంచుకోవచ్చు. స్వచ్ఛమైన గాలిని అందించే మొక్కలే మనకు మంచి నేస్తాలు. అమ్మ పద్మావతి వలనే నాకు బోన్సాయ్‌ మొక్కల పెంపకంపై ఆసక్తి పెరిగింది. ఆసక్తి కలిగిన వారికి వీటి పెంపకంపై శిక్షణ ఇస్తాను. వివరాలకు 79956 79999లో సంప్రదించవచ్చు. 
–దువ్వి కిశోర్, మూలకుద్దు, భీమిలి మండలం

మరిన్ని వార్తలు