వైజాగ్‌ టు టాలీవుడ్‌.. వెండితెరపై విశాఖ యువకుడు

24 Feb, 2022 07:58 IST|Sakshi
నటీనటులకు సూచనలిస్తున్న దర్శకుడు రవిశంకర్‌

కొమ్మాది(భీమిలి)/విశాఖపట్నం: విశాఖ అంటే ప్రకృతి అందాలకు పుట్టినిల్లే కాదు.. అపర్ణ, గౌతమి, రమణ గోగుల, రాజా, సుత్తివేలు, గొల్లపూడి మారుతీరావు, శుభలేఖ సుధాకర్, వైజాగ్‌ ప్రసాద్, సుమన్‌శెట్టి, కులశేఖర్‌ లాంటి ఎంతో మంది నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులకు జన్మనిచ్చింది. అందుకే సినిమా అంటేనే ముందుగా గుర్తొచ్చేది విశాఖపట్నమే. వీరందరి స్ఫూర్తితో విశాఖ నుంచి టాలీవుడ్‌ బాటపట్టారు సాగర్‌నగర్‌కు చెందిన పోలుబోతు రవిశంకర్‌ నాయుడు.

చదవండి: ‘భీమ్లా నాయక్’ నుంచి మరో ట్రైలర్‌.. ఫాన్స్‌కు పూనకాలే!

తక్కువ ఖర్చుతో.. స్థానిక నటులతో.. విశాఖ పరిసర ప్రాంతాల్లో స్వాతి చినుకు సంధ్య వేళలో సినిమా తీసి.. వెండి తెరకు పరిచయమయ్యారు. అంతే కాదు.. వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో మరో రెండు సినిమాలు తీసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో స్వాతి చినుకు సంధ్య వేళలో సినిమా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆయన రెండో సినిమా బండెనక బండికట్టి చిత్రీకరణలో ఉంది. మార్చి 5న ది నన్స్‌ డైరీ పేరుతో మరో సినిమా చిత్రీకరించేందుకు రవిశంకర్‌ సిద్ధమవుతున్నారు.

దర్శకుడు రవిశంకర్‌  

అంతా విశాఖే.. 
డిప్యూటీ కలెక్టర్‌ తమ్మారావు, త్రివేణి దంపతుల కుమారుడు రవిశంకర్‌ విశాఖలోనే పుట్టి పెరిగారు. ఎంబీఏ చేసిన తర్వాత సినిమాలపై ఆసక్తితో ఓ కథను తయారు చేసుకుని.. తానే దర్శకత్వం వహించారు. ఆ సినిమాయే స్వాతి చినుకు సంధ్య వేళలో. ఈ నెల 18న రెండు తెలుగు రాష్ట్రాల్లో 70 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా మొత్తం వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో రూ.45 లక్షల వ్యయంలో చిత్రీకరించి విజయం సాధించారు.

విశాఖ యువతకు అవకాశం  
విశాఖలో షూటింగ్‌లకు అనువైన స్థలాలే కాదు.. ప్రతిభ కలిగిన వేలాది మంది కళాకారులు ఉన్నారు. వారందరికీ అవకాశం కల్పించాలన్నదే తన ధ్యేయమని దర్శకుడు రవిశంకర్‌ తెలిపారు. స్థానిక కళాకారులకు అవకాశం కల్పిస్తే తక్కువ పెట్టుబడితో సినిమాను అందంగా చిత్రీకరించవచ్చన్నారు.

సీఎం జగన్‌ నిర్ణయంతో కొత్త ఆశలు  
రాష్ట్ర విభజన తర్వాత సినీ పరిశ్రమ అంతా వైజాగ్‌ వైపు చూస్తుంది. ఈ క్రమంలో విశాఖలో స్టూడియోలు నిర్మించాలని, సినిమా చిత్రీకరణలు చేపట్టాలని ముఖ్యంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టాలీవుడ్‌ను ఆహా్వనించారు. ఆయన తీసుకున్న నిర్ణయంతో విశాఖ కళాకారులకు కొత్త ఆశలు చిగురించేలా చేసింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసినట్లయితే సినీ పరిశ్రమకు విశాఖ ఒక ఐకాన్‌ కానుందని రవిశంకర్‌ తెలిపారు.

ఏడాదికి 3 సినిమాలు  
ఏడాదికి మూడు సినిమాలు తీయాలన్నదే తన ధ్యేయమని రవిశంకర్‌ తెలిపారు. ఇప్పటికే ఓ సినిమా విడుదల కాగా.. మరో సినిమా నిర్మాణంలో ఉంది. వచ్చే నెలలో మరో సినిమా ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. రవితేజతో సినిమా తీయాలన్నదే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. విశాఖ అంటే చాలా ఇష్టమని.. అందుకే తన సినీ ప్రస్థానం ఇక్కడే ప్రారంభించినట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు