ఇక బోరుబావుల్లో పడ్డ చిన్నారులు సురక్షితం! 

2 Aug, 2020 04:14 IST|Sakshi
యంత్రం పనితీరును వివరిస్తున్న శరత్‌

యంత్రాన్ని రూపొందించిన యువ ఇంజనీర్‌ 

20 అడుగుల లోతులో పడ్డవారిని కాపాడవచ్చంటున్న యువకుడు 

సాంకేతికత జోడిస్తే 500 అడుగుల లోతులో పడ్డా రక్షించవచ్చు 

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఆర్థిక సాయం చేయాలని వినతి 

కొత్తవలస (శృంగవరపుకోట): ఎక్కడో చోట బోరుబావుల్లో చిన్నారులు పడిపోవడం.. వారికోసం అంతా హైరానా పడటం అందరికీ తెలిసిందే. బోరుబావుల్లో పడ్డ చిన్నారులను కొన్నిసార్లు రక్షిస్తున్నా.. మరికొన్నిసార్లు వారిని కాపాడుకోలేకపోతున్నాం. ఈ సమస్యకు విజయనగరం జిల్లాకు చెందిన యువ ఇంజనీర్‌ కురుమోజు శరత్‌ చంద్ర పరిష్కారం చూపాడు. అతడు చదివింది ఈఈఈలో డిప్లొమా మాత్రమే అయినా తన మేధస్సుతో బోర్‌వెల్‌ చిల్డ్రన్‌ లిఫ్టింగ్‌ మెషిన్‌ను రూపొందించాడు. ఈ యంత్రంతో 20 అడుగుల లోతులో పడ్డవారిని వెంటనే వెలికి తీయొచ్చని చెబుతున్నాడు. దీనికి మరింత సాంకేతికత జోడిస్తే 300 నుంచి 500 అడుగుల లోతులో ఉన్నవారినైనా రక్షించవచ్చని అంటున్నాడు. వివరాల్లోకెళ్తే.. 

► కొత్తవలస మండలం తుమ్మికాపల్లికి చెందిన శరత్‌ చంద్ర తల్లి అతడి చిన్నతనంలోనే మరణించడంతో అమ్మమ్మ దగ్గర పెరిగాడు. 
► పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తయ్యాక చిన్న ఉద్యోగం చేసినా లాక్‌డౌన్‌తో జీవనోపాధిని కోల్పోయాడు. 
► దీంతో రోజూ కూలి పనులకు వెళ్లి ఆ ఆదాయంతోనే బతుకీడుస్తున్నాడు. అందులో కొంత డబ్బును వెచ్చించి మెషిన్‌ను తయారుచేశాడు.  

 యంత్రం పనితీరు ఇలా.. 
► బోరుబావి సైజును బట్టి మూడు ప్రత్యేక మోటార్ల సాయంతో ఈ యంత్రం పనిచేస్తుంది.  
► సీసీ కెమెరా, ఎల్‌ఈడీ లైట్లతోపాటు మానిటర్‌కు అనుసం«ధానమై ఉంటుంది. ఇది సీకాట్‌ కేబుల్‌ సాయంతో పనిచేస్తుంది. ► బోరుబావిలో చిన్నారులు పడ్డప్పుడు గేర్‌వైర్‌ సాయంతో బావిలోకి దింపిన యంత్రం బాలుడిని మూడు మర చేతులతో పట్టుకుంటుంది.  
► పై నుంచి నియంత్రించేందుకు సీసీ మానిటర్‌ నుంచి దీన్ని ఆపరేట్‌ చేస్తారు.  
► విద్యుత్‌ ఆగిపోయినా, సాంకేతిక ఇబ్బందులు తలెత్తినా చిన్నారిని మాత్రం వదలకుండా పట్టుకుని ఉండటం ఈ యంత్రం ప్రత్యేకత.  
► అంతేకాకుండా చిన్నారికి ఆక్సిజన్‌ను అందించే సదుపాయాన్ని ఇందులో అమర్చవచ్చు.  
► తన యంత్రాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థలు ఆర్థిక సాయం అందించాలని శరత్‌ కోరుతున్నాడు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా