మంత్రులు, ఎమ్మెల్యేలే టార్గెట్‌

3 May, 2022 08:56 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : చదివింది బి.టెక్‌... టెక్నాలజీపై అవగాహన... ఆ యువకుడికి ఈ రెండే పెట్టుబడిగా ఉపయోగపడ్డాయి. అడ్డదారిలో డబ్బు సంపాదించాలని భావించిన ఈ ప్రబుద్ధుడు ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలనే టార్గెట్‌గా చేసుకున్నాడు. తాను సీఎం పేషీ నుంచి మాట్లాడుతున్నానంటూ కోట్ల రూపాయల్లో డబ్బులు వసూలు చేశాడు. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన పోలీసులు ఈ ఘరానా మోసగాడిని కటకటాల వెనక్కి పంపారు.

గాజువాకలోని శ్రీనగర్‌కు చెందిన పి.విష్ణుమూర్తి అలియాస్‌ విష్ణు, అలియాస్‌ సాగర్‌ పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి లక్షల రూపాయల్లో డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు పక్కా ఆధారాలను సంపాదించారు. ఇటీవల రాజస్థాన్‌కు చెందిన ఎమ్మెల్యే సందీప్‌ యాదవ్‌కు పలుమార్లు ఫోన్‌ చేసి ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని, రూ.20 లక్షలు పంపాలని డిమాండ్‌ చేయడంతో అక్కడి పోలీసులు సైబర్‌ కేసు నమోదు చేసి విష్ణుమూర్తిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పక్కా సమాచారంతో ఇక్కడికి వచ్చిన బివాడీ (రాజస్థాన్‌) సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జితేంద్ర సింగ్‌ నేతృత్వంలో సిబ్బంది మొబైల్‌ ఫోన్‌ ఆధారంగా లోకేషన్‌ను గుర్తించి విష్ణుమూర్తిని అరెస్టు చేశారు.

అనంతరం ట్రాన్సిట్‌ వారెంట్‌పై నిందితుడిని రాజస్థాన్‌ తీసుకెళ్లి విచారించిన పోలీసులకు కళ్లు చెదిరే విషయాలు తెలిసినట్టు చెబుతున్నారు. సీఎంవో నుంచి మాట్లాడుతున్నానంటూ విష్ణుమూర్తి అక్కడి ఎమ్మెల్యేలకు ఫోన్‌ చేసి సుమారు రూ.2.50 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేల నుంచి వసూలు చేసిన డబ్బుల్లో రూ.80 లక్షలతో ప్రియురాలికి గాజువాకలో ఇల్లు కొన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్టు తెలిసింది.  

ఉత్తరాంధ్రలోనూ కేసులు 
విష్ణుమూర్తిపై గతంలో ఉత్తరాంధ్రలోనూ పలు కేసులున్నాయి. విశాఖలోని వివిధ పోలీస్‌ స్టేషన్లతోపాటు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోనూ మొత్తం నాలుగు కేసులు నమోదైనట్టు చెబుతున్నారు. తనకున్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల నుంచి 2019లో రూ.1.80 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్టు చెబుతున్నారు. నిందితుడి నేరాల ట్రాక్‌ రికార్డును చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆ వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించడంలేదు.    

మరిన్ని వార్తలు