నాకు పోరాడే ఓపిక ఇక లేదు.. ఐ లవ్‌ యూ అమ్మా, నాన్న

11 Oct, 2022 09:33 IST|Sakshi

కర్నూలు: ‘అమ్మా, నాన్న, నా చిట్టి తమ్ముడు మీ అందరికీ నా క్షమాపణలు. ఎందుకంటే మీరు ఈ లేఖను చదివే సమయానికి నేను మీతో ఉండకపోవచ్చు. కారణం నా ఆరోగ్య సమస్య. నాకు ఇక దీనితో పోరాడే ఓపిక లేదు. ఇప్పటికి ఆరు సంవత్సరాలు అయ్యింది. ఎన్నో సార్లు ఈలోకాన్ని విడిచి పోదామనుకున్నాను. ధైర్యం ఉన్నా ఆ పని చేయకపోవడానికి కారణం మీరు. ఇంత కాలం కష్టపడి పెంచిన తల్లిదండ్రులకు ఉపయోగపడలేకపోతున్నాననే భావన నన్ను ఆపేస్తూ ఉండేది. ఏదో ఒక రోజు నాది అవుతుందిలే అనుకుని పోరాడాను. కానీ ఆరోజు ఎప్పటికీ నా జీవితంలో రాదని  అర్థం అయ్యింది. మీకు ఏ రకంగాను ఉపయోగపడలేకపోతున్నా. నా విచిత్రమైన జీవన అలవాట్లతో మిమ్మల్ని బాధపెట్టనూ లేను.

ఇక నాకు నమ్మకం పోయింది. జీవించాలనే ఆశ సన్నగిల్లింది. బతకలేక వెళ్లిపోవడం లేదు అమ్మా..బతికి మిమ్మల్ని బాధ పెట్టలేక పోతున్నా..ఐ లవ్‌ యూ అమ్మా, నాన్న, తమ్ముడు ’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో ఉరివేసుకొని సాయివెంకట్‌(24) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం ఎమ్మిగనూరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు.. పట్టణంలోని గీతామందిర్‌ వెనక గాయిత్రి దేవాలయం పక్కన అద్దె ఇంట్లో సాయిరాం, శకుంతలమ్మ నివాసముంటున్నారు. సాయిరాం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా, శకుంతలమ్మ పట్టణంలోని వీవర్స్‌ కాలనీలోని జెడ్పీ హైసూ్కల్‌లో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. వీరికి సాయి వెంకట్‌(24), దిలీప్‌ సంతానం.

సాయివెంకట్‌ బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. దిలీప్‌ వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో వెటర్నరీ కాలేజీలో చదువుతున్నాడు. ఇటీవల జరిగిన టెట్‌ పరీక్షలో సాయివెంకట్‌ మంచి మార్కులు సాధించాడు. తండ్రి డ్యూటీకి, తల్లి శకుంతలమ్మ హైదరాబాద్‌లో బంధువుల గృహప్రవేశానికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సాయివెంకట్‌ వంట గదిలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విధుల నుంచి తిరిగి వచ్చిన తండ్రి ఇంట్లో కుమారుడి మృతదేహాన్ని చూసి దిగ్భ్రాంతికి గురై కుప్పకూలిపోయాడు. కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు వచ్చి ధైర్యం చెప్పారు. విషయం తెలుసుకుని పట్టణ ఎస్‌ఐ మస్తాన్‌వలి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చేతికి వచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

‘నా కుమారుడు పిరికివాడు కాదు’ 
తన కుమారుడు సాయివెంకట్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తండ్రి హెడ్‌కానిస్టేబుల్‌ సాయిరాం తెలిపారు. తన కుమారుడి ఆత్మహత్యపై తనకు అనుమానం ఉందని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడు ఆరోగ్యంగానే ఉన్నాడని, ఎవరో బలవంతంగా సూసైడ్‌ నోట్‌ రాయించి, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని టౌన్‌ ఎస్‌ఐ మస్తాన్‌వలి తెలిపారు.

మరిన్ని వార్తలు