పెళ్లయిన యువతికి తల్లిదండ్రులు మరో పెళ్లి.. భర్తకు తెలిసి..

10 Jun, 2022 09:15 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

నెల్లూరు(క్రైమ్‌): తాను వివాహం చేసుకున్న యువతికి ఆమె తల్లిదండ్రులు మరొకరితో పెళ్లి చేశారనే విషయాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు.. అనంతపురంలోని గౌరీ థియేటర్‌ సమీపంలో నివసిస్తున్న బాలకృష్ణసింగ్‌ రాడ్‌ బైండింగ్‌ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు.

నాలుగేళ్ల క్రితం తిరుమల వెళ్లిన ఆయనకు కలువాయి మండలానికి చెందిన ఓ యువతితో పరిచయమై ప్రేమగా మారింది. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో ఆమెను కావలిలోని బంధువుల ఇంట్లో ఉంచి వివాహానికి యత్నాలు చేశారు. దీంతో గతేడాది మేలో బాలకృష్ణసింగ్, యువతి పారిపోయి వివాహం చేసుకొని అనంతపురంలో కాపురం పెట్టారు. యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసును నమోదు చేసిన కావలి పోలీసులు అనంతపురంలో ఉన్న వీరిని తీసుకొచ్చారు.

చదవండి: (మద్యం మత్తులో మిత్రుల వివాదం.. గాజుసీసా ముక్కతో..)

యువతి తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో పది రోజుల్లో వివాహం చేస్తామని తమ కుమార్తెను వెంట తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆమె జాడ తెలియరాలేదు. తమ పెళ్లి ఫొటోలను సోషల్‌ మీడియాలో బాలకృష్ణసింగ్‌ పెట్టడంతో యువతి కుటుంబసభ్యులు దిశ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణకు గానూ ఈ నెల ఆరున ఆయన హాజరయ్యారు. అతని మొబైల్‌ ఫోన్లోని ఫొటోలను పోలీసులు డిలీట్‌ చేయించి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజు కౌన్సెలింగ్‌ చేశారు.

ఈ క్రమంలో తమ కుమార్తెకు వివాహం చేశామని, ఆమె జోలికి రావొద్దని తల్లిదండ్రులు సూచించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఫోన్‌ కోసం దిశ పోలీస్‌స్టేషన్‌కు బుధవారం బయల్దేరిన బాలకృష్ణసింగ్‌.. సమీపంలోని చెట్ల వద్ద తలకు రాసుకునే ఆయిల్‌ను తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు ఆయన్ను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌లో చేర్పించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు కేసును బుధవారం అర్ధరాత్రి నమోదు చేశారు.     

మరిన్ని వార్తలు