వైజాగ్‌లో కిడ్నాప్‌.. తాడివారిపల్లెలో హత్య

16 Feb, 2023 11:53 IST|Sakshi

పొదిలిరూరల్‌: ఒంగోలు–నంద్యాల రహదారిలో తాడివారిపల్లె చెక్‌పోస్ట్‌ సమీపంలో కాలిన మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. అక్రమ సంబంధం నేపథ్యంలో బత్తుల దేవధరణి అనే యువకుడిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బుధవారం రాత్రి పొదిలి సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి యువకుడి హత్య కేసు వివరాలు వెల్లడించారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం పెద్ద ఎమ్మనూరు గ్రామానికి చెందిన బత్తుల దేవధరణి(22) చిన్నప్పటి నుంచి చెడు వ్యవసనాలకు బానిసై తిరుగుతుండేవాడు. మహిళలకు పోన్‌ చేసి మాట్లాడటం, ఆకతాయితనంగా ఉండటంతో తన అన్న పవన్‌సాయి విశాఖపట్టణంలో తన దగ్గరకు తీసుకెళ్లాడు.

 అక్కడే ఇంటర్‌ వరకు చదివించడంతోపాటు ఓ రెస్టారెంట్లో పనిలో చేర్చాడు. చదువు మధ్యలో ఆపేసిన దేవధరణి నిత్యం సామాజిక మాధ్యమాల్లో చాటింగ్‌ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో గంగ అనే యువతి పరిచయం కాగా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. గంగకు ప్రవీణ్‌కుమార్‌ అనే వ్యక్తితో ముందే అక్రమ సంబంధం ఉంది. దీంతో దేవధరణి, ప్రవీణ్‌కుమార్‌ మధ్య తరచూ వివాదం నడుస్తోంది. వీరిద్దరితో పవన్‌సాయి మాట్లాడి సర్దుబాటు చేసినప్పటికీ గంగతో దేవధరణి చాటింగ్‌ చేయడం మాత్రం ఆపలేదు. దీంతో దేవధరణిని అడ్డు తొలగించాలని ప్రవీణ్‌కుమార్‌ పథకం రచించాడు. అహోబిలం వెళ్లేందుకని చెప్పి జనవరి 30న బాడుగకు కారు మాట్లాడాడు. 

మనోజ్, చాణక్య, శివకుమార్, నరేష్, స్వప్న అనే యువతితో దేవధరణిని నమ్మబలికించి కారులో ఎక్కించారు. మార్గమధ్యంలో దేవధరణికి క్లోరోఫామ్‌ ఇచ్చి స్పహలో లేకుండా చేశారు. క్లోరోఫామ్‌ ప్రభావంతో దేవధరణి కారులోనే మలమూత్రాలు విసర్జించడంతో తర్లుపాడు మండలం తాడివారిపల్లె ఘాట్‌ రోడ్డులో కారు ఆపి కిందకు దించారు. అటవీ ప్రాంతంలో కత్తితో గొంతు కోసి, పెట్రోల్‌ పోసి కాల్చి చంపారు. 

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దేవధరణి కనిపించకపోవడంతో సోదురుడు పవన్‌సాయి విశాఖపట్టణం వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు చంపడానికి ఉపయోగించిన బాడుగ కారు డ్రైవర్‌ శివకిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు. నిందితుల్లో ఒకడు అరెస్టయ్యాడని, మిగిలిన వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. సమావేశంలో పొదిలి సీఐ సుధాకర్‌రావు, తర్లుపాడు ఎస్సై ముక్కంటి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు