యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ప్రేమికుడు 

21 Aug, 2021 03:46 IST|Sakshi

పెళ్లి చేసుకోమన్నందుకు అఘాయిత్యం 

ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘటన 

యువతితోపాటు ఆమె సోదరి, ఆరేళ్ల బాలుడికి గాయాలు 

ముగ్గురి ప్రాణాలు కాపాడిన ‘దిశ’యాప్‌

సాక్షి ప్రతినిధి, విజయనగరం/అమరావతి: ప్రేమించిన యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ప్రేమికుడి ఉదంతమిది. ఏపీలోని విజయనగరం జిల్లా  చౌడు వాడలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో గాలి రాములమ్మ అనే యువతి గాయపడింది. మంటల కారణంగా రాములమ్మ సోదరి సంతోషి, ఆమె ఆరేళ్ల కుమారుడు అరవింద్‌ సైతం గాయపడ్డారు. ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు.  

పెళ్లి చేసుకోమని అడిగిందని.. 
రాములమ్మ, శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువకు చెందిన వ్యాన్‌డ్రైవర్‌ ఆళ్ల రాంబాబు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ముందు ఇరు కుటుంబాలు అంగీకరించినా తర్వాత నిరాకరించారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ రాములమ్మ అడుగుతుండటంతో కక్ష పెంచుకున్న రాంబాబు గురువారం రాములమ్మ ఇంటికి వెళ్లి ఆమెపై పెట్రో ల్‌పోశాడు. అది సంతోషి, అరవింద్‌పైనా పడింది. రాంబాబు నిప్పు పెట్టడంతో ముగ్గురూ మంటల్లో చిక్కుకున్నారు. రాములమ్మ కుటుంబ సభ్యులు దిశ ద్వారా పోలీసులకు సమాచారమిచ్చారు. అప్రమత్తమైన కానిస్టేబుల్‌ దామోదర్, హోం గార్డు సత్యనారాయణ  ముగ్గురినీ విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఎం ఆదేశాలతో మెరుగైన చికి త్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   

మరిన్ని వార్తలు