ఉత్తరాంధ్ర కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం

14 Oct, 2022 06:00 IST|Sakshi
మానవహారం మధ్యలో తగలబడుతున్న మోటారు బైక్,

బైక్‌పై, తనపై పెట్రోలు.. బైక్‌కు నిప్పంటించి మంటల్లోకి దూకేయత్నం

అడ్డుకున్న స్థానికులు.. యువకుడితో పాటు మరో ముగ్గురికి గాయాలు

విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలంటూ యువకుడి డిమాండ్‌ 

చోడవరంలో నిర్వహించిన మానవహారంలో ఘటన

చోడవరం (అనకాపల్లి జిల్లా): విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో జరిగింది. ప్రమాదంలో యువకుడితో పాటు ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక ఎంపీటీసీ సభ్యుడు, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం చోడవరం మండలంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ కూడా పాల్గొన్నారు. బైక్‌ ర్యాలీ అనంతరం స్థానిక కొత్తూరు జంక్షన్‌ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. మానవహారంలో పాల్గొన్న పీఎస్‌పేటకు చెందిన సీహెచ్‌ శ్రీనివాసరావు అనే యువకుడు అకస్మాత్తుగా పక్కనే ఉన్న తన మోటారు సైకిల్‌ను తీసుకొచ్చి మానవహారం మధ్యలో పడేశాడు. అప్పటికే బాటిల్‌తో తెచ్చుకుని ఉన్న పెట్రోల్‌ను మోటారు సైకిల్‌పై, తన ఒంటిపై పోసుకున్నాడు.

మానవహారంలో ఉన్న ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీతో పాటు మిగతా ఉద్యమకారులు పరుగెత్తుకుని వచ్చి అతని వద్ద ఉన్న పెట్రోల్‌ బాటిల్‌ను తీసుకున్నారు. ఇంతలో తన వద్ద ఉన్న అగ్గిపెట్టె వెలిగించి బైక్‌పై వేయడంలో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఆ యువకుడు ప్రయత్నించగా అక్కడ ఉన్న ఉన్నవారంతా వారించి అతనిని దూరం లాక్కెళ్లి.. అతనికి అంటుకున్న మంటలను ఆర్పారు.

ఘటనలో ఒక్కసారిగా బైక్‌ నుంచి మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న చోడవరం–8వ సెగ్మెంట్‌ ఎంపీటీసీ సభ్యుడు పుట్రేటి శ్యామ్‌ప్రసాద్‌కు అంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరు పుల్లేటి అప్పారావు, పతివాడ అప్పారావులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాసరావుతో సహా వీరందరినీ చికిత్స కోసం చోడవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ప్రాణత్యాగానికి సిద్ధం
ఆత్మహత్యాయత్నం అనంతరం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో వెనుకబడి ఉందని, తనలాంటి నిరుద్యోగులెందరో ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు తరలిపోవాల్సిన దుస్థితి ఉందన్నారు. విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయాలన్నదే తన కోరికని.. ఇందుకోసమే ప్రాణత్యాగానికి సిద్ధమైనట్టు చెప్పారు. ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ మాట్లాడుతూ తమ సహనాన్ని పరీక్షించొద్దని, ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టొద్దని కోరారు. ప్రజా ఉద్యమం ఉధృతం అవ్వకముందే అమరావతి పాదయాత్రను ఆపాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు