విదేశీ విద్యకు వెళ్లే వేళ.. కడలి అలలకు బలి

7 May, 2022 11:10 IST|Sakshi

తొండంగి: ఉజ్వల భవిష్యత్తు కోసం మరో నాలుగు రోజుల్లో జర్మనీ వెళ్లాల్సిన ఆ యువకుడు కడలి కెరటాలకు బలైన ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుని కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. పైడికొండ పంచాయతీ ఆనూరుకు చెందిన త్రిపరాన కాసులు, నూకరత్నం దంపతులు ఒక్కగానొక్క కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు వివాహాలు కాగా కుమారుడు సుబ్రహ్మణ్యం (26) విజయవాడ కేఎల్‌ యూనివర్సిటీలో బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివాడు. ఉన్నత చదువులకు జర్మనీ వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నాడు.

సముద్రంలో స్నానం చేద్దామని శుక్రవారం ఉదయం ఐదు గంటలకు స్వగ్రామం నుంచి ఒక్కడే బైక్‌పై దగ్గరలోని వేమవరం పంపాదిపేట తీరానికి వెళ్లాడు. స్నానం చేస్తున్న క్రమంలో కెరటాల ఉధృతికి గల్లంతయ్యాడు. స్నానానికి వెళ్లిన సుబ్రహ్మణ్యం ఎంతకూ రాకపోవడంతో బంధువులు సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ అతడి సెల్‌ఫోన్, దుస్తులను గమనించారు. సుబ్రహ్మణ్యం కనిపించకపోవడంతో గల్లంతయ్యాడని భావించి, మత్స్యకారుల సాయంతో వెతకడం ప్రారంభించారు. నాలుగు గంటల అనంతరం సుబ్రహ్మణ్యం మృతదేహం అద్దరిపేట తీరానికి చేరింది. ఒక్కగానొక్క కుమారుడు అర్ధాంతరంగా మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

మరిన్ని వార్తలు