మాస్క్‌ పెట్టుకోమన్నందుకు కార్పొరేటర్‌పై దాడి

29 Apr, 2021 09:07 IST|Sakshi
బ్రాడీపేటలో బాయ్స్‌ హాస్టల్‌ వద్ద భారీగా గుమిగూడిన జనం

పట్నంబజారు(గుంటూరు): మంచి చెబితే చెడు ఎదురైందన్న చందంగా జరిగింది నగరంలో ఓ కార్పొరేటర్‌కు...మాస్క్‌ లేకుండా తిరుగుతున్న కుర్రాడిని మాస్క్‌ పెట్టుకోమన్నందుకు కార్పొరేటర్‌పై దాడి చేయటం బుధవారం నగరంలో సంచలనం కలిగించింది.  వివరాల్లోకి వెళితే... గుంటూరు నగరంలోని 32వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి) బుధవారం ఉదయం బ్రాడీపేట ప్రాంతంలో రోజూ మాదిరిగానే పర్యటిస్తూ శానిటేషన్‌ పనులు చేయిçస్తున్నారు. ఈ క్రమంలో 4/17లో సాయిచరణ్‌ బాయ్స్‌ హాస్టల్‌ వద్ద భారీ సంఖ్యలో యువకులు ఎటువంటి మాస్క్‌లు లేకుండా కూర్చుని ఉన్నారు. ఇది గమనించిన ఆచారి ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్‌లు లేకుండా గుంపులుగా కూర్చోవటం సరికాదని చెప్పారు.

దీంతో రెచ్చిపోయిన యువకులు నువ్వు మాకు చెప్పేది ఏంటంటూ ఆచారిపై దాడికి తెగబడ్డారు. వసతిగృహం పక్కన ఉన్న రాళ్లతో ఆయనపై దాడి చేయటంతో గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆచారి పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్‌లో ఉండే ఎస్‌.శివశంకర్, ఎస్‌.వెంకటేశ్వర్లు, వి.హేమంత్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మరికొంత మంది ఉన్నట్లు గుర్తించామని వారిని అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఘటన గురించి తెలుసుకున్న మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు పట్టాభిపురం స్టేషన్‌కు వచ్చారు. ఘటనకు కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.  

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : ఆచారి 
మాస్క్‌ పెట్టుకోమన్నందుకు తనపై దాడి చేసిన యువకులతో పాటు వారిని కాపాడేందుకు ప్రయత్నించిన హాస్టల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆచారి డిమాండ్‌ చేశారు. బ్రాడీపేటలోని హాస్టళ్ల వద్ద నిత్యం ఇదే తంతు నడుస్తోందని, యువకులు మాస్క్‌లు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పలు హాస్టళ్ల వద్ద గంజాయి సేవిస్తున్న పరిస్థితులను కూడా తాను గుర్తించినట్లు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
చదవండి: ‘యానాం’ రైతులకూ ‘వైఎస్సార్‌ రైతు భరోసా’

మరిన్ని వార్తలు