ప్రేమ విఫలంతో యువకుడి బలవన్మరణం

29 Jan, 2021 08:54 IST|Sakshi

మార్టూరు: ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని రాజుపాలెంలో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఇంకొల్లు సీఐ అల్తాఫ్‌ హుస్సేన్, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాజుపాలెం తూర్పు ఎస్సీ కాలనీకి చెందిన బైరపోగు కాసియ్య, భూలక్ష్మి దంపతుల కుమారుడు కిశోర్‌ (21) బేల్దారి పని చేస్తుంటాడు. అతడు ఏడాది నుంచి అదే కాలనీకి చెందిన ఓ బాలికతో ప్రేమయాణం సాగిస్తున్నాడు. ఇంతలో ఐదు నెలల క్రితం అదే కాలనీకి చెందిన మరో యువకుడితో పెద్దలు బాలికకు వివాహం జరిపించారు. ఆమె గత వారం భర్తను వదిలి నీతోనే ఉంటానని కిశోర్‌ ఇంటికి వచ్చింది.

ఆమె భర్త తరఫు బంధువుల ఫిర్యాదుతో విషయం పోలీసుస్టేషన్‌కు చేరింది. పోలీసులు, ఐసీడీఎస్‌ అధికారులు కలిసి బాలికకు, కిశోర్‌కు రెండు రోజుల క్రితం పోలీసుస్టేషన్‌లో కౌన్సిలింగ్‌ ఇచ్చి ఎవరి దారిన వారిని పంపించారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిశోర్‌ టవల్‌తో ఇంటి సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా గమనించిన బంధువులు అతడిని మార్టూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కిశోర్‌ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి విచారించి వివరాలు సేకరించారు. స్థానిక ఆస్పత్రిలో కిశోర్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

మరిన్ని వార్తలు