పది రోజుల్లో పెళ్లి.. మెసేజ్‌లు, వాయిస్‌ రికార్డులు చూపించి..

4 Feb, 2022 16:42 IST|Sakshi

సంతబొమ్మాళి (శ్రీకాకుళం): తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువతి.. ఆర్మీ జవాన్‌ ఇంటి ముందు బైఠాయించింది. ఈమెకు గ్రామస్తులంతా మద్దతు పలకడంతో సదరు వ్యక్తి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..సంతబొమ్మా ళి మండలం యామలపేటకు చెందిన మురాల తులసీరావు, పార్వతిల కుమార్తె మీనాకు గాజువాకకు చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 16న వివాహం కావాల్సి ఉంది. పది రోజుల క్రితం  కుమార్తె తల్లిదండ్రులు కట్నం డబ్బులు ఇవ్వడానికి గాజువాక వెళ్లగా వరుడు పెళ్లికి నిరాకరించడంతో నిర్ఘాంతపోయారు.

ఎందుకని ప్రశ్నించగా.. గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ పరపటి జగదీష్.. మీనాతో అతనికి ఉన్న స్నేహాన్ని తనకు చెప్పాడని, సెల్‌ఫోన్‌ మెసేజ్‌లు, వాయిస్‌ రికార్డులను చూపించాడని అన్నాడు. అందుకనే తనకు ఈ సంబంధం వద్దని తెగేసి చెప్పాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు ఆర్మీ జవాన్‌ జగదీష్‌ గ్రామానికి వెళ్లి గ్రామపెద్దలతో పంచాయతీ పెట్టారు. మీనాను పెళ్లి చేసుకోవాలని జగదీష్‌ను కోరారు. అయినా పట్టించుకోకపోవడంతో గురువారం జగదీష్‌ ఇంటిముందు నిరసన చేపట్టారు. దీంతో యువకుడు ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న నౌపడ ఏఎస్‌ఐ నర్సింగరావు సిబ్బందితో కలిసి గ్రామస్తులతో మాట్లాడారు. మీనా న్యాయం జరిగే వరకు కదిలేది లేదని తేల్చిచెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు.  

చదవండి: (సోషల్‌ మీడియా పరిచయం, పెళ్లి.. ఆ తర్వాతే అసలు కథ..)

మరిన్ని వార్తలు