నేడే ‘వైఎస్సార్‌ బీమా’

21 Oct, 2020 03:37 IST|Sakshi

లబ్ధిదారుల ఖాతాలకు ప్రీమియం మొత్తం జమ

నవంబర్‌ 6న ‘జగనన్న తోడు’ ప్రారంభం

సచివాలయాలను తరచూ తనిఖీ చేయాలి

ఈ విషయంలో కలెక్టర్లు ఏమాత్రం నిర్లక్ష్యం చూపొద్దు

రైతులకు ఉచిత విద్యుత్‌ ఒక హక్కు.. అందుకే మీటర్లు

‘స్పందన’ సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం

సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్‌ బీమా’ పథకాన్ని బుధవారం ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రీమియం మొత్తం జమ చేస్తామని, వారం రోజుల్లో ఖాతాలకు చేరుతుందని తెలిపారు. ఈ పథకంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్‌ ఖాతా ఉండాలని స్పష్టం చేశారు. ‘జగనన్న తోడు’ పథకాన్ని నవంబరు 6న  ప్రారంభిస్తామని, బ్యాంకర్లతో మాట్లాడి దరఖాస్తు దారులందరికీ రుణాలు మంజూరు చేయించాలని కలెక్టర్లు, జేసీలను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా వివిధ పథకాల అమలు తేదీలను ప్రస్తావించిన ముఖ్యమంత్రి జగన్‌ అన్నింటిలోనూ కలెక్టర్లు, జేసీలు కీలకపాత్ర పోషించాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీ, సకాలంలో సేవలు, స్కూళ్లలో నాడు–నేడు, ఉపాధి హామీ పనులు, వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాలు, వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ తదితరాలపై స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలకు సీఎం జగన్‌ మార్గనిర్దేశం చేశారు. సీఎం సమీక్ష వివరాలివీ..

సచివాలయాల తనిఖీ తప్పనిసరి..
ఒక ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలను కలెక్టర్లు, జేసీలు తరచూ తనిఖీ చేయాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపొద్దు. కలెక్టర్లు వెళితే జేసీలు కూడా వెళ్తారు. వారు వెళితే ఇతర అధికారులు కూడా తనిఖీలు చేస్తారు. ప్రాజెక్టు ఆఫీసర్, సబ్‌ కలెక్టర్, మున్సిపల్‌ కమిషనర్, జిల్లాలో ప్రతి ఐఏఎస్‌ అధికారి తప్పనిసరిగా సచివాలయాలను తనిఖీ చేయాలి. గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి. అదే నా సంకల్పం. అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం కాబట్టి ప్రతి అధికారి తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలి.

100 శాతం సకాలంలో సేవలు... 
నిర్దేశిత గడువులో సేవలు (ఎస్‌ఎల్‌ఏ) ఇప్పుడు 96.6 శాతం అందుతున్నాయి. ఇది నూటికి నూరు శాతం కావాలి. దరఖాస్తు తర్వాత 90 రోజుల్లో ఇంటి స్థలం ఇస్తామన్నాం. అది కచ్చితంగా జరిగి తీరాలి. పెన్షన్‌ కానుక, ఆరోగ్యశ్రీ కార్డులు, బియ్యం కార్డులు, ఇళ్ల స్థలాల కేటాయింపు.. ఈ నాలుగింటికి ఎస్‌ఎల్‌ఏ ఉండగా కొత్తగా 15 రెవెన్యూ సర్వీసులను కూడా చేర్చాం.

సకాలంలో పూర్తి చేస్తే అదనంగా ‘ఉపాధి’
ఉపాధి హామీ కింద గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, స్కూళ్లకు ప్రహరీల నిర్మాణం వచ్చే ఏడాది మార్చి 31 వరకు పూర్తి కావాలి. ప్రతి నియోజక వర్గానికి రూ.10 కోట్ల విలువైన ఉపాధి పనులు కల్పించాం. సకాలంలో అన్ని పూర్తి చేస్తే అదనంగా మరో రూ.5 కోట్ల విలువైన పనులు కల్పిస్తాం.

వేగంగా స్కూళ్లలో నాడు–నేడు 
నాడు–నేడు తొలిదశ కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనులన్నీ నవంబరు 15 నాటికల్లా పూర్తి చేయాలి. తల్లిదండ్రుల కమిటీలపైనే పూర్తి భారం మోపకుండా జేసీలు బాధ్యత తీసుకుని ప్రతి రెండు రోజులకు ఒకసారి సమీక్షించాలి.

వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాలతో పెనుమార్పులు
గ్రామీణ వైద్యంలో వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాలు భవిష్యత్తులో పెను మార్పులు తీసుకు రానున్నాయి. వీటిల్లో ఆశా వర్కర్లు, హెల్త్‌ అసిస్టెంట్లు అందుబాటులో ఉంటూ 55 రకాల ఔషధాలను సిద్ధంగా ఉంచుతారు. 355 అర్బన్‌ ఆరోగ్య కేంద్రాల కోసం భూమి గుర్తించాం. ఏ నిర్మాణంలో అయినా నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. జేసీలు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం వేగంగా జరగాలి.

వైద్య కాలేజీలకు భూ సమస్య పరిష్కరించాలి
కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలలకు (అదోని, పిడుగురాళ్ల) ఇంకా భూ సేకరణ జరగాల్సి ఉంది. పాత వైద్య కళాశాలలకు సంబంధించి కాకినాడ, ఒంగోలు, అనంతపురంలో భూ సేకరణ /భూమి అప్పగింతలో సమస్యలను కలెక్టర్లు వెంటనే పరిష్కరించాలి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక టీచింగ్‌ ఆస్పత్రితో పాటు, నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు ప్రభుత్వ లక్ష్యం. 

నాణ్యమైన విద్యుత్‌ కోసమే మీటర్లు..
వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్‌ సరఫరాలో మరింత నాణ్యత ఉంటుందన్న విషయంపై రైతులకు అవగాహన కల్పించాలి. మీటర్లు ఏర్పాటు చేసినప్పటికీ రైతులకు ఒక్క రూపాయి కూడా భారం పడబోదన్న విషయాన్ని స్పష్టం చేయాలి. విద్యుత్‌ బిల్లుల మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. వారు ఆ మొత్తాన్ని డిస్కమ్‌లకు చెల్లిస్తారు. తద్వారా నాణ్యమైన విద్యుత్తు కోసం రైతులు ప్రశ్నించవచ్చు.

అది.. రైతుల హక్కు..
రైతులకు ఉచిత విద్యుత్‌ ఒక హక్కు లాంటిది. అందుకే మీటర్లు ఏర్పాటు చేస్తున్నాం. నాణ్యమైన ఉచిత విద్యుత్‌ కోసం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ.2.50కే వస్తుంది. ఆ విధంగా రైతులకు 30 ఏళ్ల వరకు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వవచ్చు. గత ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్‌కు సంబంధించి 14 నెలలకు ఏకంగా రూ.8,700 కోట్లు బకాయి పెట్టిపోయింది. వీటన్నింటిపై రైతులకు అవగాహన కల్పించడంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇందుకోసం సచివాలయాల్లో పోస్టర్లు ప్రదర్శించాలి. ఈ పథకం సక్సెస్‌ కాకూడదని కొందరు కోరుకుంటున్నారు. కాబట్టి మనం అంకిత భావంతో పని చేయాలి.

1.41 కోట్ల కుటుంబాలకు..
నిరుపేద కుటుంబాలకు జీవన భద్రత కల్పిస్తూ కష్టకాలంలో ఆదుకునేలా మరో పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బియ్యం కార్డులున్న కుటుంబాలను ఆపత్కాలంలో ఆదుకునేందుకు ‘వైఎస్సార్‌  బీమా’ పథకాన్ని తెచ్చింది. సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. కుటుంబ పెద్ద సాధారణంగా లేక ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకుండా ఆదుకునేలా ప్రభుత్వం వైఎస్సార్‌ బీమా పథకాన్ని రూపొందించింది. లబ్ధిదారుల తరఫున బీమా సంస్థలకు రూ.510 కోట్లకు పైగా ప్రీమియం చెల్లిస్తోంది. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల్లో  కుటుంబ పెద్ద హఠాత్తుగా మరణించడం లేదా అంగ వైకల్యానికి గురైతే ఆ కుటుంబం పడే అవస్థలను ప్రజా సంకల్ప పాదయాత్రలో సీఎం జగన్‌ స్వయంగా చూశారు. అధికారంలోకి రాగానే ఆ కుటుంబాలకు ప్రభుత్వపరంగా అండగా నిలబడాలన్న లక్ష్యంతో వైఎస్సార్‌ బీమా పథకాన్ని ప్రకటించారు. 

బీమా ప్రయోజనాలు..
► బియ్యం కార్డులు కలిగిన కుటుంబాలు వైఎస్సార్‌ బీమా పథకానికి అర్హులు. 18 నుంచి 70 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండి కుటుంబాన్ని పోషించే వారికి ఈ పథకం వర్తిస్తుంది. 
► 18 – 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న లబ్ధిదారుడు సహజ మరణం పొందితే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.5 లక్షలు చొప్పున బీమా పరిహారం చెల్లిస్తారు. లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు పూర్తి అంగవైకల్యం పొందితే రూ.5 లక్షలు బీమా పరిహారం అందిస్తారు. 
► 51 – 70 ఏళ్ల మధ్య వయసు లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.3 లక్షలు పరిహారం లభిస్తుంది. శాశ్వత అంగవైకల్యం పొందితే రూ.3 లక్షలు బీమా పరిహారం అందుతుంది. 18 – 70 సంవత్సరాల వయసు గల లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు పాక్షిక/ శాశ్వత అంగ వైకల్యానికి గురైతే రూ.1.50 లక్షల బీమా పరిహారం అందిస్తారు. 

ప్రీమియాన్ని భరించనున్న ప్రభుత్వం..
వైఎస్సార్‌ బీమా పథకం పూర్తి ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ మేరకు రూ.510 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. ఈ పథకం ద్వారా 1.41 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. కోవిడ్‌ వల్ల ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్‌ బీమా పథకాన్ని అమలు చేయాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు