పరిశుభ్రతే లక్ష్యం

19 Jan, 2021 02:56 IST|Sakshi

ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి

విద్యాశాఖ అధికారులతో సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌  

టాయిలెట్ల నిర్వహణ బాగోలేక పిల్లలు బడి మానేయడం చూశాం

ప్రత్యేక నిధి ద్వారా ఇప్పుడా పరిస్థితిని పూర్తిగా మారుస్తున్నాం 

శుభ్రపరచడంపై కేర్‌టేకర్లకు అవగాహన కల్పించాలి

ఎప్పుడు మరమ్మతులు వచ్చినా వెంటనే చేయించాలి

ఫిబ్రవరి ప్రథమార్ధంలో అన్ని తరగతుల ప్రారంభంపై ఆలోచించాలి 

వచ్చే విద్యా సంవత్సరం 7వ తరగతికి ఇంగ్లిష్‌ మాధ్యమంలో బోధన 

నాడు – నేడు ద్వారా పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు, నాణ్యమైన బోధన 

విద్యార్థుల హాజరుపై ప్రత్యేక యాప్‌తో పర్యవేక్షణ 

ఫిబ్రవరి ప్రథమార్ధంలో అన్ని తరగతులను ప్రారంభించే విషయం ఆలోచిం చాలి. రోజువారీ తరగతుల నిర్వహణపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి. వచ్చే విద్యా సంవత్సరంలో ఏడవ తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్‌ మాధ్యమంలో బోధన సాగించడంపై దృష్టి పెట్టాలి.  
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పాఠశాలల్లో టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండాలని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. టాయిలెట్ల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌)  తయారు చేయాలని సూచించారు. పాఠశాల విద్య, టాయిలెట్ల నిర్వహణ, విద్యార్థుల కోసం మొబైల్‌ యాప్‌పై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల హాజరును ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో నమోదు చేసి, పర్యవేక్షించాలని చెప్పారు.

హాజరు వివరాలను నేరుగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చూసుకునే అవకాశం కల్పించాలన్నారు. పిల్లలు స్కూల్‌కు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్‌ వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు స్కూళ్లకు రాని పక్షంలో వలంటీర్‌ ద్వారా కూడా వారి యోగ క్షేమాలు కనుక్కోవాలని.. ఈ విషయంపై గ్రామ, వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ పర్యవేక్షణ చేయాలన్నారు. టాయిలెట్ల పర్యవేక్షణకు ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ తయారు చేశామని, టాయిలెట్ల నిర్వహణ నిధిపై రాష్ట్ర, జిల్లా స్థాయి, స్కూలు లేదా కాలేజీ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో హాజరు విషయాలను యాప్‌లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ తదితరులు 

టాయిలెట్ల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం
– పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణను అత్యంత ప్రాధాన్యత అంశంగా చూడాలి. టాయిలెట్లు లేక పోవడం, ఉన్న వాటిని సక్రమంగా నిర్వహించక పోవడం వల్ల చాలా వరకు పిల్లలు స్కూళ్లకు పోలేని పరిస్థితిని గతంలో చూశాం. అందుకే మనం దీన్ని ప్రాధాన్యత కార్యక్రమంగా చేపట్టాం. 
– ఉత్తమ నిర్వహణ విధానాల ద్వారా పరిశుభ్రమైన టాయిలెట్లను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పాఠశాలల్లో ఆరోగ్యకరమైన పరిస్థితులను తీసుకు రావడానికి టాయిలెట్‌ నిధిని ఏర్పాటు చేశాం. ఆ నిధి ద్వారా టాయిలెట్లను పరిశుభ్రంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం.
– రానున్న కాలంలో టాయిలెట్లు నిర్వహణ అత్యుత్తమంగా ఉండాలి. టాయిలెట్ల క్లీనింగులో వాడే రసాయనాల వినియోగంపై కూడా కేర్‌టేకర్లకు అవగాహన కల్పించాలి. టాయిలెట్‌ను ఒకసారి వినియోగించిన తర్వాత కచ్చితంగా క్లీన్‌ చేయాలి. 
– టాయిలెట్ల నిర్వహణలో అవగాహన కల్పించేందుకు సులభ్‌ లాంటి సంస్థల అనుభవాన్ని, వారి నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

సకాలంలో విద్యా కానుక అందాలి
విద్యా కానుకకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి. స్కూళ్లు తెరిచే నాటికి తప్పనిసరిగా విద్యా కానుక అందించేలా చర్యలు తీసుకోవాలి. వచ్చే విద్యా సంవత్సరంలో ఏడో తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్‌ మాధ్యమంలో బోధన సాగించడంపై దృష్టి పెట్టాలి.
– ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ కార్యదర్శి వై శ్రీలక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ వి.చినవీరభద్రుడు, సర్వశిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కె. వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

విద్యా సంస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం. నాడు – నేడు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఇంగ్లిష్‌ మాధ్యమం ద్వారా నాణ్యమైన బోధనను అందుబాటులోకి తీసుకు వచ్చాం. ఎవ్వరూ చేయలేని రీతిలో విద్యార్థుల పోషకాహారం కోసం ‘గోరుముద్ద’ను అమలు చేస్తున్నాం. 

ఇలాంటి సమయంలో టాయిలెట్ల నిర్వహణ చాలా ముఖ్యం. ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.  శానిటరీ, ప్లంబింగ్‌కు సంబంధించి ఎప్పుడు మరమ్మతులు వచ్చినా, వాటిని వెంటనే బాగు చేసేలా చర్యలు తీసుకోవాలి. వీటన్నింటిపై ఎస్‌ఓపీలను తయారు చేయాలి. 

మరిన్ని వార్తలు