Kuppam: రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పాలన

22 Sep, 2022 18:40 IST|Sakshi

గత ప్రభుత్వ హయాంకు మించి నిధులు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం

నెరవేరిన మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్‌ కల

చీకటి జీవితాల్లో ఇప్పుడిప్పుడే వెలుగులు 

కులం లేదు.. మతం లేదు.. పార్టీలతో సంబంధం లేదు.. అర్హులైతే చాలు, పథకం తలుపు తడుతోంది. గతంలో జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి విసిగిపోయిన ప్రజలకు.. ఇళ్ల మధ్యనున్న సచివాలయం సాదర స్వాగతం పలుకుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ‘నవ’రత్న పథకాలతో ప్రతి కుటుంబం వేల నుంచి లక్షల రూపాయల లబ్ధి పొందుతోంది. ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ ఇంటి వద్దకే వస్తున్న వలంటీర్లు.. లోటుపాట్లు తెలుసుకునేందుకు ‘గడప గడప’కు వెళ్తున్న నేతలు.. సంక్షేమ పాలనలో ఊరూవాడా అభివృద్ధి పథంలో అడుగులు వేస్తోంది. 


చిత్తూరు కలెక్టరేట్‌/కుప్పం:
సంక్షేమ పాలనకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొత్త అర్థం చెబుతోంది. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా ప్రతి ఇంట్లో ఆనందం నింపుతోంది. నాయకులు, అధికారుల చుట్టూ తిరిగే పని లేకుండా అర్హులైన వారందరికీ ఇళ్ల వద్దకే ప్రభుత్వ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కింది. ఈ విషయంలో ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం అయినా సరే.. సీఎం సొంత నియోజకవర్గానికి ఏమాత్రం తీసిపోకుండా పాలనలో పారదర్శకత కనిపిస్తుంది. కుప్పం వాసుల చిరకాల కోరికలైన మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటుతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తాము ప్రజల పక్షమని నిరూపించింది. 


చంద్రబాబు తన నియోజకవర్గంలో సర్కారు బడులను మూసివేసి ఓ కార్పొరేట్‌ పాఠశాలకు అనుమతిచ్చి విద్యను వ్యాపారం చేశారు. ప్రస్తుతం అదే నియోజకవర్గంలో సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నాడు–నేడు మొదటి దశలో 121 సర్కారు పాఠశాలల రూపురేఖల మార్పునకు రూ. 31.23 కోట్లు, రెండవ దశలో 267 పాఠశాలలకు రూ.101.48 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఇళ్లు లేని పేదలకు టీడీపీ పాలనలో 3,800 మందికి పట్టాలు ఇవ్వగా.. 4,691 మందికి ఇళ్లు నిర్మించి చేతులు దులుపుకున్నారు.


వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం కుప్పం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 15,908 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పక్కా గృహాలను నిర్మిస్తోంది. కుప్పం ప్రజలను చంద్రబాబు తన రాజకీయ లబ్ధికి వాడుకోగా.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చీకటి జీవితాల్లో వెలుగులు నింపుతూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి మారుపేరుగా తీర్చిదిద్దుతుండడం గమనార్హం. 


కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చెందిన ఈమె పేరు అమ్ములు. భర్త మంజునాథ్‌ వ్యవసాయ కూలీ. టీడీపీ కార్యకర్త. వీరికి ఇద్దరు పిల్లలు హృతిక్‌(4), దివ్య(3). కరోనా నేపథ్యంలో ఉపాధి లేక ఉన్న ఒక్క ఆవు ఇచ్చే పాలను అమ్ముకుని జీవించేవారు. టీడీపీ పాలనలో ఈ కుటుంబానికి ఎలాంటి లబ్ధి కలగలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆ కుటుంబం వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం ద్వారా రూ.18,400, వెలుగులో రూ.50 వేల రుణం పొందింది. ప్రభుత్వ పథకాల సహాయంతో రామకుప్పం మండలంలో మురుకుల తయారీ కేంద్రం ప్రారంభించారు. ప్రస్తుతం వ్యాపారం సజావుగా సాగుతుండంతో నెలకు అన్ని ఖర్చులు పోను రూ.8 వేల నుంచి రూ.10 వేల ఆదాయం వస్తోంది. వీరి జీవనం సాఫీగా సాగుతోంది. 


కుప్పం పట్టణంలోని పాత పోస్టాపీసు వీధికి చెందిన ఈమె పేరు ధనలక్ష్మీ. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. భర్త మురుగన్‌ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ప్రియదర్శిని, భూమిక. వీరిని చదివించేందుకు ఆమె ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏటా అమ్మ ఒడి ఇస్తుండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలను చదివిస్తోంది. 


రామకుప్పం మండలం విజలాపునికి చెందిన సాగరాభి(65) కుటుంబంలో ఆరుగురు ఉన్నారు. సాగరాభి వృద్ధాప్యం, హనీష్‌(45) దివ్యాంగుడు కావడంతో నిత్యం నరకమే. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కూలీలుగా మారారు. వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం వచ్చాక, సాగరాబీకి  రూ.2,500, దివ్యాంగుడు హనీష్‌కు రూ.3వేల పింఛను ప్రతి నెలా వస్తోంది. ఈ మూడేళ్లలో ఆ కుటుంబానికి రూ.1.92 లక్షలు అందింది.  


గుడుపల్లె మండలం సంగనపల్లెకు చెందిన ఈయన పేరు నారాయణప్ప. 2.5 ఎకరాల  పొలం ఉంది. అటవీ సరిహద్దు పొలాలు కావడంతో వ్యవసాయం చాలా కష్టం. విత్తనాల కొనుగోలుకు, ఎరువులు.. పెట్టుబడికి ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అలాంటి సమయంలో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ఆయన్ను ఆదుకుంది. మూడేళ్లలో ప్రభుత్వం రూ.41 వేలు ఆయన ఖాతాలో జమచేయడంతో సాగు సాఫీగా సాగుతోంది. 


కుప్పం మండలం జరుగు పంచాయతీ పోరకుంట్లపల్లెకు  చెందిన మళ్లికమ్మ, భర్త గోవిందప్ప టీడీపీలో క్రియాశీల కార్యకర్తలు. వీరికి ఉండడానికి ఇల్లు లేదు. గత ప్రభుత్వంలో పక్కా గృహం కోసం అధికారులు, నాయకుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వలంటీర్‌ స్వయంగా ఇంటి పట్టాను తెచ్చివ్వడంతో ఆ దంపతుల కళ్లలో ఆనందం వ్యక్తమైంది. ప్రస్తుతం ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకొని జగనన్న కాలనీలోనే నిసిస్తుండడం విశేషం. 


గుడుపల్లె మండలం అత్తినత్తం గ్రామానికి చెందిన ఈయన పేరు వెంకటాచలం. సాగునీరు లేక వ్యవసాయం వదిలి బెంగళూరులో కూలీ పనులకు వెళ్లేవాడు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక బిసానత్తం వద్ద ఉన్న కల్లివంక కాలువ పనులు పూర్తి కావడంతో ఈ ప్రాంతంలోని పొలాలు సస్యశ్యామలయ్యాయి. ఈ నేపథ్యంలో వెంకటాచలం తిరిగి తమ గ్రామానికి చేరుకొని వ్యవసాయ పనులతో ఉపాధి పొందుతున్నాడు. నీటి చెరువుల అనుసంధానంతో కుప్పం రైతుల సమస్యకు పరిష్కారం లభించింది. 

మరిన్ని వార్తలు