కళ్యాణం కమనీయం.. అక్టోబర్‌ 1 నుంచి వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా

11 Sep, 2022 04:00 IST|Sakshi

ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికులు, ముస్లిం మైనారిటీ పేద అమ్మాయిల వివాహాలకు ఆర్థికంగా అండ 

జీవో జారీతో మేనిఫెస్టోలో మరో కీలక హామీని అమల్లోకి తెచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌

ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలుతో సరికొత్త రికార్డు

గత ప్రభుత్వంలో పథకం ఉన్నా కాగితాలకే పరిమితం

17,909 జంటలకు చంద్రబాబు సర్కారు పెళ్లి కానుక డబ్బులు రూ.68.68 కోట్లు ఎగనామం 

ఇప్పుడు అర్హులైన వారందరికీ వర్తించేలా వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా 

గత ప్రభుత్వంలో ప్రకటించిన దానికంటే అధికంగా నగదు

సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మరో కీలక హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమల్లోకి తీసుకువచ్చారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫాను అమలు చేసేలా సమగ్ర మార్గదర్శకాలతో కూడిన జీవోను సాంఘిక సంక్షేమ శాఖ శనివారం  జారీ చేసింది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగుల, భవన నిర్మాణ కార్మికుల పేద అమ్మాయిల వివాహాలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, ముస్లిం మైనారిటీ పేద అమ్మాయిల పెళ్లిళ్లకు వైఎస్సార్‌ షాదీ తోఫా అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీంతో సీఎం జగన్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేసినట్లయ్యింది. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా అత్యంత పవిత్రంగా భావిస్తామని చెప్పడమే కాకుండా ఇచ్చిన మాట మేరకు ఆచరణలో అమలు చేసి చూపించారు.

దేశ రాజకీయాల్లో మేనిఫెస్టోకు విశ్వసనీయత అంటే ఇలా ఉండాలని చాటి చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేవలం కొన్ని వర్గాలకే ప్రకటించి అమలు చేయకుండా కాగితాలకే పరిమితం అయిన పెళ్లి కానుకను ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అర్హులైన వారందరికీ వర్తించేలా వైఎస్సార్‌ కళ్యాణ మస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకాలను అమలోకి తెచ్చింది. పేద వర్గాల అమ్మాయిల పెళ్లిళ్లకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. గత చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన దాని కన్నా ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికంగా వివాహ నగదు బహుమతిని ఇస్తోంది.  

గత సర్కారు బీసీలకు మొండిచేయి
► గత ప్రభుత్వంలో పెళ్లి కానుక అన్ని వర్గాలకు వర్తింప చేయలేదు. 2017లో బీసీలను పథకంలో చేర్చినప్పటికీ వారికి పెళ్లి కానుక డబ్బులివ్వకుండా గత ప్రభుత్వం మొండిచేయి చూపించింది. 2018–19 నాటికి 17,909 జంటలకు చంద్రబాబు సర్కారు పెళ్లి కానుక డబ్బులు రూ.68.68 కోట్లను ఎగనామం పెట్టింది.
► గత ప్రభుత్వంలో పెళ్లి కానుక మార్గదర్శకాలు కూడా సమగ్రంగా లేవు. లబ్ధిదారులకు ఇవ్వాలనే కోణంలో కాకుండా ఎలా ఎగనామం పెట్టాలనే కోణంలోనే నియమ నిబంధనలను రూపొందించింది. అయితే ఇప్పుడు వాటిన్నింటికీ మార్పులు చేసిన వైఎస్‌ జగన్‌ సర్కారు.. అర్హులైన వారందరికీ వర్తించేలా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. 

అర్హతలు, విధి విధానాలు ఇలా..
► వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫాను అక్టోబర్‌ 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అమలు చేస్తారు. ఆ రోజు నుంచి నవశకం లబ్ధిదారుల మేనేజ్‌మెంట్‌ పోర్టల్‌ ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను అహ్వానిస్తారు.
► వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి. తొలి వివాహానికి మాత్రమే అర్హత. 
► వధువు, వరుడు పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. (ఈ షరతుకు 2024 జూన్‌ 30 వరకు సడలింపు ఇస్తారు)
► వరుడు, వధువు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పది వేల రూపాయల్లోపు, పట్టణ ప్రాంతాల్లో 12 వేల రూపాయల్లోపు ఉండాలి.
► మూడు ఎకరాలకు మించి మాగాణి, లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదు. మెట్ట, మాగాణి రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉండొచ్చు.
► కుటుంబాల్లో సభ్యులెవ్వరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోగానీ, ప్రభుత్వ సంస్థల్లో గానీ, ప్రభుత్వ ఉద్యోగిగా, పెన్షర్‌గా ఉండకూడదు. అయితే పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంది. 
► నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు)
► నెలవారీ విద్యుత్‌ వినియోగం (గత 12 నెలల సగటు) 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి.
► ఏ కుటుంబమూ ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు. 
► మునిసిపల్‌ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మించిన ఆస్తిని కలిగి ఉండకూడదు. 
► ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకం నిర్వహణ ఉంటుంది.   

మరిన్ని వార్తలు