క్యాన్సర్‌కు అత్యుత్తమ వైద్యం

8 Mar, 2022 04:18 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని క్యాన్సర్‌ బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలందించేలా ప్రభుత్వాస్ప త్రులను బలోపేతం చేయడంపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. క్యాన్సర్‌ చికిత్స కోసం బాధితులు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా.. ఏపీలోనే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించనున్నట్టు సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే ప్రకటించారు.

ఈ క్రమంలో ప్రస్తుతమున్న బోధనాస్పత్రుల్లోని క్యాన్సర్‌ విభాగాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసే క్యాన్సర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనిని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తోంది.  వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం కింద ఇప్పటివరకు అత్యధిక మంది క్యాన్సర్‌ బాధితులు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం తీసుకుంటున్నట్టు ప్రత్యేక బృందం పరిశీలనలో వెల్లడైంది.

క్యాన్సర్‌ చికిత్సలో కీలకమైన లీనియర్‌ యాక్సిలరేటర్‌ పరికరం గుంటూరు జీజీహెచ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అందుబాటులోకి రావడం గమనార్హం. ప్రభుత్వాస్పత్రుల్లో అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడం, ఇతర కారణాల వల్ల రోగులు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని ప్రత్యేక బృందం గుర్తించింది.  

మరిన్ని వార్తలు