ధాన్యం రైతుకు దన్ను

2 Oct, 2022 18:37 IST|Sakshi

మద్దతు ధరతో వరి ధాన్యం సేకరణ 

అనంతపురం అర్బన్‌: రైతు సంక్షేమానికి జగన్‌ సర్కార్‌ అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. జిల్లాలో వరి ధాన్యం సేకరణ చేపట్టి రైతుకు దన్నుగా నిలిచేందుకు శ్రీకారం చుట్టింది.   ఇందుకు అనుగుణంగా జాయింట్‌ కలెక్టర్‌    చైర్మన్‌గా జిల్లా సేకరణ కమిటీ (డిస్ట్రిక్ట్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీ–డీపీసీ) ఏర్పాటైంది. వ్యవసాయ శాఖ జేడీ, మార్కెటింగ్‌ శాఖ ఏడీ, డీసీఎంఎస్‌ అధికారి, జిల్లా కో–ఆపరేటివ్‌ అధికారి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, జిల్లా సరఫరాల అధికారి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటికే ఒక దఫా సమావేశమై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంది. 

5 వేల టన్నుల సేకరణ లక్ష్యం 
జిల్లాలో కణేకల్లు, బొమ్మనహాళ్, డీ హీరేహాళ్‌ ప్రాంతాల్లో ఐదు వేల టన్నుల వరి ధాన్యం సేకరించాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మొదటి రకం క్వింటాలు రూ.2,060, రెండో రకం రూ.2,040తో రైతుల నుంచి ధాన్యం సేకరిస్తారు. ఈ మూడు మండలాల పరిధిలోని 3 పీఏసీఎస్‌లు, 37 ఆర్‌బీకేల సహకారంతో డిసెంబర్‌ నుంచి సేకరణ చేపట్టనున్నారు. జిల్లాలో సార్టెక్స్‌ మిల్లులు లేని కారణంగా ఇక్కడ సేకరించిన ధాన్యాన్ని చిత్తూరు, తిరుపతి మిల్లులకు     పంపించనున్నారు. 

నాణ్యత పరిశీలనకు సహకారం 
ధాన్యం నాణ్యత పరిశీలనకు సాంకేతిక సహాయకుల సహకారం తీసుకోనున్నారు. పీఏసీఎస్‌లోని సభ్యులు ఎవరైనా బీఎస్సీ, అగ్రికల్చర్‌ బీఎస్సీ చేసిన వారు ఉంటే వారిని సాంకేతిక సహాయకులుగా నియమించుకుంటారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం ఒక బ్యాచ్‌కు కణేకల్లులో మొదటి విడత శిక్షణ    ఇస్తున్నారు. ఇక సేకరణ ప్రక్రియలో వలంటీర్లను భాగస్వాముల్ని చేయనున్నారు.

రైతు ఖాతాలోకి నగదు జమ 
ధాన్యం సేకరణకు సంబంధించిన నగదు నేరుగా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తుంది. రైతు పట్టాదారు పాసుపుస్తకం, ఫోన్‌ నంబర్‌తో పాటు ఆధార్‌ అనుసంధానమైన బ్యాంక్‌ ఖాతా వివరాలు తీసుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఆ వెంటనే సంబంధిత రైతు ఎఫ్‌టీఓ (ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌) క్రియేట్‌ అవుతుంది. మిల్లరు ధాన్యం తీసుకున్న వెంటనే   ఆన్‌లైన్‌లో నమోదవుతుంది. ఎఫ్‌టీఓ ఆధారంగా రైతు ఖాతాలోకి నగదు జమవుతుంది. 

లక్ష్య నిర్దేశనం 
జిల్లాలో వరి అధికంగా పండించే కణేకల్లు, బొమ్మనహాళ్, డీ.హీరేహాళ్‌ మండలాల్లో ధాన్యం సేకరణ చేపడుతున్నాం. 3 పీఏసీఎస్‌లు, 37 ఆర్‌బీకేల పరిధిలో ఈ ఏడాది 5 వేల టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్దేశించాం. ఇందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేశాం. తొలివిడతగా 1,500 టన్నులు సేకరించాలని చెప్పాం.  ధాన్యానికి సంబంధించి నగదు రైతుల ఖాతాల్లోకి నేరుగా జమవుతుంది. 
– కేతన్‌గార్గ్, జాయింట్‌ కలెక్టర్‌ 

సేకరణ ప్రక్రియ ప్రారంభం 
కార్యాచరణ ప్రకారం ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభించాం. జాయింట్‌ కలెక్టర్‌ నిర్దేశించిన లక్ష్యం 5 వేల టన్నుల ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాం.   పీఏసీఎస్, ఆర్‌బీకేల సహకారం, వలంటీర్ల   భాగస్వామ్యంతో లక్ష్యం పూర్తి చేస్తాం. 
– నీలమయ్య, డీఎం, పౌర సరఫరాల సంస్థ  

మరిన్ని వార్తలు