ఆ కాలనీలు 'కళకళ'

25 Feb, 2021 03:34 IST|Sakshi

వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో రూ.1,215 కోట్లతో మౌలిక వసతులు 

జనాభా ఆధారంగా మౌలిక వసతులు కల్పించేలా ప్రణాళిక     

639 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు.. 771 రైతు భరోసా కేంద్రాలు 

980 గ్రామ, వార్డు సచివాలయాలు.. 3,061 షాపింగ్‌ కాంప్లెక్స్‌లు 

సాక్షి, అమరావతి:  రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ జగనన్న కాలనీలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దేలా వైఎస్‌ జగన్‌ సర్కారు అడుగులు ముందుకు వేస్తోంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అర్హులైన పేదలందరికీ సంతృప్త స్థాయిలో.. 30 లక్షల మందికిపైగా ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వడంతో పాటు వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆయా కాలనీల్లో ఇళ్లు నిర్మించి, చేతులు దులుపుకోకుండా ఆ కాలనీల జనాభా ఆధారంగా సకల సామాజిక మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.1,215.25 కోట్ల వ్యయంతో ప్రణాళిక రూపొందించింది. పేదల కోసం నిర్మిస్తున్న ఈ కాలనీల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, స్కూల్స్, కాలేజీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్, గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, షాపింగ్‌ మాల్స్‌ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అన్ని సౌకర్యాలతో నివాస యోగ్యంగా ఉండేలా కాలనీలను తీర్చిదిద్దాలని, ఈ కాలనీలు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోవాలని సీఎం గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రోడ్‌ మ్యాప్‌ రూపొందించింది. ఇందులో భాగంగా కొత్తగా 980 గ్రామ, వార్డు సచివాలయాలు, 639 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, 771 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, 3,061 షాపింగ్‌ కాంప్లెక్స్‌లు ఏర్పాటు కానున్నాయి.  

ఇళ్ల నిర్మాణంతో సమాంతరంగా సామాజిక వసతులు 
మధ్యతరగతి ప్రజలకు ప్లాట్లలో ఏ విధమైన సామాజిక వసతులు కల్పిస్తారో అందుకు దీటుగా వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలుండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ మేరకు కాలనీల్లో ఇళ్ల నిర్మాణంతో పాటు సమాంతరంగా సామాజిక మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నాం. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు వెళుతున్నాం. కాలనీల్లో పార్కులతో పాటు, స్కూల్స్, డిజిటల్‌ లైబ్రరీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం.     
– అజయ్‌ జైన్, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి   

మరిన్ని వార్తలు