కాలనీల నిర్మాణంలో చెరగని సంతకం

6 Jan, 2021 04:26 IST|Sakshi
తూర్పు గోదావరిజిల్లా తొండంగి మండలం పెరుమాళ్లపురంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల లేఅవుట్‌

ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో నిలిచిపోయేలా కొనసాగుతున్న గొప్ప కార్యక్రమం.. ఇళ్ల పట్టాల పంపిణీ 

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో స్పందన సమీక్షలో సీఎం జగన్‌  

లబ్ధిదారులందరూ ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు 

ఈ నెల 20 వరకు ఈ కార్యక్రమం కొనసాగింపు.. 

ఇప్పటివరకు 9,668 వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాల పంపిణీ.. మౌలిక వసతులపై కలెక్టర్లు దృష్టి సారించాలి 

పాలనలో పారదర్శకతను ఒక స్థాయికి తీసుకువెళ్లాం 

కేసులు పరిష్కారం కాగానే మిగిలిన వారందరికీ ఇళ్ల స్థలాలు

వైఎస్సార్‌ జగనన్న కాలనీల నిర్మాణంలో మన సంతకం కనిపించాలి. మనం పోయిన తర్వాత కూడా ఈ కాలనీలు ఉంటాయి. మన పేర్లు చిర స్థాయిగా నిలిచిపోతాయి. కాలనీల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండాలి. రోడ్లను వినూత్న రీతిలో నిర్మించాలి. ఎలివేషన్‌ బాగుండాలి. వీధి దీపాలు, కరెంటు స్తంభాల ఏర్పాటులో కూడా వినూత్న పద్ధతులను అనుసరించాలి.  

ప్రతి కాలనీ వెలుపల బస్టాప్‌ ఉండాలి. దీనిని అధునాతనంగా తీర్చిదిద్దాలి. కాలనీ ఎంట్రన్స్‌ వినూత్న రీతిలో.. పెద్ద పెద్ద లేఅవుట్స్‌లో ఎలా ఉంటాయో.. అలా ఉండాలి. ఒక పద్ధతి ప్రకారం మంచి మొక్కలు నాటాలి. ఈ కాలనీలను మురికి వాడలుగా మార్చే పరిస్థితి తలెత్తకుండా ఈ విషయాలన్నింటిపై కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలి.    

సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో నిలిచిపోయే గొప్ప కార్యక్రమం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ప్రజలు ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను దీవిస్తున్నారని చెప్పారు. మన సంతకం కనిపించేలా అన్ని సౌకర్యాలతో వైఎస్సార్‌ జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలు, నాణ్యత అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రతి కలెక్టర్‌ పేరు చరిత్రలో నిలిచిపోతుందని, అక్కచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం కనిపిస్తోందని చెప్పారు.

వారందరి దీవెనలు మీకు లభిస్తాయని, తనతో పాటు మీ అందరికీ ఈ సంతోషం ఉంటుందన్నారు. లబ్ధిదారుకి నేరుగా ఇంటి స్థలం పట్టా అందించడమే కాకుండా, ఆ స్థలం ఎక్కడ ఉందో కూడా వెంటనే చూపిస్తున్నామని.. అందుకే ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభ కార్యక్రమాన్ని ఈ నెల 20వరకు పొడిగిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 39 శాతం ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తయిందన్నారు. 17 వేలకు పైగా ఉన్న వైఎస్సార్‌ జగనన్న కాలనీలకు గాను 9,668 కాలనీల్లో ఇళ్లస్థలాల పంపిణీ జరిగిందని, మిగిలిన వాటికి కూడా ఆయా లేఅవుట్లలోనే ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పారు. పెండింగ్‌ కేసులు వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..  
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు 

పారదర్శకంగా ప్రక్రియ  
పాలనలో పారదర్శకతను ఒకస్థాయికి తీసుకెళ్లాం. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇంటి పట్టా ఇస్తామని చెప్పాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ఈ విషయం కనిపించేలా బోర్డు పెట్టాం. రేషన్‌ కార్డు 10 రోజుల్లో, పెన్షన్‌ కార్డు 10 రోజుల్లో, ఆరోగ్యశ్రీ 20 రోజుల్లో, ఇంటి స్థలం పట్టా 90 రోజుల్లో ఇస్తామని చెప్పాం. కలెక్టర్లు నిరీ్ణత సమయంలోగా దరఖాస్తులను పరిశీలించి, అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలి. మనం సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేస్తున్నాం. అర్హులందరికీ తప్పకుండా ఇంటి పట్టా రావాలి. దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి నిబంధనలను చూసుకుంటూ నిర్ణీత కాలంలోగా పట్టా ఇవ్వాలి.  

లే అవుట్లు – మౌలిక వసతులు  
లే అవుట్లలో ఇంటి నిర్మాణాలు కొనసాగించడం ఒక కార్యక్రమమైతే, మౌలిక సదుపాయాలు కల్పించడం మరో కార్యక్రమం. రోడ్లు, విద్యుత్, తాగునీరు లాంటి కనీస సదుపాయాలు కల్పించాలి. కాలనీ పరిమాణం బట్టి ఇతర సామాజిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. స్కూళ్లు, అంగన్‌వాడీలు, పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్‌ లాంటివి రావాలి. కాలనీ పరిమాణం, జనాభాను బట్టి వీటిని ఏర్పాటు  చేయాలి. దీనికి సంబంధించి ఎస్‌వోపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) తయారు చేయాలి. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేసరికి మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలి. ఒక లే అవుట్‌లో పనులు ప్రారంభించాక అవన్నీ పూర్తి కావాలి. కాలనీలో పనులు మొదలుపెట్టిన తర్వాత అందులో అన్ని ఇళ్లనూ పూర్తి చేయాలి. ఒకవేళ అదనంగా ఇళ్లు మంజూరు చేయాల్సి వస్తే.. వెంటనే ప్రణాళిక రూపొందించుకుని నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుందాం. 

కలెక్టర్లు సవాల్‌గా తీసుకోవాలి  
భవిష్యత్‌ తరాలు మన పేర్లను గుర్తుంచుకునేలా కాలనీల నిర్మాణం జరగాలి. డిజైన్లు, ఇతరత్రా అంశాలపై ఇప్పటికే కొన్ని సూచనలు చేశాను. కలెక్టర్లు దీన్ని సవాల్‌గా తీసుకోవాలి. మీ సమర్థతను చూపించుకునే అవకాశం ఇది. కాస్త ధ్యాస పెట్టగలిగితే మంచి కాలనీలు వస్తాయి.  అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వంటి వ్యవస్థలను కల్పించడంపై ఇప్పుడే దృష్టి పెట్టాలి. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారుల ఆప్షన్‌ వెంటనే తీసుకోవాలి. ఆప్షన్లు తీసుకునే కార్యక్రమం 20 నాటికి పూర్తి కావాలి. 

ఏకకాలంలో మ్యాపింగ్, జియో ట్యాగింగ్‌  
ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ (నేషనల్‌ రూరల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌ స్కీమ్‌–జాతీయ ఉపాధి హామీ పథకం)కింద లబ్ధిదారులకు జాబ్‌ కార్డులిచ్చి, వారి పేరుతో బ్యాంక్‌ అకౌంట్లు ప్రారంభించాలి. పేమెంట్ల విడుదలకు ఏపీ హౌసింగ్‌ వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలి.  ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మ్యాపింగ్, జియోట్యాగింగ్‌ ఒకేసారి సమాంతరంగా పూర్తి చేయాలి.  

నీరు, విద్యుత్‌ ముఖ్యం  
నీటి సరఫరా, విద్యుత్‌ చాలా ముఖ్యమైన అంశాలు. వీటికి మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కలెక్టర్లు క్రమం తప్పకుండా సమీక్షలు చేయాలి. కాలనీల్లో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలపై డీపీఆర్‌లు తయారు చేయాలి. చాలా పెద్ద పెద్ద కాలనీలున్నాయి. కొన్నిచోట్ల నగర పంచాయతీలు చేస్తున్నాం. మురుగు నీటిని శుద్ధిచేసే ప్లాంట్ల కోసం కూడా డీపీఆర్‌లు తయారు చేయాలి. ప్రతి కాలనీలో ఒక మోడల్‌ హౌస్‌ను కట్టండి. 

నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం  
ఇళ్ల నిర్మాణంలో వినియోగించే మెటీరియల్‌ నాణ్యత చాలా ముఖ్యం. పేద వాళ్ల నుంచి ఎవరైనా అవినీతికి పాల్పడితే అది క్షమించరాని నేరం. అవినీతి జరిగితే పేదవాళ్ల ఉసురు తగులుతుంది. ప్రతి అధికారికీ కలెక్టర్లు ఈ విషయం తెలియజేయాలి. మనం చేసిన పనుల ద్వారా మనకు సంతృప్తి మిగలాలి. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ఇంట్లో విద్యుత్‌ సరఫరా కోసం వాడే వైరు, ప్రతి వస్తువు నాణ్యతతో ఉండాలి. ఇళ్ల నిర్మాణం జరుగుతున్న కాలనీ వరకు ఇసుక, ఇతర వస్తువుల సరఫరా జరిగేలా చూడాలి. మెటీరియల్‌కు సంబంధించి 20వ తేదీ నాటికి టెండర్లు పూర్తి చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. 

పంపిణీ ఆగిన చోట లబ్ధిదారులకు లేఖలు రాయండి  
‘గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని, వలంటీర్ల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. వారికి మంచి శిక్షణ ఇవ్వండి. వీరి సేవలను వినియోగించుకోవడంపై ఎస్‌వోపీ తయారు చేయండి. డిజిటల్‌ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల సేవలనూ వినియోగించుకోవాలి.  కోర్టు కేసుల వల్ల స్థలాల పంపిణీ ఆగిపోయిన ప్రాంతాల్లో లబి్ధదారుల మనసులో అలజడి ఉంటుంది. వారికి భరోసా కల్పించేలా లేఖలు ఇవ్వాలి. కేసులు పరిష్కారం కాగానే వారికి వెంటనే ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పాలి’ అని సీఎం అన్నారు. సమీక్షలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు నీలంసాహ్ని పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు