బీమా పూర్తి ఖర్చు బాధ్యత ప్రభుత్వానిదే: సీఎం జగన్‌

1 Jul, 2021 11:27 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: నూతన మార్గదర్శకాలతో కూడిన 'వైఎస్ఆర్‌ బీమా' పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో వర్చువల్‌గా ప్రారంభించారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ వర్తించే ఈ పథకం కింద కుటుంబ పోషకులు సహజ మరణం పొందినా, ప్రమాదవశాత్తు చనిపోయినా పరిహారం అందేలా వైఎస్సార్‌ బీమా పథకానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని, రూ.5లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారిని ఆరోగ్యశ్రీలో చేర్చామని తెలిపారు. వేయికి పైగా రోగాలను గుర్తించి ఆరోగ్యశ్రీలో చేర్చామని, కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా అమలు చేస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

బ్యాంకులతో సంబంధం లేకుండా 'వైఎస్ఆర్‌ బీమా' అమలు చేస్తామని, 155214 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా 'వైఎస్ఆర్‌ బీమా'పై సందేహాలు నివృత్తి చేసుకోవాలని సీఎం జగన్‌ తెలిపారు. 18 నుంచి 50 ఏళ్ల వ్యక్తి సహజ మృతికి రూ.లక్ష సాయం,18 - 70 ఏళ్ల వ్యక్తి ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యానికి రూ.5లక్షల బీమా అందిస్తామన్నారు. పేద కుటుంబాలపై భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. 

ఈ పథకం నుంచి 2020 ఏప్రిల్ నుంచి కేంద్రం తప్పుకుందని, పేదలకు మేలు చేయాలని మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. బీమా చెల్లింపునకు అయ్యే పూర్తి ఖర్చు బాధ్యత ప్రభుత్వానిదేనని, 2021-22 ఏడాదికి 1.32కోట్ల పేద కుటుంబాలకు రూ.750 కోట్లతో బీమా కల్పిస్తామని తెలిపారు. ఇప్పటివరకు రెండెళ్లలో మొత్తం రూ.1,307 కోట్ల మేర బీమా రక్షణ అమలులో ఉందని తెలిపారు. బ్యాంకులతో సంబంధం లేకుండా 'వైఎస్ఆర్‌ బీమా' అమలు చేస్తామని,155214 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా 'వైఎస్ఆర్‌ బీమా'పై సందేహాల నివృత్తి చేస్తామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలకు పూర్తి బాధ్యతలు అప్పగించామని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. 
చదవండి: Andhra Pradesh: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు
‘జగనన్న కాలనీలు’ సీఎం జగన్ మానసపుత్రికలు: మంత్రి పెద్దిరెడ్డి

మరిన్ని వార్తలు