సీఎం జగన్‌ మరో చరిత్రాత్మక నిర్ణయం

6 May, 2021 03:27 IST|Sakshi

అసైన్డ్‌ భూములంటే అత్తగారి సొమ్ము కాదు..

భూ సేకరణతో ఎస్సీ, ఎస్టీలు నష్టపోకుండా పక్కాగా చర్యలు

రైత్వారీ పట్టా భూముల కంటే 10 శాతం అదనంగా పరిహారం

రాజధాని పేరుతో దగా చేసి బడుగుల భూములు గుంజుకున్న టీడీపీ సర్కారు 

ఇటువంటి అరాచకాలకు అడ్డుకట్ట వేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఇకపై 10 శాతం అదనంగా పరిహారం ఇవ్వాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి జగన్‌ 

సాక్షి, అమరావతి: బడుగులకు బాసటగా నిలుస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడైనా తప్పనిసరిగా భూ సేకరణ చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైతే ఇకపై ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్‌ భూములకు రైత్వారీ పట్టా భూముల కంటే 10 శాతం అదనంగా పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. ఈమేరకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదించడం ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచారు.  అసైన్డ్‌ భూములంటే పప్పు బెల్లాలు ఇచ్చి గుంజుకోవడం తమ హక్కుగా వ్యవహరించిన గత పాలకులకు భిన్నంగా పేదలకు భరోసా కల్పిస్తూ కొత్త ఒరవడి సృష్టించారు. 

జాతీయ చట్టం కంటే అధికంగా...
జాతీయ భూ సేకరణ చట్టం–2013లో పేర్కొన్న దానికంటే అధికంగా పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైత్వారీ భూములతో సమానంగా ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములకు పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం 2013లో తెచ్చిన జాతీయ భూసేకరణ చట్టం నిర్దేశిస్తోంది. అయితే ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములకు రైత్వారీ పట్టాల కంటే 10 శాతం అధికంగా పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించడం విశేషం. 

వైఎస్సార్‌ స్ఫూర్తితో..
ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములకు కూడా పట్టా భూములతో సమానంగా పరిహారం ఇవ్వాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2007లో నిర్ణయించారు. ఆ విధానాన్నే స్ఫూర్తిగా తీసుకుని 2013లో కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ భూసేకరణ చట్టం’ చేసింది. తాజాగా ముఖ్యమంత్రి జగన్‌ దేశంలోనే తొలిసారిగా రైత్వారీ భూముల కంటే అసైన్డ్‌ భూములకు 10 శాతం అదనంగా పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. 

ఎస్సీ, ఎస్టీలను దగా చేసిన చంద్రబాబు 
ఎస్సీ, ఎస్టీలను మోసగించడంలో చంద్రబాబు సర్కారు సరికొత్త విధానాలను అనుసరించింది. ఉమ్మడి రాష్ట్రంలో 1995–2004 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములకు అతి తక్కువ పరిహారం ఇచ్చి వేలాది ఎకరాలు గుంజుకున్నారు. 2014లో మళ్లీ సీఎం అయ్యాక మరో ఎత్తుగడ వేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములకు కూడా పట్టా భూములతో సమానంగా పరిహారం ఇవ్వాల్సి ఉండగా అందుకు సమ్మతించని చంద్రబాబు రాజధాని అమరావతి కోసం భూ సమీకరణ విధానం అమలు చేశారు. ల్యాండ్‌ పూలింగ్‌ విధానానికి జాతీయ భూ సేకరణ చట్టం వర్తించదని వక్ర భాష్యం చెబుతూ ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములకు అతి తక్కువ ప్రతిఫలం ఇచ్చారు.
 
పూలింగ్‌ పేరుతో ఎస్సీ, ఎస్టీలను మోసగించారిలా
► రైత్వారీ పట్టాలున్న మెట్ట భూములకు ఎకరాకు వెయ్యి గజాల అభివృద్ధి చేసిన నివాస స్థలంతోపాటు 250 గజాల వాణిజ్య స్థలం ప్రకటించారు. 
► రైత్వారీ పట్టాలున్న జరీబు భూములకు ఎకరాకు వెయ్యి గజాల నివాస స్థలంతోపాటు 450 గజాల వాణిజ్య స్థలం ఇస్తామన్నారు. 
► కానీ ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములకు మాత్రం మెట్టకు ఎకరాకు కేవలం 800 గజాల అభివృద్ధి చేసిన నివాస స్థలం, 100 గజాల వాణిజ్య స్థలాన్ని మాత్రమే ప్రకటించారు. జరీబు భూమికి ఎకరాకు 800  గజాల అభివృద్ధి చేసిన నివాస స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం ఇస్తామన్నారు. రైత్వారీ పట్టాల కంటే ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములకు తక్కువ పరిహారం ఇచ్చి మోసం చేశారు. ఆ విధంగా ఎస్సీ, ఎస్టీల నుంచి దాదాపు 5 వేల ఎకరాలను తీసుకున్నారు. 

అసైన్డ్‌ భూములు అక్రమంగా టీడీపీ నేతల పరం
అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన విషయాన్ని అధికారికంగా ప్రకటించక ముందే అప్పటి సీఎం చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులకు ఉప్పందించారు. దీంతో దళితులను భయపెట్టి వారి నుంచి అసైన్డ్‌ భూములను టీడీపీ నేతలు కారుచౌకగా కొనుగోలు చేశారు. నిబంధనల ప్రకారం ఆ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలి. భూ సమీకరణ కింద అసైన్డ్‌ రికార్డుల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీలకే పరిహారం చెల్లించాలి. అయితే చంద్రబాబు సర్కారు ఆ అక్రమ కొనుగోళ్లను గుర్తిస్తూ జీవో 41 జారీ చేసింది. దీంతో ఎస్సీ, ఎస్టీలు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆ జీవోను రద్దు చేశారు. 

బడుగుల పక్షపాతి సీఎం జగన్‌
– కల్లూరి చెంగయ్య, ఐక్య దళిత మహానాడు జాతీయ అధ్యక్షుడు
‘బడుగులు, పేదల పక్షపాతినని ముఖ్యమంత్రి జగన్‌ మరోసారి నిరూపించుకున్నారు. అసైన్డ్‌ భూములకు 10 శాతం అదనపు పరిహారం చెల్లించాలన్న నిర్ణయం దేశానికే ఆదర్శప్రాయం’

చరిత్రాత్మక నిర్ణయం..
– జలుమూరు అమర్‌నాథ్,  ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర రెల్లి హక్కుల పోరాట సమితి
‘ఎస్సీలు, ఎస్టీలు, పేదల సంక్షేమం కోసం వైఎస్సార్‌ రెండు అడుగులు వేస్తే తాను నాలుగు అడుగులు వేస్తానని ఇచ్చిన మాటను సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారు. నామమాత్రపు పరిహారంతో టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములను గుంజుకుంది. సీఎం జగన్‌ దళితులు, గిరిజనులకు అండగా నిలుస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు’

చంద్రబాబు దగా చేశారు...
– పులి ప్రభుదాస్, అసైన్డ్‌ రైతు, వెంకటపాలెం, అమరావతి
‘రాజధాని భూ సమీకరణ పేరుతో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీలను దగా చేశారు. 1977 అసైన్డ్‌ చట్టానికి విరుద్ధంగా టీడీపీ నేతలు కొనుగోలు చేసిన భూములను గుర్తిస్తూ అధికారంలో ఉండగా ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములకు రక్షణ కల్పించారు. భూ సేకరణ కింద తీసుకోవాల్సి వస్తే రైత్వారీ పట్టా భూముల కంటే 10 శాతం అదనంగా పరిహారాన్ని ప్రకటించడం సంతోషాన్ని కలిగిస్తోంది’  

చదవండి: ఇళ్ల నిర్మాణంతో ఎకానమీకి బూస్ట్‌..

మరిన్ని వార్తలు