90 రోజుల్లో పట్టా అందించాలి: సీఎం జగన్‌

27 Jan, 2021 16:07 IST|Sakshi

వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్

డంపింగ్‌ యార్డుల్లో బయో మైనింగ్

సాక్షి, అమరావతి : ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి అర్హుడని తేలితే 90 రోజుల్లోగా ఇంటి స్థలం పట్టా అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఇంటి పట్టా కోసం దరఖాస్తు అందుకున్న తొలి 12 రోజుల్లో వలంటీర్, గ్రామ సచివాలయ సిబ్బంది భౌతికంగా వెరిఫికేషన్‌ పూర్తి చేయాలని తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా 30,06,673 ఇళ్లపట్టాలకు గానూ 26,21,049 పట్టల పంపిణీ జరిగిందని, మిగిలిన వాటిని కూడా రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తంగా 87.17 శాతం పట్టాల పంపిణీ జరగ్గా, కాలనీల్లో 90.28 శాతం పంపిణీ పూర్తైందన్నారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు, పంపిణీ అన్నది నిరంతర కార్యక్రమమని, దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి: సీఎం జగన్‌)

ఈ సమావేశంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
సోషల్‌ ఆడిట్‌ ద్వారా లబ్దిదారులను గుర్తించాలి. 
నిర్మాణాల్లో ఏక రూపత, నాణ్యత కోసం చర్యలు తీసుకోవాలి. 
ఒక కాలనీలో కల్పిస్తున్న సదుపాయాలు, వాటి నిర్మాణ రీతులు తదితర అంశాలపై పూర్తి వివరాలు నివేదించాలి. 
వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్‌ సదుపాయం కూడా కల్పించాలి. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయండి. 
డంపింగ్‌ యార్డుల్లో బయో మైనింగ్‌ చేయాలి. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ మొదలుపెట్టాలి.

పనుల పురోగతి:
వైయస్సార్‌ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. మార్చి 31 నాటికి వాటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వివిధ ప్రభుత్వ శాఖలు అందులో భాగస్వాములవుతాయని అధికారులు తెలిపారు. ఇక సీఎం ఆదేశాల ప్రకారం వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో జనాభాను అనుసరించి అంగన్‌వాడీ కేంద్రాలు, వైఎస్సార్‌ క్లినిక్కులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, బస్టాపులు తదితర నిర్మాణాలపై అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్‌ నీరబ్‌కుమార్ ప్రసాద్‌, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌ జైన్‌, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (చదవండి: ఇళ్ల పట్టాల పంపీణీలో మనమే నంబర్‌1)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు