కట్టుదిట్టంగా ‘దిశ’

14 Aug, 2020 04:48 IST|Sakshi

మరింత సమర్థంగా అమలుకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

కేంద్రం సమన్వయంతో క్రిమినల్‌ లా సవరణలకు ఆమోదం పొందాలి

వేగంగా ప్రత్యేక కోర్టులు,  ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు చర్యలు

సాక్షి, అమరావతి: ‘దిశ’ చట్టాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ క్రిమినల్‌ లా సవరణ బిల్లుకు త్వరగా ఆమోదం లభించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వీలైనంత త్వరగా ప్రత్యేకకోర్టులు, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రయత్నించాలన్నారు. దిశ చట్టం అమలుపై సీఎం జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ...

ప్రత్యేకంగా ప్రాసిక్యూటర్లు...
► మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించి విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ప్రక్రియపై సీఎం ఆరాతీశారు. కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు వీలైనంత త్వరగా ఆమోదం లభించేలా చూడాలని సూచించారు. 

► దిశ చట్టం కింద నమోదైన కేసుల విచారణకు 13 జిల్లాల్లో 11 మంది ప్రాసిక్యూటర్లు, పోక్సో కేసుల విచారణకు 8 మంది ప్రాసిక్యూటర్లను ప్రత్యేకంగా నియమించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. మిగిలిన చోట్ల కూడా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను త్వరగా నియమించాలని సీఎం ఆదేశించారు. 

పోస్టర్లతో చైతన్యం చేయాలి...
► దిశ చట్టం, యాప్, నంబర్లకు సంబంధించిన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలు, సమావేశమయ్యే చోట్ల పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలని సీఎం సూచించారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు కూడా త్వరగా ఏర్పాటు కావాలన్నారు.

► దిశ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తూ ప్రతి నెలా తీసుకోవాల్సిన చర్యల గురించి సమీక్ష చేయాలని సీఎం పేర్కొన్నారు. దిశ యాప్‌ ద్వారా అందే ఫిర్యాదులపై మెరుగైన సేవలు అందించాలన్నారు. 

‘దిశ’ పెట్రోలింగ్‌.. హెల్ప్‌ డెస్క్‌లు
► మహిళల రక్షణ కోసం ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దిశ పెట్రోలింగ్‌ కోసం 900 స్కూటర్లను ప్రభుత్వం త్వరలో సమకూర్చనుంది. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో దిశ మహిళా హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కంప్యూటర్, ఫోన్‌ నంబర్‌ సదుపాయం కల్పిస్తారు. బాధితులకు సైకాలజిస్ట్, స్వచ్ఛంద సంస్థల నుంచి న్యాయ సహాయం కూడా లభిస్తుంది. 

► సైబర్‌ సేఫ్టీ కోసం ఏర్పాటయ్యే కియోస్క్‌ల §ద్వారా ఫోన్, ల్యాప్‌టాప్‌ల భద్రతనుపరీక్షించుకోవచ్చని అధికారులు తెలిపారు.

దిశ యాప్‌ 11 లక్షల డౌన్‌ లోడ్స్
► దిశ యాప్‌ ద్వారా ఇప్పటివరకు 502 కాల్స్, 107 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. దిశ చట్టం కింద ఇప్పటి వరకూ 390 కేసులు నమోదు కాగా 7 రోజుల్లోపు ఛార్జి షీటు దాఖలు చేశారు. 74 కేసుల్లో శిక్షలు ఖరారు అయ్యాయి. 1,130 కేసుల్లో ఛార్జిషీటు దాఖలు కాగా  కేసు నంబర్లు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. దిశ యాప్‌¯ను 11 లక్షలమంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దిశ ఒన్‌ స్టాఫ్‌ సెంటర్లు అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి నుంచి ఆగస్టు వరకూ 2,285 కేసులు ఒన్‌స్టాప్‌ సెంటర్లకు వచ్చాయని వెల్లడించారు. 

వాట్సాప్‌కు భారీగా ఫిర్యాదులు...
► సైబర్‌ మిత్ర ద్వారా 265 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. సామాజిక మాథ్యమాల ద్వారా వేధింపుల నివారణకు ఏర్పాటైన సైబర్‌బుల్లీ వాట్సాప్‌ నంబర్‌కు ఇప్పటివరకు 27 వేల ఫిర్యాదులు వచ్చాయి.తరచూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న 780 మందిపై కేసులు నమోదు చేశారు. 

► సీఎం సమీక్షలో హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, అధికారులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు