వ్యవసాయ, అనుబంధ శాఖలపై సీఎం జగన్‌ సమీక్ష

6 Apr, 2021 19:22 IST|Sakshi

చిన్న, సన్నకారు రైతలుకు మేలు చేసే అంశంపై దృష్టి

అగ్రి ఇన్‌ఫ్రాకు సంబంధించి 14 సదుపాయాలపై చర్చ

సెరికల్చర్‌పై ప్రత్యేక దృష్టి

సాక్షి, అమరావతి: చిన్న, సన్నకారు రైతులకు ఎలా మేలు చేయాలి అన్న దానిపై కార్యచరణ రూపొందించాలని.. మల్బరీ రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం హార్టికల్చర్‌, మైక్రో ఇరిగేషన్, అగ్రి ఇన్‌ఫ్రాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నిర్ణీత కాలంలోగా చిన్న, సన్నకారు రైతులందరికీ కూడా డ్రిప్, స్ప్రింక్లర్‌ సదుపాయాలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలి. దీని వల్ల చిన్న, సన్నకారు రైతులందరికీ డ్రిప్, స్ప్రింక్లర్‌ సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించినట్టు అవుతుంది. చిన్న సన్నకారు రైతులకు ఎలాగూ బోర్లు వేయిస్తున్నాం కాబట్టి, వారికి సూక్ష్మ సేద్యం సదుపాయాలను ఇచ్చినట్లైతే మంచి ఫలితాలు వస్తాయి. ఏం చేసినా శాచ్యురేషన్‌ పద్ధతిలో ఉండాలి. కొందరికి మాత్రమే పథకాలు ఉండకూడదు.. అందరికీ అందాలి. వ్యవస్థలో అవినీతి ఉండకూడదు. చిన్న, సన్నకారు రైతులకు ఎలా మేలు చేయాలన్న దానిపై ఒక కార్యాచరణ ఉండాలి’’అని సీఎం జగన్‌ తెలిపారు. 

రివర్స్‌ టెండరింగ్‌లో సూక్ష్మ సేద్యం సదుపాయాలు
‘‘రాయలసీమ, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో 10 ఎకరాల్లోపు, మిగిలిన చోట్ల 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్‌ సదుపాయాల్లో ప్రాముఖ్యత ఇవ్వాలి. దీనిపై పూర్తిస్థాయిలో ఆలోచనలు చేసి కార్యాచరణ రూపొందించాలి. సూక్ష్మసేద్యం సదుపాయాలను రివర్స్‌టెండరింగ్‌ పద్దతిలో కొనుగోలు చేయడం ద్వారా రేటు తగ్గుతుంది. దీనివల్ల ఎక్కువ మంది రైతులకు సూక్ష్మ సేద్యం సదుపాయాలను అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రాయితీలను పరిగణలోకి తీసుకుని లెక్కిస్తే.. ఎంత రేటులో డ్రిప్, స్ప్రింక్లర్‌ వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయన్నదానిపై ఒక అవగాహన వస్తుంది. సెరికల్చర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రస్తుతం మల్బరీని సాగుచేస్తున్న రైతులకున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. వారి పరిస్థితులను పూర్తిస్థాయిలో మెరుగుపరచాలని’’ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 

అగ్రి ఇన్‌ఫ్రాపై సీఎం సమీక్ష
అగ్రి ఇన్‌ఫ్రాలో భాగంగా ఏర్పాటు చేయనున్న మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా డ్రై స్టోరేజీ, డ్రైయింగ్‌ ఫ్లాట్‌ ఫాం, గోడౌన్లు, హార్టికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రైమరీ ప్రాససింగ్‌ సెంటర్లు, యంత్రపరికరాలు, ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లు, ఇ–మార్కెటింగ్, జనతాబజార్లు, ప్రైమరీ ప్రాససింగ్‌ యూనిట్లు తదితర 14 సదుపాయాల గురించి చర్చించారు. వీటి కోసం 14,562 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్దతులను ప్రమోట్‌ చేయాలి. దీనికి సంబంధించి పరికరాలను ప్రతి కస్టమ్ హైరింగ్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)లో ఉంచాలని’’ సీఎం సూచించారు.

ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవియస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఆర్ధిక శాఖ కార్యదర్శి గుల్జార్, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్‌ కె కన్నబాబు, మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై మధుసూదనరెడ్డి, హార్టికల్చర్‌ కమిషనర్‌ ఎస్‌ఎస్‌ శ్రీధర్‌ ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.

చదవండి: కరోనా కట్టడికి ఐదంచెల వ్యూహం


 

మరిన్ని వార్తలు