ఎవరూ ఆందోళన చెందవద్దు: పేర్ని నాని

7 Dec, 2020 13:18 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి‌: ఏలూరు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్‌. అస్వస్థతకు దారి తీసిన కారణాలు.. ఇప్పటివరకు చేసిన పరీక్షల వివరాలు తెలుసుకున్నారు. ఇక బాధితులందరి రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. బాధితుల్లో అన్ని వయసుల వారు ఉన్నారని.. ఏలూరు అర్బన్‌తో పాటు రూరల్‌, దెందులూరులో కూడా కేసులు గుర్తించామన్నారు. ఇప్పటికే ఎయిమ్స్‌ నుంచి డాక్టర్ల బృందం వచ్చిందని.. ఐఐసీటీ, ఎన్‌ఐఎన్‌, ఐసీఎంఆర్‌ బృందాలు వస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 

డిశ్చార్జ్‌ చేసిన వారు తిరిగి మళ్లీ ఆస్పత్రికి వస్తున్నారా లేదా అని అధికారులను ప్రశ్నించిన ముఖ్యమంత్రి.. వారికి ఆహారం, మందులు అందించాలని.. డిశ్చార్జ్‌ అయిన వారిని కూడా అబ్జర్వేషన్‌లో ఉంచాలని అధికారులకు సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు ఏలూరులో అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రజలకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా 104, 108కి కాల్‌ చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం జగన్‌ ఆదేశాలు ఇచ్చారు. (చదవండి: సర్కారు బాసట.. కోలుకుంటున్నారు)

ఆందోళన చెందవద్దు: పేర్ని నాని
ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ‘డిశ్చార్జ్‌ చేసిన బాధితులను నెలపాటు పర్యవేక్షించాలని.. బాధితులకు మంచి న్యూట్రిషన్‌ ఫుడ్‌ అందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అస్వస్థతకు గల కారణాలపై పరిశోధనకు కేంద్ర బృందాలు వస్తున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిమ్స్ బృందం కూడా రాబోతుంది. బాధితులు ఆందోళన చెందవద్దు’ అని తెలిపారు.

ఈ సందర్భంగా హెల్త్‌ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు 425 కేసులు నమోదు కాగా.. 222 మంది డిశ్చార్జ్ అయ్యారు. మెరుగైన వైద్యం కోసం 16మంది విజయవాడ, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాము. అస్వస్థతకు గురైన వారికి అన్ని వైరల్ టెస్టులు చేశాం. నీటిలో మెటల్ టెస్టులు కూడా చేశాం.. రిపోర్టులు రావాలి. సీఎంబీకి కూడా నమూనాలు పంపామని’ తెలిపారు. 

>
మరిన్ని వార్తలు