అనుకున్న సమయంలోగా లక్ష్యాలను చేరాలి: సీఎం జగన్‌

2 Jun, 2021 15:00 IST|Sakshi

జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకంపై సమీక్ష

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

సచివాలయాల్లోనే అన్ని సర్టిఫికెట్లు లభించేలా చూడాలి: సీఎం జగన్‌

సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘భూసర్వే చురుగ్గా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కోవిడ్‌తో మంద గమనంలో ఉన్న పథకం పరుగులు పెట్టాలి. లక్ష్యాలను అనుకున్న సమయంలోగా చేరాలి. క్రమం తప్పకుండా దీనిపై సమీక్షలు చేయాలి. అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి. పథకాన్ని పూర్తి చేయడానికి అంకిత భావంతో ముందుకెళ్లాలి. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగాలి. పట్టణాల్లో కూడా సమగ్ర సర్వే వెంటనే వేగం చేయండి. అందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలి. సర్వే పూర్తైతే అన్నింటికి క్లియర్‌ టైటిల్స్‌ వస్తాయి. ఎక్కడా భూ వివాదాలకు అవకాశం ఉండదు’’ అన్నారు

అనుకున్నట్లుగా సర్వే జరగాలి..
‘‘మారుమూల ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో సర్వేకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోండి. అక్కడ సిగ్నల్స్‌ సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి. సర్వే పనులకు ఇబ్బంది కలగకుండా కావాల్సిన వాటి కోసం ఆర్డర్‌ చేయండి. సర్వే ఆలస్యంగా కాకుండా చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్‌ 2023 నాటికి రాష్ట్రంలో సమగ్ర భూసర్వే పూర్తి కావాలి’’ అని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

సచివాలయాల్లో సేవలు..
‘‘ప్రజలకు అన్నిరకాల సేవలు అందించేలా గ్రామ, వార్డు సచివాలయాలు తయారు కావాలి. ప్రస్తుతం అందిస్తున్న జనన, మరణ ధృవీకరణ పత్రాల్లానే అన్నిరకాల సర్టిఫికెట్లు వారికి సచివాలయాల్లోనే అందేలా చూడాలి. సిబ్బంది శిక్షణ కార్యక్రమాల మాన్యువల్‌ను డిజిటిల్‌ ఫార్మాట్‌లో పెట్టి.. వారు ఎప్పుడు కావాలంటే.. అప్పుడు డౌన్‌లోడ్‌ చేసుకుని సందేహాలు తీర్చుకునేలా అందుబాటులో ఉంచాలి. యూజర్‌ మాన్యువల్, తరచుగా వచ్చే ప్రశ్నలకు సందేహాలు వారికి అందుబాటులో డిజిటిల్‌ ఫార్మాట్‌లో ఉంచాలి. సచివాలయాల్లోని సిబ్బందికి ఇస్తున్న అన్నిరకాల శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి ఈ ఫార్మాట్‌లో ఉంచాలి. అలాగే ఒక డిజిటిల్‌ లైబ్రరీని అందుబాటులో ఉంచాలి’’ అని సీఎం జగన్‌ సూచించారు. 

కాగా, రాష్ట్రంలో సర్వే పురోగతిపై సమావేశంలో అధికారులు వివరిస్తూ..   ఇప్పటికే 70 బేస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని, అవి పూర్తి కచ్చితత్వంతో పని చేస్తున్నాయని వెల్లడించారు. సర్వే ఆఫ్‌ ఇండియా సహకారంతో మరి కొన్ని గ్రౌండ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని, అదే విధంగా అవసరమైనన్ని డ్రోన్లను రంగంలోకి దించుతామని అధికారులు వివరించారు.  సర్వేలో పైలట్‌ ప్రాజెక్టు ఇప్పటికే దాదాపు పూర్తి కాగా, తొలి దశలో 4,800 గ్రామాల్లో సర్వే చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఆ గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబరు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు రికార్డుల ప్యూరిఫికేషన్‌ పూర్తి చేసి, ముసాయిదా ముద్రిస్తామని చెప్పారు.

పట్టణాల్లోనూ (యూఎల్‌బీ) సర్వే
కాగా, పట్టణాలు, నగరాల్లో కూడా సర్వేకు సంబంధించి ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో సర్వే మొదలు పెట్టామని మున్సిపల్‌ అధికారులు వెల్లడించారు. మిగిలిన పట్టణాలు, నగరాలకు సంబంధించి..
ఫేజ్‌ –1. జూన్‌ 2021లో ప్రారంభమై జనవరి 2022 కల్లా 41 పట్టణాలు, నగరాల్లో.
ఫేజ్‌ –2. ఫిబ్రవరి 2022లో ప్రారంభమై, అక్టోబరు 2022 నాటికి 42 పట్టణాలు, నగరాల్లో.
ఫేజ్‌ –3. నవంబర్‌ 2022లో ప్రారంభమై, ఏప్రిల్‌ 2023 నాటికి 41 పట్టణాలు, నగరాల్లో పూర్తి చేస్తామని మున్సిపల్‌ అధికారులు వివరించారు.

ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ మంత్రి) ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, భూపరిపాలన చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, పంచాయితీరాజ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్, రెవెన్యూ కమిషనర్‌ (సర్వే, సెటిల్‌మెంట్స్‌ అండ్‌ లాండ్ రికార్డ్స్) సిద్దార్ధ జైన్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ విభాగం ఐజీ ఎంవీవీ శేషగిరిబాబుతో పాటు, వివిధ శాఖలకు చెందిన  పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.

చదవండి: ఎక్కడా అవినీతికి, అలసత్వానికి తావుండరాదు: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు