నకిలీ చలాన్ల వ్యవహారంపై సీఎం జగన్‌ సీరియస్‌

19 Aug, 2021 16:20 IST|Sakshi

అవినీతిపై కాల్‌ చేసేందుకు ప్రతి ఆఫీస్‌లోను నంబర్‌ ఉండాలి: సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వెలుగు చూసిన నకిలీ చలాన్లపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్ష కార్యక్రమంలో సీఎం జగన్‌ ఈ అంశంపై స్పందించారు. అసలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయి.. ఏసీబీ దాడులు చేస్తే తప్ప ఈ వ్యవహారం వెలుగులోకి రాలేదు అని సీఎం జగన్‌ అసహనం వ్యక్తం చేశారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు.

అక్రమాలకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేశామని అధికారులు సీఎం జగన్‌కి తెలిపారు. ‘‘తప్పులు జరుగుతుంటే ఎందుకు మన దృష్టికి రావడం లేదు.. ఎప్పటి నుంచి ఈ తప్పులు జరుగుతున్నాయి.. వ్యవస్థలు సవ్యంగా నడుస్తున్నాయో, లేదో ఎందుకు చూడటంలేదు’’ అని సీఎం జగన్‌ అధికారులను ప్రశ్నించారు. 

‘‘క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం తెప్పించుకోవాలి. అవినీతిపై ఎవరికి కాల్‌ చేయాలో ప్రతి ఆఫీసులోనూ నంబర్‌ ఉంచాలి. కాల్‌ సెంటర్‌కు వచ్చే కాల్స్‌పై అధికారులు దృష్టి పెట్టాలి. కాల్‌సెంటర్‌మీద అధికారులు ఓనర్‌షిప్‌ తీసుకోండి. అవినీతి నిర్మూలనకు సరైన ఎస్‌ఓపీలను తీసుకురావాలి. సబ్‌రిజిస్ట్రార్‌ సహా అన్ని ఆఫీసుల్లోనూ చలానాల చెల్లింపు ప్రక్రియ పరిశీలించాలి’’ అని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్ మొత్తాన్ని నిశితంగా పరిశీలించామన్న ఆర్థికశాఖ అధికారులు.. అవినీతికి చోటు లేకుండా పూర్తిస్థాయిలో మార్పులు చేశామని తెలిపారు. మీ-సేవల్లో పరిస్థితులపైనా పరిశీలన చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 


 

మరిన్ని వార్తలు