సీఎం జగన్‌ నిర్ణయంతో చిగురుకుంట బంగారు గనులకు మహర్దశ

8 Aug, 2022 19:02 IST|Sakshi

రెండు దశాబ్దాల తరువాత చిగురుకుంట గనులకు మోక్షం

1500 మంది కార్మికులకు ఉపాధి

పంచాయతీలకు పెరగనున్న రాబడి 

రూ.450 కోట్లతో టెండర్లు దక్కించుకున్న ఎన్‌ఎండీసీ సంస్థ  

సీఎం జగన్‌ మాట బంగారు బాట కానుంది. చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలో దాగిన బంగారు ఖనిజాన్ని వెలికి తీయాలన్న ముఖ్యమంత్రి నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మరో ఏడాదిలో చిగురుకుంట బంగారు గనులకు మోక్షం లభించనుంది. 1,500 మంది కార్మికులకు ఉపాధి కల్పనతోపాటు పంచాయతీలకు రాబడి పెరగనుంది. 20 ఏళ్ల పాటు సొంత నియోజకవర్గంలోని బంగారు గనులను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బంగారాన్ని వెలికి తీయడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్‌ఎండీసీ సంస్థ రూ.450 కోట్లతో టెండర్‌ దక్కించుకుంది.


కుప్పం రూరల్‌/ గుడుపల్లె:
దేశంలోనే పేరుగాంచిన చిగురుకుంట బంగారు గనులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంతో మహర్దశ రానుంది. మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన బంగారు గనులు మూతపడడంతో వెయ్యి మంది కార్మిక కుటుంబాలు వీధిన పడినా అప్పటి సీఎం చంద్రబాబు స్పందించలేదు. ఫలితంగా కార్మికుల గోడు అరణ్యరోదనగా మారింది. ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గమైనా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గనులను తెరిపించే దిశగా అడుగులు వేశారు. ఈ నెల 4న కుప్పం ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి ఏడాదిలోపు చిగురుకుంట బంగారు గనులను పునః ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ఈ ప్రాంతానికి మహర్దశ రానుంది. ఈ నిర్ణయంతో కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.  


బంగారు గనుల ప్రస్థానం

గుడుపల్లె మండలం బిసానత్తం గనిని 1968లో, దశాబ్దం తరువాత చిగురుకుంట గనిని 1978లో ఎంఈసీఎల్‌ సంస్థ ప్రారంభించింది. ఈ సంస్థ పదేళ్లపాటు క్వార్జ్‌ (బంగారు ముడి పదార్థం) వెలికి తీసి కేజీఎఫ్‌ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్‌)లోని బీజీఎంఎల్‌ (భారత్‌ గోల్డ్‌ మైనింగ్‌ లిమిటెడ్‌)కు అందజేస్తూ వచ్చింది. కాలక్రమేణా ఎంఈసీఎల్‌ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో గనులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీజీఎంఎల్‌ 1982లో కొనుగోలు చేసింది. అప్పటి నుంచి 19 సంవత్సరాల పాటు 2001 జనవరి 15 వరకు బంగారు ముడి ఖనిజం వెలికి తీసే పనిని చేపట్టింది. దీంతో గనులు లాభాల బాట పట్టాయి. కేజీఎఫ్‌లోని బీజీఎంఎల్‌ నిర్వహిస్తున్న చాంపియన్‌ గని నష్టాల్లో పడింది. కొంత మంది స్వార్థపరులు చిగురుకుంట, బిసానత్తం గనులు నష్టాల్లో సాగుతు న్నట్లు తప్పుడు లెక్కలు చూపించడంతో లాక్‌అవుట్‌ అయ్యాయి. ఇంత పెద్ద నష్టం తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్నప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులుముడుచుకుని కూర్చున్నారు. దీంతో గనులు మూతపడ్డాయి.  


మరో ఏడాదిలో ప్రారంభం

మూతపడ్డ గనులను కేంద్ర ప్రభుత్వం పదేళ్ల తరువాత ఇక్కడ బంగారు కోసం అన్వేషించాలని మైసూరుకు చెందిన జియో సంస్థను 2011లో ఆదేశించింది. జియో సంస్థ మల్లప్పకొండ, బిసానత్తం, చిగురుకుంటలోని 19 కి.మీ. మేర పరిశోధనలు చేసి 263 హెక్టార్లను ఎంపిక చేసింది. 150 బోర్లు డ్రిల్‌ చేసి బంగారం లభ్యతపై అన్వేషణ చేపట్టింది. ఇక్కడ దొరికిన సల్ఫేట్‌ మట్టిని బెంగళూరుకు తరలించి ల్యాబ్‌లో పరీక్షించారు. పరీక్షల్లో చిగురుకుంట, బిసానత్తం ప్రాంతాల్లో ఇంకా బంగారం ఉన్నట్లు ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చి, ఆ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు.


నివేధికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం బిడ్‌లను పిలిచింది. ఈ బిడ్‌లకు ఆదాని, వేదాంత వంటి బడా కంపెనీలు పోటీ పడ్డాయి. ఈ కంపెనీలను తోసిపుచ్చుతూ ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ టెండర్లను దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి  మరో సంవత్సరంలో గనులు ప్రారంభిస్తామని చెప్పడం శుభపరిణామం.  


స్థానికులకు ఉపాధి

గనులు ప్రారంభిస్తే స్థానికులకు ఉపాధితో పాటు పంచాయతీలకు ఆదాయం రానుంది. గనులు లాక్‌ అవుట్‌ చేసే నాటికి 1500 మంది పని చేసేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిగురుకుంట, బిసానత్తం ప్రాంతాల్లో గనులు సాగాలంటే 3 వేల మంది సిబ్బంది అవసరమవుతుంది. వీరిలో 1500 గని కార్మికులు మరో 1500 నిపుణులు, ఉద్యోగులు కావాల్సి ఉంటుంది. దీంతో స్థానికులకు ఉద్యోగాలు భారీగా వచ్చే అవకాశం ఉంది. ఓఎన్‌ కొత్తూరు పంచాయతీకి నెలకు లక్షల్లో ఆదాయం వచ్చేదని కార్మికులు తెలిపారు. ఇప్పటి పరిస్థితుల్లో ఆదాయం నాలుగింతలు అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు. పారదర్శకతతో నిధులు వినియోగిస్తే రెండు పంచాయతీల అభివృద్ధితో పాటు కుప్పం నియోజకవర్గానికి మహర్దశ వచ్చినట్లే. 


వినియోగంలోకి కోట్లాది రూపాయల సామగ్రి 

గనుల్లో మూలన పడిన కోట్లాది రూపాయల సామగ్రి వినియోగంలోకి రానుంది. అక్కడ ఉన్న జనరేటర్లు, లిఫ్టులు, ట్యాంకర్లు, మోటార్లు తుప్పుపట్టిపోయాయి. గనులు ప్రారంభిస్తే పరికరాలు వినియోగంలోకి వచ్చి కోట్ల రూపాయలు ఆదా కానుంది. ఈ రెండు గనుల ప్రాంతాల్లో 8 సొరంగ మార్గాలు ఉండగా, ఇందులో రెండు మార్గాలు బంగారు ముడి ఖనిజం బయటికి తీయడానికి, మిగతా 6 కార్మికుల రాకపోకలు, వ్యర్థాలు బయటికి తీయడానికి వినియోగించనున్నారు. సొరంగాలకు వినియోగించే భారీ టవర్లు వినియోగంలోకి రానున్నాయి.  


8.5 టన్నుల బంగారం ఉత్పత్తే లక్ష్యం
 
263 హెక్టార్లలో విస్తరించిన చిగురుకుంట, బిసానత్తం గనుల్లో ఇప్పటికీ 18 లక్షల టన్నుల బంగారం ముడి ఖనిజం ఉండవచ్చని ఎన్‌ఎండీసీ అధికారుల అంచనా. ఒక టన్ను ముడి పదార్థం నుంచి 5.5 గ్రాముల బంగారం లభిస్తుంది. మొత్తం  8.5 టన్నుల బంగారం ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించుకుని, రూ.450 కోట్ల వరకు సంస్థ ఖర్చు పెట్టనుంది. గనుల ప్రదేశంలోనే బంగారుశుద్ధి ప్లాంటుకు ఎన్‌ఎండీసీ సంస్థ సన్నాహాలు ప్రారంభించింది. (క్లిక్: పర్యాటక నిధి.. హార్సిలీహిల్స్‌)


యువతకు ఉపాధి 

ఇప్పటికే కుప్పం నియోజక వర్గం నుంచి పది వేల మంది యువకులు ఉపాధి కోసం నిత్యం బెంగళూరుకు రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి దయతో గనులు ప్రారంభమైతే మాలాంటి వారికి స్థానికంగానే ఉపాధి లభించనుంది. అంతే కాకుండా మా ప్రాంతం అభివృద్ధి చెందనుంది. కుప్పంకు రాష్ట్రంలో గుర్తింపు వస్తుంది. చంద్రబాబు చేయలేని పని జగగన్న చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.                 
– సంపంగి, సంగనపల్లి 


పంచాయతీలకు ఆదాయం 

గనులు ప్రారంభమైతే చుట్టు పక్కల 20 గ్రామాల ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. పరోక్షంగా వేలాది మందికి లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా సంగనపల్లి, ఓఎన్‌ కొత్తూరు పంచాయతీలకు సెస్సుల రూపంలో రాబడి పెరిగే అవకాశం ఉంది. సుమారు 20 సంవత్సరాల తరువాత ఈ గనులకు మోక్షం లభించడం ఆనందకరమే. ఇప్పటికైనా మా ప్రాంత గనులను గుర్తించినందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు. 
– అమర్‌నాథ్, సర్పంచ్, సంగనపల్లి   

మరిన్ని వార్తలు