రైతుల ఖాతాల్లోకి వడ్డీ రాయితీని జమ చేసిన సీఎం జగన్

20 Apr, 2021 11:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: అన్నదాతలకు ఇచ్చిన వాగ్దానాల అమలులో భాగంగా.. ఆరు లక్షల మందికి పైగా రైతులకు వడ్డీ రాయితీ అందించామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. 2019-20 రబీ సీజన్‌లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు ఏపీ ప్రభుత్వం వడ్డీ రాయితీ‌ అందించింది. ఈ మేరకు సీఎం జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రూ.128.47 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలో 60శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని అన్నారు. రైతులు, రైతు కూలీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం బకాయిలను కూడా చెల్లించామని చెప్పారు. రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలతో ఎంతో మేలు జరుగుతోందని చెప్పారు. వచ్చే నెలలో మరో విడత రైతు భరోసా సాయం అందిస్తామని సీఎం వైఎస్ జగన్‌‌ తెలిపారు. ఇక లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాది లోపు ఆ రుణం తిరిగి చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేస్తున్న విషయం తెలిసిందే.

అయితే రైతులకు ఇప్పటివరకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేసింది. రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా వడ్డీలేని రుణాలు ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైఎస్‌ జగన్ వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం అమలు చేస్తున్నారు. తొలుత ఈ-క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు. అయితే ఈ-క్రాప్‌లో 2,50,550 మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. మిగిలిన రైతులలో బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన వారందరికీ ఇప్పుడు సీఎం జగన్‌ ఉదారంగా ఈ పథకాన్ని వర్తింజేసి వడ్డీ రాయితీ చెల్లిస్తున్నారు.

చదవండి: రూ.912.84 కోట్లతో పోలవరం ఎత్తిపోతల పనులు

మరిన్ని వార్తలు