మీ ఆశీస్సులు ఉన్నంతవరకు ఎవరినైనా ఎదుర్కొంటా: సీఎం జగన్‌

14 Jun, 2022 13:39 IST|Sakshi

సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: అనంతపురం జిల్లాను ఎడారి జిల్లా అనేవారని.. దేవుడి దయ వల్ల అలాంటి పరిస్థితులు మారిపోతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గంగమ్మ తల్లి నేరుగా పైకి వచ్చే పరిస్థితులు ఉన్నాయన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో జరిగిన కార్యక్రమంలో రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 2021 ఖరీఫ్‌లో పంటనష్టపోయిన 15.61 లక్షలమంది రైతులకు రూ.2,977.72 కోట్లు ఇస్తున్నామన్నారు.
చదవండి: ఈ నెల 22న ఏపీ కేబినెట్‌ భేటీ

సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
‘‘ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే రైతులకు బీమా కింద రూ.885 కోట్లు చెల్లిస్తున్నాం. ప్రభుత్వ పాలనలో మార్పును గమనించాలని కోరుతున్నాం. ఇంతకు ముందు బీమా వస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఎవరికి వస్తుందో, ఎవరికి రాదో తెలియని పరిస్థితి. ఒక సీజన్‌లో నష్టం జరిగితే.. మళ్లీ మరుసటి ఏడాది అదే సీజన్‌ రాకముందే నేరుగా రైతుల చేతుల్లో పెడుతున్నాం. లంచాలు, వివక్ష లేకుండా పంటల బీమా పరిహారాన్ని చెల్లిస్తున్నాం. పారదర్శకంగా ప్రతిరైతన్న కుటుంబానికీ మంచి జరుగుతోంది. పంట నష్టపోతే, రైతు నష్టపోతే రాష్ట్రం నష్టపోతుంది. అందుకే పంటల బీమా విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. గడచిన మూడేళ్లుగా రైతులకు పంట నష్టం విషయంలో ఈ ప్రభుత్వం తోడుగా నిలబడింది.

గత ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం.. తేడా గమనించండి...
గత తెలుగుదేశం పార్టీ పాలనలో అక్షరాల ఐదేళ్ల కాలానికి పంటల బీమా కింద 30.85 లక్షల మంది రైతులకు రూ.3411 కోట్లు ఇచ్చారు. ఇవాళ మీ బిడ్డ పాలనలో మూడేళ్ల కాలంలో అక్షరాల 44.28లక్షల మంది రైతులకు ఉచితంగా పంటల బీమా చేయించి రూ.6.685 కోట్లు చెల్లిస్తున్నాం. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాను గమనించమని కోరుతున్నాను. గత ప్రభుత్వం పెట్టిన రూ.715.84 కోట్ల రూపాయల పంటల బీమా బకాయిలను కూడా మీ బిడ్డ ప్రభుత్వం చెల్లించింది. పంటల బీమాకు సంబంధించి గత ప్రభుత్వం బకాయిలు పెడితే.. ఈ ప్రభుత్వం ఏ సీజన్‌లో జరిగిన నష్టాన్ని.. మళ్లీ అదే సీజన్‌ వచ్చేలోగా పెడుతున్నారు. రైతన్నలకు మేలు చేసే విషయంలో మనం గత పాలకులతో కాదు పోటీపడేది.. దేశంతో పోటీపడుతున్నాం. మన గ్రామాల్లో ఆర్బీకేలను చూసేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు వస్తున్నారు. ఆర్బీకేల ద్వారా వస్తున్న మార్పులను చూస్తున్నారు. మూడేళ్లుగా మన పాలనలో వచ్చిన మార్పులను చూడండి

గతంలో ఎప్పుడూ చూడని విధంగా..
గతంలో ఎప్పుడూ చూడని విధంగా వైఎస్సార్‌ రైతుభరోసా, పీఎం కిసాన్‌ కింద రూ.23,875కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకం ద్వారానే నేరుగా రైతన్నల చేతుల్లో పెట్టాం. జూన్‌ మాసం రాకముందే.. వ్యవసాయ పనులు రాకముందే... రైతు భరోసా సొమ్మును నేరుగా రైతన్నల ఖాతాల్లో వేశాం. మూడేళ్లలో చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా రైతుల కోసం మీ బిడ్డ ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాల రూ.1,27,823 కోట్లు. పంటల బీమాకు మొత్తం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇ-క్రాపింగ్‌ చేయించి ప్రతి రైతన్నకు పారదర్శకంగా చెల్లింపులు చేస్తున్నాం. సీజన్‌లో నష్టం జరిగితే.. సీజన్‌ ముగియకముందే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నాం. రైతులకు సున్నావడ్డీకింద రూ.1283 కోట్లు చెల్లించాం మూడేళ్లలో. గత ప్రభుత్వంలో ఐదేళ్లకాలంలో సున్నావడ్డీ కింద చెల్లించింది కేవలం రూ.782 కోట్లు. ఆర్బీకేలు రైతన్నలకు తోడుగా నిలుస్తున్నాయి.

పగటి పూటే 9 గంటలపాటు రైతన్నలకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. దీని కోసమే ఫీడర్లకోసం రూ.1700 కోట్లు పెట్టాం. గత ప్రభుత్వం పెట్టిన రూ. 8,845 కోట్ల ఉచిత విద్యుత్‌ బకాయిలను చెల్లించాం. ధాన్యం చెల్లింపులకోసం గత ప్రభుత్వం రూ.960 కోట్లు బకాయిలు పెడితే దాన్ని చెల్లించాం. విత్తనాల కొనుగోలు కోసం బకాయిలు పెట్టిన రూ. 384 కోట్ల డబ్బునుకూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది. దురదృష్టవశాత్తూ రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతన్న కుటుంబానికి రూ.7 లక్షల వెంటనే ఇస్తున్నాం. కౌలు రైతు ఆత్మహత్య దురదృష్టవశాత్తు చేసుకుంటే వెంటనే ప్రభుత్వం ఆదుకుంటుంది

దత్త పుత్రుడికి ఆరోజు గుర్తుకు రాలేదు..
చంద్రబాబు దత్తపుత్రుడు అనంతపురం వచ్చాడు. గోదావరి జిల్లాలకు కూడా వెళ్లాడు. పట్టాదారు పాసు పుస్తకం ఉండి, ఆత్మహత్య చేసుకుంటే పరిహారం అందని రైతు కుటుంబాన్ని చూపించగలవా? అని సవాల్‌ విసిరితే.. చూపించలేకపోయారు. సీసీఆర్సీ కార్డు ఉండి.. ఆత్మహత్యచేసుకుని ఉన్న కౌలు రైతును ఒక్కరినైనా చూపించగలవా? అంటే చూపించలేకపోయారు. మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఎంత బాధపడతామో.. అదే రకంగా రైతులు చనిపోతే ఆవేదన వ్యక్తంచేస్తూ వారికి తోడుగా నిలబడ్డాం. 458 కుటుంబాలకు చంద్రబాబు పరిహారం ఇవ్వకపోతే.. జగనన్న ప్రభుత్వం మాత్రమే వారికి ఇచ్చింది. ఈ జిల్లాలకు పోవాలి, ఇలా గ్రామాలకు పోవాలని అని ఆ దత్తపుత్రుడికి ఆ రోజు గుర్తుకు రాలేదు. పరిహారం ఇవ్వాలని చంద్రబాబుకు అనిపించలేదు.

అవినీతి లేకుండా, వివక్ష లేకుండా..
ధాన్యం కొనుగోలు కోసం మూడేళ్లలో దాదాపు రూ.45వేల కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు ఐదేళ్లలో రూ.30-32వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. పాడి రైతులకు మంచి చేయడానికి అమూల్‌ను తీసుకు వచ్చాం. ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. చంద్రబాబు కంపెనీ హెరిటేజ్‌తోపాటు అందరు కూడా లీటరు రూ.5 నుంచి రూ.10లు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అవినీతి లేకుండా, వివక్ష లేకుండా పథకాలు అమలు చేస్తున్నాం. ఒక్కపైసా కూడా అవినీతి లేదు. మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు.. నేరుగా మీ చేతికే వస్తోంది. గతంలో ఇది ఎందుకు జరగలేదు?. అప్పుడు నేరుగా గత పాలకుల చేతుల్లోకి డబ్బులు పోయేవి. గతంలో జరగనిది.. ఇప్పుడు మీ బిడ్డ పాలనలో జరుగుతుంది.

ఆ బాధ కూడా గత పాలకులకు లేదు..
గతంలో మాదిరిగా మోసాలు చేసే పరిస్థితి లేదు. మాట ఇచ్చి తప్పితే.. రైతు ఏమవుతాడన్న బాధ కూడా గత పాలకులకు లేదని మనం చూశాం. అలాంటి వాళ్లు రాజకీయాలకు తగునా?. ఒక వ్యక్తి ఎలా మాట ఇచ్చాడు.. ఎలా మోసం చేశాడో మీరు చూశారు. ఆయన చంద్రబాబు నాయుడు. చంద్రబాబుకు ఏం చేస్తే మంచి జరుగుతుందని.. అది చేయడానికి ఉరుకులు పరుగులు తీసే మరో వ్యక్తి దత్తపుత్రుడు. ప్రజలను మోసం చేసి.. తోడుదొంగలైన వీరిద్దరు... రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా?. మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం అంటే... దాన్ని డైవర్ట్‌ చేయడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఒక టీవీ–5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు.. వీళ్లంతా ఏకం అవుతారు. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా .. అబద్ధానికి రంగులు పూస్తారు

రైతులను నట్టేట ముంచిన ఈ చంద్రబాబు మంచోడంట..
చంద్రబాబుగారు వచ్చినా, దత్తపుత్రుడు వచ్చినా అడగండి. మీరిచ్చిన మేనిఫెప్టోను చూసి ఓట్లేశాం.. ఆ మేనిఫెస్టోను ఎందుకు అమలు చేయలేదని అడగండి. మేనిఫెస్టోలో రైతుకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయని ఈ చంద్రబాబు మంచోడంట. రుణమాఫీ అంటూ మోసం చేసి రైతులను నట్టేట ముంచి ఈ చంద్రబాబు మంచోడంట. ఉచిత విద్యుత్, ధాన్యం, విత్తన బకాయిలను, పంటల బీమాకూడా చెల్లించకుండా బకాయిలు పెట్టి ఎగ్గొట్టిన ఈ చంద్రబాబు మంచోడంట. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం అమలు చేశామని మేనిఫెస్టో చూపించి మీరే టిక్‌ పెట్టండి అని మీ ఇంటి దగ్గరకు మూడేళ్ల పాలన తర్వాత వచ్చి ఆశీస్సులను మీ బిడ్డ అడుగుతున్నాడు. ఇద్దరికీ తేడాను గమనించండి:

రైతులను ఎందుకు రెచ్చగొడుతున్నారు..
కోనసీమలో క్రాప్‌ హాలిడే అని రైతులను ఎందుకు రెచ్చగొడుతున్నారు. మీరు ఎగ్గొట్టిన ధాన్యం బకాయిలను జగన్‌ అనే నేను తీర్చినందుకా?. కేంద్రం నుంచి సకాలానికే డబ్బు రాకపోయిన 21 రోజుల్లోనే వారికి ధాన్యం డబ్బులు ఇవ్వడంకోసం కిందా మీదా ప్రయాస పడుతున్నా.. మీ బిడ్డ ప్రయత్నాన్ని చూడలేకపోతున్నారా? అంటూ ఇదే చంద్రబాబును, మీ దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ని అడుగుతున్నాను.

మార్పులను తట్టుకోలేక రాజకీయాలు..
2 సంవత్సరాల కోవిడ్‌ తర్వాత టెన్త్‌పరీక్షలు జరిగాయి. పరీక్షలు లేకుండా పాస్‌ చేసుకుంటూ రెండేళ్లు వచ్చాం. 67శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. గుజరాత్‌లో 65శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రెండేళ్ల తర్వాత పరీక్షలు రాసిన పిల్లలకు ఆత్మస్థైర్యం కల్పించే మాటలు చెప్పాలి. సప్లిమెంటరీ తీసేసి.. రెగ్యులర్‌గానే వారిని భావిస్తూ వారికి మళ్లీ పరీక్షలు పెడుతున్నాం. ఆ పిల్లలను సైతం రెచ్చగొట్టడానికి, చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మన పిల్లలకు ఇవ్వాల్సింది క్వాలిటీ చదువులు. ప్రపంచంతో పోటీపడేటప్పుడు వారి చదువుల్లో క్వాలిటీ ఉండాలి. విద్యారంగంలో తీసుకు వస్తున్న మార్పులను తట్టుకోలేక దాన్ని కూడా రాజకీయంచేస్తున్నారు.

సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెప్తున్నాం..
కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ అనే మహానుభావుడి పేరును పెట్టాం. ఒక దళిత మంత్రి, బీసీ మంత్రి ఇళ్లను కాల్చేశారు. ఒక జిల్లాకు అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అని పేరుపెడితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదా సామాజిక న్యాయం?. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా?. మీ బిడ్డ మంత్రివర్గంలో 70శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మంత్రులుగా ఉన్నారు. సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెప్తున్నాం. ఉద్యోగుల విషయంలో కూడా ఇదే ధోరణి. ఉద్యోగలకు ప్రతి విషయంలో మంచి చేస్తున్నాం. ఇంతకు ముందు ఎవ్వరూ కూడా సాహసం చేయలేదు. వారికి మంచి జరుగుతుందని వారికి నచ్చజెప్పి, వారిని కలుపుకుంటూ పోతే.. వారినికూడా రెచ్చగొట్టే దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. వీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. మీ బిడ్డ ఎదుర్కోగలడు. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో మీ బిడ్డ ఎవ్వరినైనా ఎదుర్కోగలడని’’ సీఎం జగన్‌ అన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు