ఇకపై ‘లా నేస్తం’ పథకం ఏడాదికి రెండుసార్లు: సీఎం జగన్‌

22 Feb, 2023 12:12 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఇకపై ‘లా నేస్తం’ పథకాన్ని ఏడాదికి రెండు సార్లు అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అర్హులైన 2,011 మంది జూనియర్‌ న్యాయవాదుల కోసం రూ.­1,00,55,000లను ఏపీ ప్రభు­త్వం బుధవారం విడుదల చేసింది. సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి ఆ మొత్తాన్ని జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లోకి జమ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత మూడేళ్లుగా ‘లా నేస్తం’ నిధులు విడుదల చేస్తున్నామన్నారు. లా డిగ్రీ తీసుకున్న తర్వాత తొలి మూడేళ్లు న్యాయవాదిగా స్థిరపడేందుకు ‘లా నేస్తం’ కచ్చితంగా ఉపయోగపడుతుందని సీఎం అన్నారు

‘‘గత మూడున్నరేళ్లలో 4,248 మంది లాయర్లకు ‘లా నేస్తం’ అందించాం. ఇప్పటి వరకు రూ.35.40 కోట్లు అందించాం. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2,011 మంది అడ్వకేట్లకు ‘లా నేస్తం’ అందిస్తున్నాం. 2,011 మంది అడ్వకేట్లకు రూ.కోటి 55 వేలు జమ చేస్తున్నాం. ఇకపై ‘లా నేస్తం’ పథకాన్ని ఏడాదికి రెండుసార్లు అందిస్తాం అడ్వకేట్ల కోసం రూ.100 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేశాం’’ అని సీఎం అన్నారు.

‘‘న్యాయ వాదులుగా రిజిస్టర్‌ చేసుకున్న వారికి మొదటి మూడు సంవత్సరాలు చాలా ఇబ్బందులుంటాయని నాకు పాదయాత్రలో చెప్పారు. వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడగలిగే వృత్తిలో ఉన్నారు. ప్రభుత్వం తోడుగా నిలబడ్డం వల్ల డబ్బులేని పేదవాడికి సహాయం చేయగులుగుతారనే విశ్వాసం ఉంది. ఈ పథకంలో కొంత మార్పులు తీసుకు వచ్చాం. ఆరు నెలలకు ఒకసారి, సంవత్సరానికి 2 దఫాలుగా ఇచ్చేందుకు నిర్ణయించాం. వారి అవసరాలు తీర్చుకునేలా వారికి ఉపయోగపడుతుందని. రూ. 100 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేశాం. దాదాపు రూ.25 కోట్ల మేర లాయర్లకు కోవిడ్‌ సమయంలో మంచి కూడా జరిగింది’’ అని సీఎం పేర్కొన్నారు.

‘‘అత్యంత పారదర్శకంగా దీన్ని అమలు చేస్తున్నాం. ఆధీకృత వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. సంతృప్త స్థాయిలో దీన్ని అమలు చేస్తున్నాం. ఒక్కరు కూడా మిస్‌ కాకూడదనే ఉద్దేశంతో అమలు చేస్తున్నాం. మంచి జరగాలనే తపన, తాపత్రయంతో పాదయాత్రలో మాట ఇచ్చాం. దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నాం. ఈ పథకం ద్వారా మంచిని పొందుతున్న లాయర్లు, పేదవాడిపట్ల అదే అంకిత భావాన్ని చూపాలని కోరుతున్నాను. మీ వృత్తుల్లో మరింత రాణించాలని మనసారా కోరుకుంటున్నాను’’అని సీఎం జగన్‌ అన్నారు.
చదవండి: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో గవర్నర్‌కు సీఎం జగన్‌ ఆత్మీయ వీడ్కోలు

మరిన్ని వార్తలు