2 Years Of YS Jagan Rule In AP: బీసీలకు వెన్ను దన్ను

31 May, 2021 03:29 IST|Sakshi

సంక్షేమం, అభివృద్ధిలో పెద్దపీట

నవరత్నాల ద్వారా ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు

రెండేళ్ల పాలనలో వెనుకబడిన తరగతుల లబ్ధిదారులే అత్యధికం

పలువురికి ఒకటి కంటే ఎక్కువ పథకాల ద్వారా లబ్ధి

4.52 కోట్ల మంది బీసీ లబ్ధిదారులకు రూ.65,752.20 కోట్ల ఆర్థిక ప్రయోజనం

వీరిలో నేరుగా నగదు బదిలీ పథకాల ద్వారా 3.31 కోట్ల మందికి రూ.46,405.81 కోట్లు 

నగదేతర పథకాల ద్వారా 1.21 కోట్ల మందికి రూ.19,346.39 కోట్లు 

సాక్షి, అమరావతి: సామాజిక న్యాయం అంటే అసలైన అర్థం ఇదేనని వైఎస్‌ జగన్‌ రెండేళ్ల పాలన స్పష్టం చేసింది. వాస్తవానికి రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల (బీసీ) వారు రెండేళ్ల క్రితం వరకూ వెనుకబడిపోయే ఉన్నారు. జనాభాలో అత్యధికులుగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాల్లో వారికి ఏ రంగంలో కూడా తగిన వాటా లభించలేదు. ఆఖరికి దారిద్య్ర రేఖకు దిగువనున్న బీసీలు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందలేదు. బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్యాస్ట్‌ కాదు... బీసీలంటే దేశానికి బ్యాక్‌ బోన్‌ అంటూ పాదయాత్రతో పాటు ఎన్నికల ముందు నిర్వహించిన బీసీ సదస్సులో కొత్త నిర్వచనం చెప్పిన అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వారికి అన్ని రంగాల్లో తగిన వాటా ఇచ్చేశారు. రెండేళ్ల పాలనలో ఇటు అభివృద్ది, సంక్షేమంలో బీసీలకు సామాజిక న్యాయం చేశారు.

రాజ్యాధికారంలో కూడా బీసీలకు పెద్ద పీట వేశారు. మంత్రివర్గంలోనే కాకుండా బీసీల్లోని వివిధ వర్గాలకు జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఆయా వర్గాలకు నామినేటెడ్‌ పదవులు ఇచ్చారు. ఈ విషయంలో గత చంద్రబాబు సర్కారుతో పోల్చి చూస్తే  ఇప్పటి జగన్‌ సర్కారులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇందుకు ప్రత్యక్ష  సాక్ష్యంగా నవరత్నాల ద్వారా బీసీలకు అందించిన ఆర్థిక ప్రయోజనాలే కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

గత ప్రభుత్వంలో బీసీలకు సబ్సిడీ పథకాలపై బ్యాంకు రుణాలు మాత్రమే మంజూరుకు చర్యలకు తీసుకున్నారు. అదీ కూడా ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేస్తేనే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా రెండేళ్ల ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్రంలోని బీసీలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధిక ఆర్థిక ప్రయోజనం పొందారు. 


అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
► ఎన్నికల ముందు చెప్పిన మేరకు కులం, మతం, ప్రాంతం, రాజకీయం, పార్టీలు చూడకుండా నవరత్నాల పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించింది. మంత్రులు, ఎమ్మెల్యేల జోక్యం గానీ సిఫార్సులకు ఎటువంటి ఆష్కారం ఇవ్వలేదు. 

► వైఎస్సార్‌ నవశకం పేరుతో అర్హతగల ప్రతి ఒక్కరినీ నవరత్నాల పథకాలకు వలంటీర్ల ద్వారా గుర్తించారు. దీంతో ఎటువంటి వివక్షకు తావులేకుండా అర్హులైన బీసీలందరినీ ఆయా పథకాలకు ఎంపిక చేశారు. వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేశారు.

► 2019 జూన్‌ నుంచి ఈ ఏడాది మే ఆఖరు వరకు అంటే రెండేళ్ల పాలనలో నేరుగా నగదు బదిలీతో పాటు నగదేతర బదిలీ పథకాల ద్వారా 4.52 కోట్ల మంది బీసీలకు (పలువురికి ఒకటి కంటే ఎక్కువ పథకాల ద్వారా లబ్ధి కలిగింది) రూ.65,752.20 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరింది.

► ఇందులో నేరుగా నగదు బదిలీ ద్వారా 3.31 కోట్ల మంది బీసీలకు రూ.46,405.81 కోట్లను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. నగదేతర పథకాల ద్వారా 1.21 కోట్ల మంది బీసీలకు రూ.19,346.39 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూర్చారు. వైఎస్సార్‌ రైతు భరోసాతో పాటు వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, జగనన్న అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో అత్యధికులు బీసీలే ఉండటం గమనార్హం. 

మరిన్ని వార్తలు