ఇతర రాష్ట్రాల్లో ఆస్తి పన్ను విధానాలపై చర్చ

31 Aug, 2020 20:40 IST|Sakshi

సాక్షి, అమరావతి: కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో సంస్కరణలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్‌ శాఖ కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్ విజయకుమార్‌తో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో సంస్కరణలపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలపై సమావేశంలో సీఎం జగన్‌ చర్చించారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీలను స్వయం సమృద్ధి దిశగా నడిపించాలంటూ కేంద్రం మార్గనిర్దేశం చేసిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఆస్తి పన్ను విధానాలు, రాష్ట్రంలో ఆస్తి పన్ను విధానాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దాంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల్లో అమలు చేస్తున్న ఆస్తి పన్ను విధానాలను వివరించారు. (చదవండి: వైఎస్సార్‌ ఫొటో ఎందుకు పెట్టకూడదు: హైకోర్టు)

ఆయా రాష్ట్రాల్లో నెలవారీ అద్దె ప్రాతిపదికన కాకుండా ఆస్తి విలువ ప్రాతిపదికన పన్నులు విధిస్తున్న అంశాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయా రాష్ట్రాల్లో ఆస్తి విలువలు, దాని నిర్ధారించే విధానాలు, ఆ మేరకు విధిస్తున్న పన్ను తదితర అంశాల గురించి ముఖ్యమంత్రి, అధికారులతో సమావేశంలో చర్చించారు. వాటన్నింటిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 

మరిన్ని వార్తలు