YSR Jayanthi: కరువు నేలపై జలసిరి..

8 Jul, 2021 09:36 IST|Sakshi

ప్రతి ఇంటి ముంగిటా ఆ అభివృద్ధి వెలుగులే.. ప్రతి పేద గుండెలో ఆ నిండైన రూపమే బీడువారిన నేల తల్లికి జలసిరులందించిన భగీరథునిలా.. కరువు నేలపై హరిత సంతకమయ్యాడు .దగాపడిన బడుగు జీవికి.. లయ తప్పిన పేద గుండెకు  ఊపిరిలూదిన దైవంలా నిలిచాడు చదువు ‘కొనలేక’ పేదింటి అక్షరం చిన్నబోతే.. వయసుడిగిన నాడు ఆసరా లేక వృద్ధాప్యం ఉసూరుమంటే ఇంటికి పెద్దకొడుకై ఆపన్న హస్తం అందించాడు. మహానేత దూరమైనా ఆయన ఇచ్చిన అభివృద్ధి ఫలాలు  నిత్యం గుర్తుచేస్తూనే ఉన్నాయి నేడు వైఎస్సార్‌ జయంతి సందర్భంగా  ప్రతి ఒక్కరూ ఆ రాజశేఖరుని స్మరించుకుంటున్నారు. 

సాక్షి,ప్రకాశం​: దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి జిల్లా అభివృద్ధిలో చెరగని ముద్ర వేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఆ మహానేత కనుమరుగై పుష్కర కాలం కావస్తున్నా జిల్లా ప్రజలు మాత్రం ఆయన జ్ఞాపకాలను గుండెల్లో పదిలం చేసుకున్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా జరుపుతోంది. గురువారం వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుందాం..  
నిత్యం కరువుతో అల్లాడే జిల్లా రూపు రేఖలు మార్చేందుకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా సాగు, తాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. జిల్లాలో ఆయన ఆలోచనలతో జీవం పోసుకున్న ప్రాజెక్టులు ఇలా ఉన్నాయి. 

కొరిశపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం.... 
యర్రం చినపోలిరెడ్డి కొరిశపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం కూడా వైఎస్సార్‌ రూపొందించిందే. గుండ్లకమ్మ రిజర్వాయర్‌ నుంచి నీటిని ఎత్తిపోసి కొరిశపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో ప్రజలను ఆదుకునేందుకు ఈ ప్రాజెక్టును నిర్మించ తలపెట్టారు. రెండు మండలాల్లోని 20 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా 1.33 టీఎంసీల సామర్ధ్యంతో ప్రాజక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం రూ.177 కోట్ల వ్యయ అంచనాలతో ప్రాజెక్టును రూపొందించారు. వైఎస్సార్‌ అకాల మరణం తరువాత పనులు నిలిచిపోయాయి. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం అయ్యాక మళ్లీ పనులు వేగం పుంజుకున్నాయి. 

పాలేరు రిజర్వాయర్‌ను కూడా వైఎస్సార్‌ మంజూరు చేశారు. కొండపి నియోజకవర్గంలోని పొన్నలూరు మండలం పాలేరుపై చెన్నుపాడు వద్ద రిజర్వాయర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 0.584 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టును మధ్యలో టీడీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేయటానికి రూ.210 కోట్లతో కొత్తగా వ్యయ అంచనాలను మార్చి పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. 

జిల్లాలో సాగర్‌ ఆయకట్టు దాదాపు 4.40 లక్షల ఎకరాల్లో ఉంది. సాగు, తాగునీరు సక్రమంగా వచ్చేందుకు కాలువల మరమ్మతులు ఏళ్ల తరబడి చేపట్టకపోవటంతో సాగర్‌ నుంచి రావాల్సిన వాటా నీటిని కూడా వినియోగించుకునే పనిలేకుండా పోయింది. దీంతో అప్పట్లో రూ.400 కోట్లు ఖర్చు చేసి సాగర్‌ కాలువల అభివృద్ధిని చేపట్టారు. 

 జిల్లాలో ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా లేకపోవటాన్ని గుర్తించిన వైఎస్సార్‌ జిల్లా కేంద్రం ఒంగోలులో రిమ్స్‌ మెడికల్‌ కళాశాలను మంజూరు చేయించారు. మెడికల్‌ కాలేజి నిర్మాణానికి రూ.250 కోట్లు మంజూరు చేశారు. 

 కందుకూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యలను తీర్చేందుకు రూ.110 కోట్లతో సమ్మర్‌ స్టోరేజీ(ఎస్‌ఎస్‌) ట్యాంకును మంజూరు చేశారు. సాగర్‌ నీటితో రామతీర్థం జలాశయాన్ని నింపి తద్వారా కందుకూరు ఎస్‌ఎస్‌ ట్యాంకుకు తాగునీటిని సరఫరా చేయించేందుకు పూనుకున్నారు. 

  రాళ్లపాడు ప్రాజెక్టు కింద ఉన్న రైతాంగాన్ని ఆదుకునేందుకు నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు నుంచి నీటిని రాళ్లపాడుకు మళ్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందుకోసం రూ.80 కోట్లతో సోమశిల ఉత్తర కాలువ అభివృద్ధికి పూనుకున్నారు. 

  ఫ్లోరైడ్‌ సమస్యతో అల్లాడిపోతున్న కనిగిరి ప్రాంత ప్రజల తాగునీటి అవస్థలు తీర్చేందుకు రూ.175 కోట్లతో రక్షిత మంచినీటి పథకాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ మోహన రెడ్డి ప్రభుత్వం ఫ్లోరైడ్‌ సమస్యను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రణాళికలు రూపొందించారు.  

  వీటితో పాటు మార్కాపురంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణంతో పాటు జిల్లాలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు.

వెలిగొండ ప్రాజెక్టు
పశ్చిమ ప్రకాశంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయటానికి వైఎస్సార్‌ 2004 నుంచే పూనుకున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి 43.58 టీఎంసీల కృష్ణా వరద నీటిని మళ్లించి జిల్లాలోని 23 మండలాల్లో 3,36,100 ఎకరాలకు, వైఎస్సార్‌ కడప జిల్లాలోని రెండు మండలాల పరిధిలోని 27,200 ఎకరాలకు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలకు చెందిన 84 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా రూపొందించారు. అదేవిధంగా 15.25 లక్షల మందికి తాగునీరు అందించేలా ప్రాజెక్టు నిర్మాణ డిజైన్లు మార్చారు. అప్పటి నుంచి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరుగులు       పెట్టించారు.  

గుండ్లకమ్మ ప్రాజెక్టు... 
గుండ్లకమ్మ నది నుంచి నీరు వృథాగా సముద్రం పాలు కావటాన్ని గమనించిన వైఎస్సార్‌ మద్దిపాడు మండలం మల్లవరం వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందు కోసం రూ.543.43 కోట్లు కేటాయించారు. 3.859 టీఎంసీల సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారు. 9 మండలాల పరిధిలో 84 వేల ఎకరాలకు సాగు నీరు, జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు 43 గ్రామాల పరిధిలోని 2.56 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 2008 నవంబర్‌ 24న డాక్టర్‌ వైఎస్సార్‌ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.   

మరిన్ని వార్తలు