YS Rajasekhara Reddy: రాజన్న ప్రగతి బాట..

2 Sep, 2021 10:54 IST|Sakshi

వైఎస్సార్‌ హయాంలో సంక్షేమం.. అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు 

సాగర్‌ కాలువల ఆధునికీకరణతో జిల్లాకు సమృద్ధిగా సాగు నీరు 

వేగంగా వెలిగొండ పనులు, గుండ్లకమ్మ, రామతీర్థం పూర్తి 

రూ.250 కోట్లతో నిరుపేదల వైద్యానికి రిమ్స్‌ ఏర్పాటు 

జిల్లాలో రూ.వేల కోట్లతో అభివృద్ధికి బాటలు 

నేడు దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ 12వ వర్ధంతి   

ప్రతి ఇంటి ముంగిటా ఆ అభివృద్ధి వెలుగులే... ప్రతి పేద గుండెలో ఆ నిండైన రూపమే... బీడువారిన నేలతల్లికి జలసిరులందించిన భగీరథునిలా... లయతప్పిన పేద గుండెకు ఊపిరిలూదిన దైవంలా...  చదువు ‘కొన’లేక పేదింటి అక్షరం చిన్నబోతే...  వయసుడిగిన నాడు ఆసరాలేక వృద్ధాప్యం ఉసూరుమంటే...  ఇంటికి పెద్ద కొడుకై ఆదుకున్న ఆపన్న హస్తంలా..  ఆ మహానేత వైఎస్సార్‌ నిలిచారు..  వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఆ చెరగని జ్ఞాపకాలతో, జిల్లాకు వైఎస్సార్‌ అందించిన అభివృద్ధి ఫలాలపై కథనం.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతూ.. అభివృద్ధికి నోచుకోని ప్రకాశం జిల్లాపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధికి బాటలు వేశారు. జలయజ్ఞంతో ఇక్కడి దుర్భిక్ష పరిస్థితుల్ని పారదోలేందుకు నడుంకట్టారు. వైఎస్సార్‌ అధికారంలోకి రాగానే జిల్లాలో 2.60 లక్షల మంది రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.480 కోట్లు రుణమాఫీ చేశారు. అందులో 2.17 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులు లాభపడ్డారు. 43,572 మంది రైతులకు వారు తీసుకున్న బ్యాంకు రుణాలు ఒకే మొత్తంలో పరిష్కరించుకునే విధానాన్ని అమలు చేశారు. దీంతో రైతులు రూ.97 కోట్ల మేర లబ్ధిపొందారు. కరువుతో అల్లాడిన రైతులు 1,23,147 మందికి ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున రూ.62 కోట్లు రిలీఫ్‌ స్కీం కింద అందించారు.

ఐదేళ్లలో ప్రాజెక్టులకు భారీగా నిధులు 

వైఎస్సార్‌ జిల్లాలో ప్రాజెక్టులకు భారీగా నిధులిచ్చారు. 24.37 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేలా చర్యలు చేపట్టారు. ఐదేళ్లలో అన్ని ప్రాజెక్టులకు కలిపి రూ.6,280.11 కోట్లు ఖర్చు చేశారు.   
జిల్లాలోని 63,346 మంది విద్యార్థులకు రూ.30 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చారు. రూ.75 కోట్లు పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాలు అందించారు.

2004 ముందు జిల్లాలో 2.86 లక్షల మందికి పింఛన్లు ఉన్నాయి. ఇందిరమ్మ మూడు దశల కార్యక్రమాల కింద అదనంగా 1.79 లక్షల మందికి నూతనంగా పింఛన్లు మంజూరు చేశారు. పావలా వడ్డీ కింద రూ.20 కోట్లు పొదుపు గ్రూపులకు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చారు. బ్యాంకు లింకేజి రుణాలు రూ.853 కోట్లు మంజూరు చేయించారు. 
జిల్లాలో 7.19 లక్షల మందికి ఆరోగ్యశ్రీ హెల్త్‌ కార్డులు అందించారు. 10,366 మందికి గుండె ఆపరేషన్లు చేయించారు.  జిల్లా కేంద్రం ఒంగోలులో రిమ్స్‌ మెడికల్‌ కాలేజీ మంజూరు చేయించారు. 37.46 ఎకరాల్లో దాదాపు రూ.250 కోట్లతో మెడికల్‌ కళాశాల, వెయ్యి పడకల రిమ్స్‌ వైద్యశాలల నిర్మాణాలు చేపట్టారు. 
ఐదేళ్లలో 3,22,630 గృహాలు నిర్మించి పేదలకు అందించారు. 19,904 మంది భూమి లేని పేదలకు 31,734 ఎకరాలు  పంపిణీ చేశారు.  
 జిల్లాలో రూ.400 కోట్లతో సాగర్‌ కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టటంతో 4.50 లక్షల సాగర్‌ ఆయకట్టుకు నీరందింది. దీంతో యర్రగొండపాలెం, దర్శి, అద్దంకి, పర్చూరు, సంతనూతలపాడు, మార్కాపురం, ఒంగోలు నియోజకవర్గాల రైతులకు మేలు చేకూరింది.   

కొండపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలం చెన్నుపాడు వద్ద పాలేరు నదిపై సంగమేశ్వరం వద్ద రూ.50 కోట్లతో ప్రాజెక్టు మంజూరు చేశారు.  
దర్శి నియోజకవర్గంలో రూ.120 కోట్లతో రక్షిత మంచినీటి పథకం, రూ.2 కోట్లతో మార్కెట్‌ యార్డు నిర్మించారు.  
 కనిగిరి నియోజకవర్గంలో రూ.175 కోట్లతో రక్షిత మంచినీటి పథకం మంజూరు చేశారు.   
 కందుకూరులో రూ.110 కోట్లతో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు నిర్మించారు. రూ.80 కోట్లతో రాళ్లపాడు ప్రాజెక్టు అనుసంధానం కోసం సోమశిల ప్రాజెక్టు నుంచి ఉత్తర కాలువ నిర్మించారు.  

గిద్దలూరులో రూ.12 కోట్లతో బైరేనిగుండాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతో పాటు రూ.22 కోట్లతో రామన్న కతువ నిర్మించారు. 
 చీరాల, పర్చూరుల్లో కృష్ణా డెల్టా ఆధునికీకరణకు రూ.2 వేల కోట్లు కేటాయించారు. చేనేతలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇచ్చారు.  
► అద్దంకిలో రూ.400 కోట్లతో నార్కెట్‌పల్లి, అద్దంకి, మేదరమెట్లకు రాష్ట్రీయ రహదారి నిర్మించారు. 5 వేల ఎకరాలకు సాగునీరందించే యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం మంజూరు చేశారు.

► 2004 మే నెలకు ముందు జిల్లాలో 63,559 మంది రైతుల కరెంట్‌ బకాయిలు రూ.59.5 కోట్లు వైఎస్సార్‌ రద్దు చేశారు.   ఐదేళ్లలో మొత్తం 86,207 మంది రైతులు ఉచిత విద్యుత్‌ పొందారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక  ఆ సంఖ్య 1.50 లక్షలకు చేరింది.

► 2019 ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన వైఎస్సార్‌ తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి బాటలోనే ప్రజా రంజక పాలన సాగిస్తూ వ్యవసాయానికి, మహిళాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారు. తండ్రి అడుగుజాడల్లోనే సాగుతూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ నవరత్నాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు.      

మరిన్ని వార్తలు